భద్రాచలం ఎన్నికల బరిలో పూనెం వీరభద్రం!?
జనవిజయం,11 జూలై: రాష్ట్ర ఎన్నికల సమయం ఆసన్నమవుతున్నా భద్రాచలం నియోజకవర్గంలో రాజకీయ హడావుడి అంతగా కనబడటంలేదు.కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలలో కొంత స్తబ్దత నెలకొన్నట్లు గా కనబడుతోంది.ఇటీవలే బి.ఆర్.ఎస్.పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి మరియు భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇంచార్జి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి కొంత బలాన్ని చేకూర్చినట్లే అయింది. ఈ సమయంలో అధికార పార్టీ తరుపున భద్రాచలం నియోజకవర్గ బరిలో ఉండే అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోంది.కమ్యూనిస్టు పార్టీలు సహితం వాళ్ళ అభ్యర్థులను బహిరంగ పరచకపోవడం అధికార పార్టీకి వారికి మధ్య ఎన్నికల పొత్తు పై పలు ఊహాగానాలకు తెర లేపుతోంది.
ఇది ఇలా ఉండగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు పూనేం వీరభద్రం రానున్న ఎన్నికల్లో భద్రాచలం బరిలో ఉంటాడని పలు గిరిజన సంఘ నాయకులు మాట్లాడుకోవడం ఈ నియోజకవర్గంలో కొంత చర్చనీయాంశంగా మారింది.M.A.M.Ed చదివి, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా భద్రాచల నియోజకవర్గ లో పనిచేసిన పూనెం వీరభద్రం వివాద రహితుడిగా.. గిరిజనులకు, గిరిజనేతరులకు సన్నిహితుడిగా ఉన్నారు.అంతే కాదు విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి సంఘాలలో పనిచేసిన అనుభవం కూడా ఉంది.మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఉన్న ఇద్దరు అధికార పార్టీ ఎం.ఎల్.సి లతో పూనేం వీరభద్రానికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.ఏది ఏమైనప్పటికీ భద్రాచలం ఏజన్సీ ఏరియాలో కొంత పట్టున్న పూనెం ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.