జనవిజయంఆరోగ్యంప్రైవేట్‌ ఆస్పత్రులకు ఆదాయవనరుగా మారొద్దు !

ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఆదాయవనరుగా మారొద్దు !

  • ప్రైవేటు వైద్యులకు బంగారు బాతుగుడ్డుగా మారిన కరోనా
  • భయపెడుతున్న బ్లాక్ ఫంగస్
  • పిల్లల పట్ల శాపంగా మారనున్న థర్డ్ వేవ్
  • నిపుణులు హెచ్చరిస్తున్నా నిద్రపోతున్న పాలకులు
  • అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలు

రోనా ప్రైవేట్‌ ఆస్పత్రులకు బంగారు బాతుగుడ్డుగా మారింది. రోజూ వేలాది మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. సగటున ఒక మనిషికి కనీసంగా 5 లక్షలకు తక్కువగా సమర్పించుకోవడం లేదనేది ఒక అంచనా. ఇన్ని లక్షలు చెల్లించినా బతకడం అన్నది దైవాధీనం మాత్రమే. బతికినా, చచ్చినా డబ్బు కట్టాల్సిందే. ఒక్కో కేసులో గరిష్టంగా 20 నుంచి 30 లక్షలు కూడా వసూళ్లు ఉంటున్నాయి. కరోనా పుణ్యమా అని చిన్నాచితకా నర్సింగ్‌ హోమ్‌లు కూడా ఆర్థికంగా బలపడ్డాయి. ప్రజలు ఆర్థికంగా చితికి పోతుంటే ఆస్పత్రులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి. ఈ పరిస్థితులలో కూడా ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీలపై పాలకులు పట్టించుకోవడం లేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఫిర్యాదు చేసినా.. ఆధారాలతో యూ ట్యూబ్‌ ఛానళ్లు ఘోషిస్తున్నా దున్నపోతు విూద వానపడ్డట్లుగా ఉంది పాలకుల పరిస్థితి. పాలకులకు ఎక్కడో ఏదో లింక్‌ ఉండడం, ముడుపులు అందడం కారణంగా వారు చర్యలకు ఉపక్రమించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఫార్మా కంపెనీలు, మెడికల్‌ షాపు బిజనెస్‌లు కూడా మూడు పూవులు ఆరు కాయలుగా ఉంది.

గత 14 నెలలుగా ఎన్నో లక్షల కుటుంబాలు ఛిద్రం అయ్యాయి. తమవారిని కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయి ఇప్పుడు దీనావస్థలో ఉన్నారు. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ ముగియక ముందే థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు వస్తున్నాయి. థర్డ్‌వేవ్‌ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ దాడి మొదలు పెట్టింది. ఇవన్నీ కూడా మన నిర్లక్ష్యానికి తార్కాణంగా చూడాలి. మన నిర్లక్ష్యమే మన కొంపలు ముంచుతుందని గ్రహించాలి. మన నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఆదాయవనరుగా మారుతున్నామని గుర్తించాలి. మన నిర్లక్ష్యానికి భగవంతుడినో, ప్రభుత్వాలనో నిందించడానికి కూడా మనకు బాధ్యత లేదని తెలుసుకోవాలి. ఈ క్రమంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని కట్టడి చర్యలకు ఉపక్రమించాలి. అయితే ప్రభుత్వం, పోలీసులు ఎంతగా మొత్తుకుంటున్నా ప్రజలు కూడా పూర్తి నిర్లక్ష్యంతో బాజరున పడుతున్నారు. కరోనాను వ్యాప్తి చేయడంలో వీరంతా వాహకాలుగా పనిచేస్తున్నారు. తమకేం కాదులే అని కొందరు…. తమకు కరోనా రాదని కొందరు..తమకు అసలు కరోనా లేదని మరికొందరు ఇలా ఎవరికి వారు రోడ్డున పడి ఇతరులకు కరోనా అంటించి వారి మరణాలకు కారణం అవుతున్నారు. ప్రజల్లో కొట్టొచ్చినట్లుగా నిర్లక్ష్యం కానవస్తోంది. పోలీసులు లాఠీలు పెట్టి అదిలించినా వారు రోడ్డున పడకుండా ఉండలేక పోతున్నారు. తమ కారణంగా మొత్తం సమాజం బాధపడుతున్నదన్న ధ్యాస వారిలో కానరావడం లేదు.

ఈ క్రమంలో థర్డ్‌వేవ్‌ హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా, వేగంగా కదలాలి. ప్రజలకు ఎలాంటి నిర్మాణాత్మక సహకారం అందించాలన్నదే ప్రస్తుతం లక్ష్యం కావాలి. కరోనా రెండో ఉధృతి దేశంలో సృష్టిస్తున్న అలజడి అసాధారణంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉందని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో సహా వివిధ రాష్ట్రాల హైకోర్టులు కోవిడ్‌ నియంత్రణ విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాయి. తమ ఆదేశాలతో ప్రభుత్వాలను పరుగెత్తిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఏదో రూపంలో కరోనా కట్టడి చర్యలను అమలు చేస్తున్నాయి. అత్యవసర సేవలకు మినహాయింపునిస్తూ రెండు ప్రభుత్వాలు నిషేధాలను ప్రకటించాయి. ఒకవైపు టీకా పక్రియ సాగుతున్న ఈ తరుణంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా పరిమిత కట్టడిని అవలంబిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రజల వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయి. వారు చీమలదండులా వీధుల్లో పడుతున్నారు. పనివున్నా లేకపోయినా కరోనా కట్టడికి తమవంతు బాధ్యతను విస్మరిస్తున్నారు.

సంపూర్ణ లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలకు దెబ్బ తగులుతుందన్న భావనలో ప్రభుత్వాలు పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. ఆర్థికవ్యవస్థ విషమిస్తున్న పరిస్థితుల దృష్ట్యా ఈ రకమైన విధానాలు తప్పట్లేదు. కరోనా మహమ్మారి విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపూర్ణ టీకాయే ఉత్తమ పరిష్కారమనే ఏకాభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ లోపున వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోకపోతే, టీకా కృషి కూడా ఆశించిన ప్రయోజనం ఇవ్వదని నిపుణులంటున్నారు. వైరస్‌ పలు వైవిధ్య రూపాల్లోకి మారుతూ, విశృంఖల వ్యాప్తి జరిగితే మనకే నష్టం. మనకు నష్టం జరక్కుండా ఉండాలంటే ఎవరికి వారు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ విధించుకోవాలి. గతేడాది అనుభవం దృష్ట్యా ఇప్పుడు మనలను మనమే కట్టడి చేసుకుంటూ భౌతికదూరం పాటించాలి. మాస్కు ధరించాలి. రోడ్లపై విచ్చలవిడిగా తిరగడం మానుకోవాలి. క్షేత్ర పరిస్థితుల్ని బట్టి ఎవరికి అవసరమైన తరహాలో వారు కట్టడి విధించుకోవాలనీ ప్రధాని మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.

కేసులు ఎక్కువ ఉన్న పది దేశాల్లో వైరస్‌ వ్యాప్తిపై అధ్యయనం జరిపిన కేర్‌ క్రెడిట్‌ సంస్థ, భారత్‌లో కట్టడి బాగా పనిచేస్తోందని, కేసులు తగ్గుతున్నాయని వెల్లడించింది. కోవిడ్‌ రెండో ఉధృతిలో పల్లెలు అల్లాడుతున్నాయి. గ్రావిూణ భారతం క్రమంగా కరోనా కోరల్లోకి జారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అసాధారణ మరణాలు నమోదవుతున్నాయి. సర్కారు లెక్కలకెక్కని చావులు వేలాదిగా ఉంటున్నాయి. వైద్య సదుపాయాలు, ఉపశమన చర్యలు పెద్దగా లేవు. వైద్య పరీక్షల వ్యవస్థ బలోపేతం చేసి, ఆస్పత్రుల్లో సదుపాయాల్ని పెంచాలి. ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపరచాలి. కట్టడితో ఉపాధికోల్పోయి అల్లాడే పేద,బడుగు కుటుంబాలను ఆదుకునే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. రోగనిరోధకత పెంచే పౌష్టికాహారాన్ని సామాన్యులకు అందించాలి. పౌర సమాజం కూడా తమవంతు సహకారం అందించాలి. అత్యవసరమైతే తప్ప గడప దాటొద్దన్న కఠిన నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. లేకుంటే మనం నష్టపోవడమే గాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని కలగచేసిన వారం అవుతున్నాం. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు మనమే ఆదాయవనరుగా మారుతున్నాం. ఇలా ఆదాయవనరుగా మారి మనం జనాభా లెక్కల్లో లేకుండా పోదామా లేక ఉందామా అన్నది ఎవరికి వారు ఆలోచించాలి. మన సామాజిక బాధ్యతను గుర్తించి మసలుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీని అరికట్టి సామాన్యులకు వైద్య సేవలను అందుబాటులోకి తేవాలి. ప్రజల ఉపాధి గురించి ఆలోచన చేయాలి. గోదాముల్లో ముక్కిపోతున్న ధాన్యపు రాసులను పేదలకు అందచేయాలి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అండగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి