జనవిజయంఅధ్యయనంప్రజారోగ్యాన్ని మరచిన పాలకులు

ప్రజారోగ్యాన్ని మరచిన పాలకులు

నేడు భారత ప్రజలతో పాటు ప్రపంచ మానవాళి ఒక చిన్న వైరస్‌తో బాధపడుతోందంటే ఒక్క వైరస్‌ మాత్రమే ఈ సమస్యకు కారణం కాదు. అడవుల్నీ, పర్యావరణాన్నీ, పర్వతాల్నీ, నదుల్నీ, స్వచ్ఛమైన, అందమైన ప్రకతిని గనుల కోసమనీ, పరిశ్రమల కోసమనీ, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల కోసమనీ తమ వ్యాపార ప్రయోజనాల కోసం విధ్వంసం చేసే విధ్వంసకర అభివద్ధి, దీన్ని ప్రోత్సహిస్తోన్న పెట్టుబడిదారీ వ్యవస్థ ముఖ్య కారణంగా నిలుస్తోంది. వైరస్‌ విజృంభణకు సరైన, సత్వరమైన పరిష్కారం ఇవ్వలేని నాయకులను ప్రశ్నించడం ఒక్కటే మన కర్తవ్యం కాదు. ఇంతకంటే బలంగా భయంకరమైన వైరస్‌ లకు కారణమవుతున్న విధ్వంసక అభివద్ధినీ, వైరస్‌ విజృంభణ తర్వాత మనుషుల్ని శవాల గుట్టలుగా మార్చేసే వ్యవస్థనీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇదే వ్యవస్థ, ఇదే పాలక వర్గాలు జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ శాస్త్రవేత్తలు అందించిన వ్యాక్సిన్లను ప్రజలకు సకాలంలో అందివ్వడంలో విఫలమవుతున్నారు. ఒకవైపు ప్రజలకు వ్యాక్సిన్లు అందడంలో అంతర్జాతీయ పేటెంట్‌ చట్టాలు అడ్డుగా నిలుస్తోంటే, మరోవైపు పాలకవర్గాల నిరాసక్తత, నిర్వహణలోపం, ముందుచూపు కొరవడడం, కరువైన మానవత్వం ముఖ్య ఆటంకాలు నిలుస్తున్నాయి.ప్రజలకు సరయిన వైద్యం అందుతుందన్న గ్యారంటీ లేదు.

ఆక్సిజన్‌ సిలిండర్లు సకాలంలో ఏర్పాటుచేసే విధానం లేదు. మహమ్మారులను ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికలో సన్నాహాలు లేవు. ఏం చెయ్యాలో అర్థంకాని అస్తవ్యస్త పరిస్థితి. శ్మశాన నిశ్శబ్దం. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆసుపత్రులను బలపరచే పరిస్థితి లేదు. చుట్టూ నిస్సహాయ స్థితి. మానవజాతి ఎన్నడూ ఎదుర్కోని అత్యంత విషాదకర పరిస్థితి. సమస్యకు సరైన పరిష్కారం ఇచ్చి ప్రజలను కష్టకాలంలో ఆదుకొంటూ, వైరస్‌ కి సంబంధించిన సైన్స్‌ ని ప్రజలకు యుద్ధప్రాతిపదికతో అందించి, కనీసం రాజ్యాంగం ప్రకారమైనా శాస్త్రీయతను పెంపొందించాల్సిన ప్రభుత్వం కరోనా విషయంలో అలా చెయ్యకపోగా అందుకు విరుద్ధమైన విషయాలను, మూఢ విశ్వాసాలను ప్రచారం చేసింది. ఒక వైరస్‌ మందులతో అయినా చావాలి లేదా వ్యాక్సిన్‌ తో అయినా బలహీనమవ్వాలి. ఈ రెండూ సైన్స్‌ చదివిన ఎవరికైనా అర్థమయ్యే ప్రాథమిక విషయాలు. కానీ నాయకులు ఈ రెండూ పక్కన పెట్టి కొవ్వొత్తులు వెలిగించమనీ, బాజాలు వాయించమనీ, అలా చేస్తే ఏదో కొత్తరకం శక్తి విడుదలై కరోనా పారిపోతుందని ‘గో కరోనా గో’ అని ప్రజలకు అజ్ఞాన బోధ చేశారు. మూఢ నమ్మకాలకే సైన్స్‌ పదాలు జోడించి, అర్థం పర్థం లేని కథనాలతో చదువుకున్న వారిని సైతం అయోమయంలో పెట్టేసి కరోనాను కొవ్వొత్తులతో ”మట్టు బెట్టేశారు”. ట్యూన్‌ చేసిన రోబోట్లలా మధ్య తరగతి వరండాల్లోకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగించారు. అయితే కరోనాని ఇలాంటి మాయలతో, గారడీలతో జయించలేరని రెండోవేవ్‌ మనకు రుజువు చేసింది.

నాయకులు కరోనాను జయించలేకపోయినా ప్రజల్ని మాత్రం మంత్ర ముగ్ధుల్ని చేసి అందరిచేత అశాస్త్రీయమైన పనులు చేయించగలమా లేదా, ప్రజలందర్నీ ఒక ప్రత్యేక పరిస్థితిలో తమకు అనుకూలంగా నియంత్రించగలమా లేదా అనే పరీక్షలో మాత్రం విజయవంతమయ్యారనే తెలుస్తుంది. అయితే మూఢ భక్తికీ, అంధ విశ్వాసాలకీ చెల్లించాల్సిన మూల్యం ప్రజలు రెండోవేవ్‌ లో చెల్లించారు. కరోనా కొవ్వొత్తులకూ, బాజాలకూ, బాంబులకూ, అర్థంపర్థం లేని అతీత శక్తులకూ లొంగదనీ, ఇదంతా హేతుబద్ధత లేని మూఢమనీ, అది మరింత శక్తిని పుంజుకుని రెండోవేవ్‌ గా మన మీద విరుచుకుపడిందనీ అనుభవంతో తెలిసింది. మరోసారి ప్రజలను మభ్యపెట్టి మరో కొవ్వొత్తుల మాయాజాలాన్ని అందివ్వడానికి నాయకుల దగ్గర చిట్కాలు కరువయ్యాయి. ఎందుకంటే ప్రజలను ఎల్లవేళలా మభ్యపరచడం సాధ్యం కాదు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ ఒకవైపు, అంతర్జాతీయ మీడియా ఒకవైపు దుయ్యబడుతోంటే, ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా సరిగ్గా అందివ్వలేని ప్రభుత్వానికే ఊపిరి కరువైంది. వ్యాక్సిన్లు అతి తక్కువ కాలపరిమితిలో ప్రజలకు అందుతుండటం సంతోషించాల్సిన విషయం. ప్రపంచంలో ఇంతవరకు ఏ వ్యాక్సిన్‌కు కూడా ఇంత తొందరగా పరిశోధన పూర్తి కాలేదు. అయితే సైన్స్‌ పరిశోధనలో కార్పొరేట్ల కక్కుర్తి, అర్థం పర్థం లేని పేటెంట్‌ చట్టాలు వీటిని ప్రజల వరకు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి.

ఒకవైపు మన దేశం తన ప్రజలకోసమే వ్యాక్సిన్లను తయారు చేసుకోలేని పరిస్థితి ఉంటే, మరోవైపు 6.6 కోట్ల డోసులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పరిశోధన ప్రకారం, 93 దేశాలకు మనదేశం నుండి వ్యాక్సిన్‌ అందితే, అందులోని 88 దేశాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య మనదేశంతో పోలిస్తే అత్యంత తక్కువ. ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్‌ అయినా సార్వత్రిక టీకా పథకం కింద కేంద్ర ప్రభుత్వమే అధిక మోతాదులో కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది. భారతదేశంలో 1997లో మశూచి, 2014లో పోలియో నిర్మూలించగలగడం సార్వత్రిక ఉచిత టీకా పథకం ద్వారానే సాధ్యమయిందని ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ కూడా బల్లగుద్ది చెప్పింది.అత్యంత ప్రణాళికతో ఇలా నిర్వహిస్తేనే పోలియోను నిర్మూలించగలిగాం. ‘ఎవరి వ్యాక్సిన్‌ వాళ్లు కొనుక్కోండి’ అని ఇంతకు ముందు కూడా నిర్దేశించి ఉంటే, పోలియోను ఈ రోజుకీ నిర్మూలించలేక పోయి ఉండేవాళ్లం. ఒక్క సైన్స్‌ మాత్రమే కాదు, సైన్సును ప్రోత్సహించే ప్రజానుకూల ఆర్థిక వ్యవస్థ కూడా తోడయితేనే వ్యాక్సిన్లు ప్రజలకు చేరువవుతాయి. కానీ కరోనా వ్యాక్సిన్ల విషయంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వ్యాక్సిన్ల ‘స్వేచ్ఛా వాణిజ్యం’తో వ్యాక్సిన్లు ప్రజలకు అందడం గగన కుసుమమవుతోంది. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీకరణ పవనాలు, నయా ఉదారవాదం చివరికి వ్యాక్సిన్ల తయారీ, పంపిణీలో కూడా జొరబడి ప్రజల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పెట్టాయి.

నేడు 10శాతం మందికి కూడా వ్యాక్సిన్లు అందని పరిస్థితి. పైగా ఆగస్టుకు ముందు కోవిషీల్డ్‌ గానీ, కోవాక్సిన్‌ గానీ అందుతాయన్న గ్యారంటీ లేదు. స్పుత్నిక్‌-5 వస్తుందన్న మాట అందేవరకూ చెప్పలేం. ఇంత అస్తవ్యస్తమైన పరిస్థితి నిజంగా బాధ్యతారాహిత్యంగానే జరిగిందో, లేక స్వేచ్ఛా వాణిజ్యం సూత్రాలకు న్యాయం చెయ్యాలని ఆరోగ్యాన్ని ప్రయివేటుపరం చేసి, కార్పొరేట్లకు బంగారు పంటలు పండించాలనే ఉద్దేశంతో జరిగిందో తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ప్రజలు ఒకవైపు వ్యాక్సిన్ల కోసం పడిగాపులు కాస్తుంటే, మరోవైపు ధరల నాటకాల పర్వం తెరవెనుక కొనసాగుతుంది. వ్యాక్సిన్లను అత్యంత వేగంగా ప్రజలకు అందించి మహమ్మారుల నుంచి ప్రజల్ని విముక్తి చేయడం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం ఆ బాధ్యత మరిచినందున వైద్యంలో కార్పొరేటీకరణ కరోనా సమయంలో ఎన్ని విపత్తులను అందించిందో రోగులూ, రోగుల కుటుంబాలు చవిచూశాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న ఆసుపత్రులు కూడా మెల్లమెల్లగా పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌ నర్‌ షిప్‌ మోడల్‌ లోకి వెళ్లడానికి ఎక్కువ కాలం పట్టదు.సామాజిక న్యాయం కరువైన ప్రజా వ్యతిరేక స్వేచ్ఛా వాణిజ్యం బీజాలు నేటి కరోనా వ్యాక్సిన్ల లోకి కూడా చొరబడ్డాయని అర్థం చేసుకొని చైతన్యం కావడం నేడు అత్యంత అవసరం.

– నాదెండ్ల శ్రీనివాస్‌
సెల్‌ : 9676407140

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి