Saturday, February 24, 2024
Homeపరిపాలనప్రజాసమస్యలే ఎజెండా కావాలి !

ప్రజాసమస్యలే ఎజెండా కావాలి !

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గురువారం అంటే ఫిబ్రవరి1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ప్రభుత్వంలో చివరిది అంటే…మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టబోతున్నారు. ఇదంతా షరా మామూలుగా జరిగే వ్యవహారమే. ఇందులో అద్భుతాలకు తావులేదు. కాబట్టి ప్రతిపక్షాలు గతానుభవాలను దృష్టి పెట్టుకుని పార్లమెంటులో వ్యూహాత్మకంగా నడచుకోవాలి. సమస్యలను ఎజెండాగా చేసుకుని ముందుకు సాగాలి. ఇవే చివరి సమావేశాలు కనుక..ఏయే అంశాలను చర్చించగలరో బిఎసిలో నిర్ణయిస్తారు. ఎన్నిరోజులు సమావేశాలు సాగుతాయో తెలుస్తుంది. అందువల్ల పార్లమెంట్‌ పరిధిలోనే చర్చించడం అన్న విద్యను విపక్షాలు అలవాటు చేసుకోవాలి. గందరగోళం సృష్టించడం, వాయిదాలు పడేలా చేయడం అన్నది అధికార పార్టీకే కలసివచ్చే అంశంగా చూడాలి. ఇకపోతే పదేళ్ల మోడీ పాలనలో ఏం అద్భుతాలు జరిగాయ న్నదే ఈ యేడు ప్రజలముందున్న ప్రధాన చర్చగా చూడాలి. ఇక దేశ రాజకీయాలను చూస్తే మోడీ తిరుగు లేని నేతగా ఎదిగారు. అటు దేశంలోనూ..ఇటు బిజెపిలోనూ ఆయనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కాంగ్రెస్‌తో జతకట్టి మోడీని ఢీకొంటామని సంచి భుజాన సంచీ వేసుకుని బయలుదేరిన నితీశ్‌ కుమార్‌ కూడా చాపచుట్టేశాడు. ఈ క్రమంలో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. అధికార సాధనే లక్ష్యంగా రాజకీయ పక్షాలు ప్రాధాన్యమిస్తున్నాయని నితీశ్‌ కుమార్‌ నిరూపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ’ఇండియా’ కూటమికి చెందిన దాదాపు 150 ఎంపీలను బహిష్కరించిన తరవాత ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో విపక్షాలు ప్రజా సమస్యల చర్చించడం ద్వారా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. బరితెగించి గొడవ చేయడం ద్వారా సాధించేదేవిూ లేదని గత సమావేశాల్లో నిరూపించు కున్నారు. ప్రజల పక్షాన సమస్యలను శాంతియుతంగా చర్చ చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. అయోధ్యలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో దేశమంతా రామనామజపంతో పాటు మోడీ జపం మార్మోగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం సార్వత్రక ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి, మూడోసారి అధికారంలోకి ఎలా రావాలన్న విషయంపైనే కసరత్తు చేస్తున్నారు. అయోధ్యను బహిష్కరించడం ద్వారా విపక్షాలు ప్రజల్లో ఆదరణ కోల్పోయాయి. అయోధ్య అన్నది ప్రజల సెంటిమెంటుతో కూడుకున్న విషయం గా చూడాలి. అయోధ్యను బహిష్కరించడం ద్వారా మోడీ ప్రతిష్ట పెరిగిందే తప్ప తగ్గలేదు. దాదాపు ఐదు శతాబ్దాల సమస్యకు అదీ భారతీయుల సెంటిమెంటుతో ముడిపడివున్న సమస్యను చులకన చేయడం ద్వారా కాంగ్రెస్‌ తదితర పార్టీలో భారీతయుల దృష్టిలో చులకన అయ్యారు. దీనికితోడు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు కూడా ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగించాయి. రాముడి ప్రాణప్రతిష్ఠ మూలంగా ఏర్పడిన భావోద్వేగాలు అంతా ఇంతా కాదు. అయితే రాజకీయంగా దూసుకుపోతున్న మోడీ కేవలం సెంటిమెంటునే నమ్ముకోలేదు. ఎన్నికల్లో గెలవడం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బగొట్టడంతో పాటు వాటిని కకావికలం చేయడంపైనే ప్రధాన దృష్టి సారించారు. గత కొద్ది రోజులుగా సంభవిస్తున్న పరిణామాలను బట్టి చూస్తే మోడీ వ్యూహం ఏమిటో అర్థమవుతుంది. గతంలో బిజెపి అనుసరించిన వ్యూహాలకు మోడీ, అమిత్‌ షాల గుప్పిట్లో ఉన్న బిజెపి అనుసరిస్తున్న వ్యూహాలకు తేడా గమనించాలి. వరుసగా మూడోసారి కూడా అధికారం లక్ష్యంగా వారి వ్యూహాలు ఉంటున్నాయి.
మూడు ఉత్తరాది రాష్టాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో విపక్షాల్లో అయోమయం ఏర్పడిరది. నితీశ్‌ కుమార్‌ వెనకడుగు వేయడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. బిహార్‌ నేత కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం, నితీశ్‌ను ఎన్డీఏలో చేర్చుకోవడం వ్యూహాత్మకంగా జరిగింది. ఉత్తరాది రాష్టాల్ల్రో విజయం తర్వాత మోదీ దూకుడుగా వ్యవహరించి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలందర్నీ గెంటేసి కీలకమైన బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదించుకున్నారు. అయినా విపక్షాలు ఏవిూ చేయలేకపోయారు. రాహుల్‌ పాదయాత్రతో ప్రజల్లో బాగా ఇమేజ్‌ సంపాదించానని సంతోషపడుతున్నారే తప్ప ప్రజల్లో ఉన్న సమస్యలపై చర్చించడం లేదు. తమ పదేళ్ల హయాంలో ఏమేం పనులు చేయలేక పోయామో.. మోడీ పాలనలో ఉన్న సమస్యలేమిటో నిజాయితీగా చర్చించడం లేదు. ఇకపోతే ఇండియా కూటమి నేతలు వివిధ అంశాలపై ప్రజలకు స్పష్టమైన నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి. పార్లమెంట్‌ చివరి సమావేశాలు జరుగుతున్న సమయంలో విపక్షాలు ఐక్యతతో ప్రజల సమస్యలను ఏకరువు పెట్టగలగాలి. ప్రజలకు విశ్వాసం కలిగించగలగాలి. పార్లమెంటులో సమస్యలపై చర్చ చేయగలగాలి. సభను స్తంభింప చ ఏయడం అన్నది పాతపద్దతి. సంయమనంతో పార్లమెంట్‌ పద్దతుల్లో చర్చలకు దిగాలి. సమస్య ఏదైనా చర్చ జరిగేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. మోడీని లక్ష్యంగా విమర్శలు చేయకుండా మోడీ అనుసరిస్తున్న విధానాలను చర్చ జరిగే కార్యక్రమాలకు పదను పెట్టాలి. అప్పుడే కొంతయినా కదలిక వస్తుంది. కేవలం మోడీని, మతాన్ని తిట్టిపోస్తే ఇంకెంతోకాలం ఈ దేశ ప్రజలు విపక్షాలను నమ్మకపోవచ్చు. అలాగని మోడీని నిలువరించలేమని భావించి ముందుకు సాగడం కూడా కష్టమే. ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా విజ్ఞతను ప్రదర్శిస్తారు. వారి మనసులు గెల్చుకునే అద్భుతాలు చేయగలమన్న నమ్మకం కలిగించిన వారిని ఆదరిస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments