Saturday, February 24, 2024
Homeవార్తలుమణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి మౌనం విడాలి

మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి మౌనం విడాలి

మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి మౌనం విడాలి

  • నిందితులను కఠినంగా శిక్షించాలి
  • మణిపూర్ లో అల్లర్లను అరికట్టలేని బిజెపి ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుదర్శన్ డిమాండ్

ఖమ్మం, జూలై 22 (జనవిజయం):

మణిపూర్ బిజెపి పాలిత రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వంపై ప్రధానమంత్రి నోరు విప్పి మాట్లాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం జిల్లా కేంద్రం సుందరయ్య భవన్ లో సిపియం జిల్లా కమిటీ సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యతన జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లడుతూ, మణిపూర్ ఘటన దేశాన్ని కలిచి వేసినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం, మహిళల పట్ల బిజెపి ప్రభుత్వ వైఖరి అర్థమవుతుందని, బిజెపి పాలిత ప్రాంతమైన మణిపూర్ లో మహిళలకు రక్షణ లేదని నేడు జరిగిన సంఘటనతో అర్థమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంఘటన జరిగి 75 రోజులు గడుస్తున్నా కనీసం ప్రధానమంత్రి ఘటనపై మాట్లాడకుండా ప్రతిపక్షాలు ఎంత మొరపెట్టుకున్నా మణిపూర్ అల్లర్లకు సంబంధం లేనట్టుగా దేశ ప్రధాని వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళల పట్ల దాడులు, అత్యాచారాలు, హత్యలు అత్యధికం అవుతున్నా, కనీసం రక్షణ కల్పించలేని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉండడం దురదృష్టకరమని, రానున్న కాలంలో మహిళల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా ఉండబోతోందని అర్థమవుతుందని వారు తెలిపారు.

వెంటనే మణిపూర్ ను రక్షించాలని, మహిళలను నగ్నంగా ఊరేగించిన వారిని వెంటనే కఠినంగా శిక్షించి మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మణిపూర్ లో ముగ్గురు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించి సామూహిక అత్యాచారం చేయడాన్ని యావత్ భారతదేశం అసహ్యించుకుంటోందని, యిందుకు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రధాన కారణమని విమర్శించారు.

బిజెపి భేటీ పడావో, బేటి బచావో అనే నినాదం మాటలకే పరిమితంగా ఉన్నదని అన్నారు. మణిపూర్ లో వెంటనే శాంతి నెలకొల్పాలని కోరారు. మణిపూర్ లోని గిరిజన ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ప్రజలకు రక్షణ కల్పించలేని రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి గత మూడు నెలల నుండి మణిపూర్ను సందర్శించడానికి సమయం దొరకడం లేదు కానీ, విదేశీ పర్యటనలు, దేశంలో వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేయడానికి సమయం దొరుకుతుందని అన్నారు.

బిజెపికి ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. మణిపూర్లో జరిగిన ఘటనను దేశ ప్రజలందరూ ఖండించాలని కోరారు. మణిపూర్ లో వందలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని, మణిపూర్ లో ఏం జరుగుతుందో, ఏం చర్య తీసుకుంటున్నారో ఇప్పటివరకు దేశ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేని దుస్థితి నేడు దేశంలో నెలకొని ఉందని విమర్శించారు.

మణిపూర్ లో మహిళలపై ఇలాంటి ఘటనలు వందలాది జరిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించడం సిగ్గుచేటని, అల్లర్లను నివారించలేని బిజెపి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మణిపూర్ అల్లర్లల ద్వారా రాజకీయంగా లబ్ది పొందడానికే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. సుదర్శన్ మాట్లాడుతూ, మణిపూర్ ఘటనపై 25న ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మణిపూర్ ఆదివాసులకు సంఘీభావంగా కార్యక్రమాలను జిల్లాలో చేయాలని అన్ని జిల్లాలు చేయాలని పార్టీ సభ్యులు, ప్రజా సంఘాలు, వామపక్ష శ్రేయోభిలాషులు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. 54 శాతానికి పైగా ఉన్న మైథిలి కులస్తులకు కుకీ, నాగా గిరిజన తెగల మధ్య బిజెపి తన రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టిందని విమర్శించారు.

గిరిజన చట్టాలను అతిక్రమించి మైతీలను గిరిజనలుగా మార్చడానికి ఒడిగట్టిందని తెలిపారు. ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేస్తుందని పేర్కొన్నారు. దీన్ని ప్రతిఘటించిన కుకి, నాగ తెగలపై మతోన్మాద శక్తులు బిజెపి అండతో రెండున్నర నెలలుగా తీవ్రమైన దాడులకు తెగబడుతున్నాయని విమర్శించారు. గృహ దహనాలు చర్చీలతో పాటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. ఈ హింసాత్మక ఘటనలకు కేంద్రం, మణిపూర్ రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలు బాధ్యత వహించి, దోషులను శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని సుదర్శన్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పోన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, బండి రమేష్, బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, వై విక్రం, సిహెచ్. కోటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావుతో పాటు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు హాజరైనారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments