ప్రభుత్వ పాఠశాల భూమికి రైతుబంధు
- లేనిభూమికి పట్టా మంజూరు
- అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట..?
- 50 సం.లుగా సాగుచేసుకుంటున్న రైతుకు తీవ్ర అన్యాయం
- విలేకరుల సమావేశంలో డాక్యాతండా బాధితులు
ఖమ్మం, జూలై 24 (జనవిజయం) :
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల రెవెన్యూ, డాక్యాతండా గ్రామ సర్వేనెంబర్ 830 లో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిందని, అదేవిధంగా సర్వేనెంబర్ 825లో దేవాదాయశాఖకు చెందిన 4.16 ఎకరముల భూమి ఉందని, ఈ భూమిపై మంగళగూడెంకు చెందిన పెంట్యాల శ్రీనివాసరావు, దామ శ్రీలతలు భూ ఆక్రమణచేసి కోళ్లఫారం నిర్మించి రైతులకు చెందాల్సిన రైతుబంధు డబ్బులను కాజేస్తున్నారని భూక్య హరిలాల్, మాలోత్ మల్సూర్, మాలోత్ వీరన్న, భూక్య శ్రీనులు ఆరోపించారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మాలోత్ మల్సూర్ అనే రైతు 830 సర్వే నెంబర్లో ఉన్న 10.28 ఎకరాల భూమిలో తనకున్న మూడు ఎకరాల భూమిని గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడని, ఇట్టి భూమిని కూడా పెంట్యాల శ్రీనివాసరావు పేరుతో అక్రమంగా భూ బధలాయింపు చేసుకొని రైతుబంధు పొందుతున్నాడని ఆరోపించారు. అదేవిధంగా సర్వేనెంబర్ 825లో 15.20 ఎకరాల భూమిలో 4.16 ఎకరాల దేవాదాయ శాఖకు చెందిన భూమి ఉందని, అట్టి భూమిని కూడా పెంట్యాల ప్రసాద్, పెంట్యాల హనుమంతరావుల పేర్ల మీదకు భూ బదలాయింపు చేసుకొని అక్రమంగా రైతుబంధు పొందుతున్నారని ఆరోపించారు.
జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేసి 830 సర్వేనెంబర్ ను బ్లాక్ చేయాలని విజ్ఞప్తి చేశారు. గత 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పించి న్యాయం తమకు చేయాలని వేడుకున్నారు. అదేవిధంగా అక్రమంగా అడ్డదారిలో ప్రభుత్వ పాఠశాల, దేవాదాయశాఖలకు చెందిన భూములను తమ పేర్లతో భూ బదలాయింపు చేసి రైతుబంధు పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మాలోతు రాములు, మాలోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.