పల్లా కొండలరావు,ఖమ్మం
తెలంగాణలో ఎన్నికల పొత్తు విషయంలో వామపక్షాలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో చిగురించిన బీఆర్ఎస్ -కామ్రేడ్ల పొత్తు 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా? ఇప్పటిదాకా…. ఇంకా చెప్పాలంటే ఇరుపక్షాలు పైకి చెప్పే మాటలు ప్రకారం ఇప్పటికీ కామ్రేడ్లతో గులాబీ పార్టీకి పొత్తు ఉంటుంది. సిపిఐ అయితే ఈ పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ప్రకటించగా, సిపిఎం మాత్రం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తామని సన్నాయినొక్కులు నొక్కింది. దీనికి కారణం క్యాడర్ లో వ్యతిరేకతతో పాటు కేసీఆర్ పై అపనమ్మకం. ఇపుడదే నిజం కాబోతోందనిపిస్తోంది. కారు ఎక్కి హుషారుగా తిరగడానికి కామ్రేడ్లకు గులాబీ బాస్ అవకాశం ఇవ్వడం లేదనేది తాజా సమాచారం. కేవలం చెరొక ఎమ్మెల్సీ సీటు ఇచ్చి సర్దిచెప్పాలన్నది కేసీఆర్ ప్లాన్. ఎమ్మెల్యే సీట్లు అయితే వామపక్షాలు గెలవవనీ, సిట్టింగ్ లను కాదని కామ్రేడ్లకు సీట్లు ఇస్తే అసలుకే ఎసరు వస్తుందనేది ఆయన అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సీటు ముఖ్యమే గనుక వామపక్షాలకు చెరొక ఎమ్మెల్సీ సీటు ఇచ్చి సంతృప్తి పరచాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ విషయాన్ని ఆయన డైరెక్ట్ గా ప్రకటించకుండా మంత్రులు మల్లారెడ్డి, తలసానిలతో పాటు చోటా నేతలతో లీకులు ఇస్తున్నారు. ఈ విషయం అధిష్ఠానానికి తెలుసని తాము అనుకోవడం లేదని వామపక్షాలు పైకి ప్రకటిస్తున్నప్పటికీ ఓ ప్రాంతీయ పార్టీలో కీలకమైన నిర్ణయాలు చోటానేతలకు మాట్లాడే అవకాశం ఉండదని తెలియని అమాయకత్వంలో వామపక్షాలు ఉంటాయనుకోలేము. వారు కూడా అప్రమత్తం అవుతున్నారు. కేసీఆర్ తమను అవమానకరంగా సీట్లు కేటాయించాలని చూస్తే కాంగ్రెస్ తో కలవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలంగా ఉన్న కామ్రేడ్లు అక్కడ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ లో స్థానిక పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఒకవేళ సీట్లు కేటాయించినా బీఆర్ఎస్ ఓట్లు కామ్రేడ్లకు బదిలీ అవుతాయని నమ్మకం లేదని బీఆర్ఎస్ శ్రేణులు నుండి వినిపిస్తున్న మాట. క్లిష్ట పరిస్థితుల్లో గెలిచే అవకాశం ఉన్న ఏ ఒక్క సీటును వదులుకునే పరిస్థితిలో కేసీఆర్ లేరు. అదే కాంగ్రెస్ పార్టీ లో అయితే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వామపక్షాలకు సీట్లు ఇచ్చేందుకు ఇబ్బంది లేదు. మరికొన్ని అదనపు సీట్లు కేటాయించైనా వామపక్షాలను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.అయితే గత అనుభవాలు రీత్యా కాంగ్రెస్ తో పొత్తుకు కమ్యూనిస్టు నాయకులు భయపడుతున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం పొత్తును కోరుతున్నారు. వామపక్షాలు గెలిస్తే కేసీఆర్ కి అమ్ముడుపోరని తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఆ సోయి లేదు. వస్తుందన్న నమ్మకమూ ప్రస్తుతానికి లేదు. వామపక్షాలకు సీట్లు కేటాయించినా రెబల్స్ పోటీచేయరన్న గట్టి హామీ ఇచ్చే స్థితిలో రేవంత్ రెడ్డి గానీ, అధిష్టానం కానీ ఉన్నదా? ఇదే అసలు సమస్య. గతంలో అలా జరగబట్టే ప్రస్తుతం కేరళ మినహా దేశమంతా కాంగ్రెస్ తో పొత్తుకు సుముఖంగా ఉన్న కామ్రేడ్లు తెలంగాణ కాంగ్రెస్ ను నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆ నమ్మకం కలిగించగలిగితే, ఆచరించగలిగితే తెలంగాణ వ్యాప్తంగా అనూహ్య మార్పులు అనివార్యంగా చోటుచేసుకోవడం ఖాయం. బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయితే కామ్రేడ్లు కు కూడా ఏ ఇబ్బందీ ఉండదు. బీఆర్ఎస్ తో పొత్తు పట్ల ప్రజల్లో, తమ క్యాడర్ లో ఉన్న గందరగోళం కూడా పోగొట్టుకునే వీలుకూడా చిక్కుతుంది. అయితే ఆ పరిస్తితి కాంగ్రెస్ కల్పించలేకపోతే కామ్రేడ్లు మాత్రమే కలసి, ఇతర కలిసి వచ్చే చిన్న చిన్న శక్తులతో కలసి రాష్ట్రమంతటా విస్తృతంగా పోటీ చేసేందుకు కూడా కామ్రేడ్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం.