జనవిజయంఆంధ్రప్రదేశ్ప్రజాధనం పందేరం... అభివృద్ధి అవుతుందా?

ప్రజాధనం పందేరం… అభివృద్ధి అవుతుందా?

సంక్షేమ పథకాలు వేరు.. తాయిలాలు వేరు… వివిధ పథకాల పేరుతో ప్రజలకు నగదు బదిలీ చేయడమన్నది వారిని ప్రలోభాలకు గురిచేయడం తప్ప మరోటి కాదు. చంద్రబాబు హయాంలోనే ఇది మొదలు అయ్యింది. నేరుగా నగదు బదిలీ చేయడం అన్న పద్దతి సరైంది కాదు… దీంతో అభివృద్ధి కుంటు పడుతుంది. ఎపిలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సిఎం జగన్ పాలనపై ఇటీవలే ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. తాను చేస్తున్న నగదు బదిలీ చర్యలను నంక్షేమ కార్యక్రమంగా నిఎం జగన్ సమర్థించుకోవచ్చు.నగదు తీసుకున్న వారికి కూడా బాగానే ఉంటుంది. తెలంగాణలో రైతుబంధు కింద భూమి ఉన్న వారికి ప్రతి వారికి ఎకరానికి పదివేల చొప్పున నగదు బదిలీ జరుగుతోంది. దీంతో ప్రజలు చెమటోడ్చి కట్టిన పన్నులు ఇలా వృధా అవుతున్నాయి. రైతులకు ఇప్పటికే ఉచిత విద్యుత్ అందుతోంది. వారిపై ప్రేమ ఉంటే ఆ డబ్బును ధాన్యం సేకరణకు వినియోగించాలి. అలాకాకుంటే అనర్హులను రైతుబంధు జాబితా నుంచి తొలగించాలి. వ్యవసాయ యోగ్యంగా లేని భూములకు సైతం వేలాదిమంది రైతుబంధు పొందుతున్నారు. అలాగే కేంద్రం కూడా నగదు బదిలీ పథకాన్ని కొనసాగిస్తోంది. రైతుల ఖాతాల్లో నేరుగా నగదు వేస్తున్నారు.

వీటన్నింటిని మించి ఎపిలో ప్రతి పథకం కింది ఆయా వర్గాలకు నగదు బదిలీ జరుగుతోంది. ఇది ఓటుబ్యాంక్ రాజకీయాలకు పనికి వస్తుందే తప్ప ప్రజల లేదా ఆయా వర్గాల అభివృద్ధికి ఇసుమంత కూడా ఉపయోగపడదని గుర్తించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేవలం రాజకీయంగా మరింత బలపడాలనే దృక్పథంతో తీసుకుంటున్న నిర్ణయాలుగానే చూడాలి. వీటిని వైకాపా లేదా లబ్దిదారులు సమర్థిస్తున్నట్లుగానే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. యువకుడుగా ఉన్న వ్యక్తి సిఎం కావడం వల్ల కొత్త ఆలోచనలతో ఎపిని పరుగులు పెట్టిస్తారని అంతా భావించారు. అభివృద్ధి, నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఈ డబ్బును వెచ్చించి ఉపాధి రంగాన్ని బలోపేతం చేసివుంటే ఎపి దిశ మరోలా ఉండేది. సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని పంచిపెడుతూ బలమైన ఓటు బ్యాంకును నిర్మించు కుంటున్న తీరు అభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. అలాగే పాలనలో పారదర్శకత లోపించింది. సమస్యలను తెలుసుకునే బదులు వాటిని వెలిబుచ్చిన వారిపై వేధింపులు జరుగుతున్నాయి.

రాజకీయ ప్రత్యర్థులను వేటాడి వేధించడమే ప్రధాన ఎజెండాగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు అధికారం చేపట్టిన వెంటనే ప్రజావేదికను ఆగమేఘాలపై కూల్చివేసిన తీరుతో విమర్శలకు గురయ్యారు. నిజానికి దానిని వాడుకుని ఉంటే ప్రజాధనం వృధా అయ్యేది కాదు. అధికారులు కూడా తప్పుడు సలహాలు ఇస్తూ కూల్చివేతలను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి అక్రమ నిర్మాణాలు ఉంటే నోటీసులు ఇచ్చి, ఓ పద్ధతి ప్రకారం కూల్చేస్తే బాగుండేది. రాష్ట్రంలోని ఇతరుల అక్రమ నిర్మాణాల గురించి మరిచిపోయి కేవలం ప్రతిపక్షమైన తెలుగుదేశం నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చడానికే యంత్రాగాన్ని వినియోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే టిడిపి నేతలపై పనిగట్టుకుని పెడుతున్న కేసులు చూస్తుంటే.. తనపై ఉన్న కేసుల గురించి జగన్ మరచిపోయారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వివిధ సందర్భాల్లో తరచుగా న్యాయవ్యవస్థతో ఘర్షణ పడుతున్నారు. అదేపనిగా టీడిపిని, దాని నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం వల్ల ఇతరత్రా కార్యక్రమాలపై ధ్యాస పెట్టడం లేదా అని అనిపిస్తోంది. టిడిపి నాయకులపై వరున కేసులు, అరెస్టులు చూస్తుంటే అక్రమాలను వెలికి తీసే బదులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుంది. పీసీబీ అధికారులు జువారీ సిమెంట్స్, అమర్ రాజా బ్యాటరీన్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలను మూసివేయించడానికి పూనుకున్న తీరుతో జగన్ అభాసు పాలయ్యారు. నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించవలసిన అధికారులు అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. |

న్యాయస్థానాలు అడ్డుపడిన ప్రతి సందర్భంలోనూ తప్పులను సరిదిద్దుకోకపోగా ఎదురుదాడికి దిగుతున్నారు. ఇది పాలకులకు మంచి పని కాదని గుర్తించడం లేదు. అధికారులు కూడా ఏదేని నిర్ణయంలో పూర్వాపరాలు ఆలోచించడం లేదని అనిపిస్తోంది. నిజానికి పాలకులు అంతా కూడా తమకు ప్రజలు ఓట్లేసారని, ప్రజలకు జవాబుదారీ అంటూ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకు మోడీ కూడా మినహాయింపు కాదు. ఆయన కూడా ఇదే పద్ధతిలో ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే పనిలో ఉన్నారు. పాలన న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా సాగడం లేదు. అధికారులు సైతం ముఖ్యమంత్రిని లేదా ప్రధానమంత్రిని సంతృప్తి పరచడమే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసి న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రంలో ప్రధాని మోడీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కోర్టుల ముందు నిలవడం లేదు. ఆయా రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరాలు చెప్పడం, ఉత్తర్వులను నిలిపి వేయడం చూస్తూనే ఉన్నాం. పేదలకు మేలు చేయాలనుకుంటే కోర్టులు అడ్డుకుంటున్నాయని నిందిస్తున్నారు.

కేవలం సంక్షేమం పేరుతో ప్రజల డబ్బును పందేరంగా చేస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు కోర్టులు కూడా వీటిని అడ్డుకోక మానవని గుర్తించాలి. పాలకులు తమ రాజకీయ ఎజెండాను అమలు చేయడం కోసం ప్రజాధనాన్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దానినే అభివృద్దిగా చెబితే ప్రజలను నమ్మరని గత అనుభవాలు చెబుతున్నాయి. అన్నింటిని మించి ఎపిలో జగన్ ప్రభుత్వ ఈ పందేరాలకు ఇక స్వస్తి పలికి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రజకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే పనులు చేపట్టి కొత్త రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుని పోయేలా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అనేక వనరులున్న ఎపిని అభివృద్ధి పట్టాలకు ఎక్కించగలిగితే జగన్‌కు మంచి పేరు వస్తుందనడంలో సందేహం లేదు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి