ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంమే రామాలయం పరిసర ప్రాంత ముంపు – సిపిఎం
- సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితుల ధర్నా
భద్రాచలం,జూలై 20 (జనవిజయం):
ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగానే రామాలయ పరిసర ప్రాంతాలు ముంపుకు గురైనట్లు సీపీఎం ఆరోపించింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, తక్షణమే పెద్ద మోటార్లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని తోడించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బాధితులు గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆర్డీవో రత్నమాలకి తమను ముంపు నుండి రక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డిలు మాట్లాడుతూ భద్రాచలం రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. దాని ఫలితంగానే నేడు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని విమర్శించారు. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ప్రవహిస్తున్న సమయంలో భద్రాచలం పట్టణంలోని రామాలయం పరిసర ప్రాంతాలు, విస్తా షాపింగ్ కాంప్లెక్స్ వరద నీటికి ముంపుకు గురైందని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని అన్నారు.
అధికారులు రివ్యూ మీటింగ్ లు పెట్టుకొని చేసింది ఏమిటని ప్రశ్నించారు. వర్షాలు తీవ్రంగా పడుతూ గోదావరి ఉధృతి పెరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు హడావుడిగా ఇరిగేషన్ అధికారులు కరకట్ట స్లూయిజు లాకులు మరమ్మతులు చేస్తున్నారని, ఇదేమిటని అధికారులను అడిగితే ఎస్టిమేషన్లు పంపినా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాలేదని, మమ్మల్ని ఏం చేయమంటారని సమాధానం చెప్పడం దారుణమని అన్నారు. గోదావరి వరద ముంపు పట్ల, భద్రాచలం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు విమర్శించారు. గత సంవత్సరం వచ్చిన వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందే మేలుకోవాల్సిన ప్రభుత్వం నేటికీ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. గత సంవత్సరం 1000 కోట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదని సీపిఎం నేతలు దుయ్య బట్టారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు మీనమేషాలు లెక్కపెట్టకుండా గోదావరి వరద ముంపు నుండి భద్రాచలం పరిసర ప్రాంతాలను కాపాడడం కోసం సత్వరమే చర్యలు చేపట్టాలని, రామాలయం విస్తా కాంప్లెక్స్ ముంపుకు గురికాకుండా గత సంవత్సరం మాదిరిగా సింగరేణి, బిపిఎల్ వారి సహకారంతో పెద్ద మోటార్లు ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు ఎస్ రామకృష్ణ, సీనియర్ నాయకులు ధనకొండ రాఘవయ్య, శ్రీనివాస్ ముంపు బాధిత ప్రజలు పాల్గొన్నారు.