పోలవరం ముంపు ప్రమాదంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం
యునెస్కో దృష్టికి తీసుకెళ్లి ఆదివాసులను,భద్రాచలంను కాపాడుకుంటాం!
భద్రాచలం , ఏప్రిల్ 23,(జనవిజయం)
భద్రాచలం వీరభద్రం ఫంక్షన్ హల్ నందు భూహక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ముఖ్య అతిధి గా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పి.నిరూప్ పాల్గొని మాట్లాడుతూ., గోదావరికి ఇరుపక్కల మూలవాసులను అంతులేని అంధకార కుహరంలోకి తోసివేసే పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల ముంచుకోస్తున్న వరద ముంపు ప్రమాదం మొత్తం 280 ఆదివాసి గూడాలలో రెండున్నర లక్షల మంది నిలువనీడ లేక కన్నతల్లి వంటి అడవికి దూరమౌతున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లిప్తంగా మౌనం దాలుస్తున్నాయని విమర్శించారు .
ప్రజల నుంచి నిరసన ఎదురౌతున్నా, వారి ఆర్తనాదాలు వినిపించుకోకుండా కనీసం పునరావాస పథకం (రిసెటిల్ మెంట్ అండ్ రిహాబిలిటెషన్) గురించి కూడా అధికారులు ఆలోచించడం లేదని, పోలవరం ఎత్తు ఇంకా పెంచకముందే భద్రాచలంలోని అనేక పల్లపు ప్రాంతాలతో పాటు పర్ణశాల, ఆంజనేయస్వామి దేవాలయం, నవగ్రహాల ఆలయం, కళ్యాణకట్ట వర్షాకాలం వరదలకు మునిగిపోయినా, ఆయోధ్య రామాలయం గురించి ఆలోచిస్తున్నామని ప్రకటించుకునే కేంద్రప్రభుత్వం కనీసం మాట మాత్రంగానైనా స్పందించలేదని ఎటపాక గ్రామప్రజలు ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాల్లో పత్రికా విలేకరులను రానివ్వడం లేదని, రక్షణ సంస్థలకన్నా వాటిని గోప్యంగా ఉంచడం వెనక మర్మం ఏమిటని,భద్రాద్రిని, భద్రాచలం శ్రీరామచంద్రుడు, అడవి, గూడాలను, కొండలను, కొండరెడ్లను, కోయలను ముంచి కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పథకాలను రాజకీయ పార్టీలు సమర్థించడం క్షమించరాని నేరమని అన్నారు .యునెస్కో దృష్టికి తీసుకెళ్లి ఆదివాసులను,భద్రాచలంను కాపాడుకుంటాం అని సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపేందుకు అందరం ఐక్యం కావాలని కోరారు.
ఈ యొక్క కార్యక్రమం లో సమాఖ్య నిజనిర్ధారణ సంఘం జర్నలిస్ట్ పాశం యాదగిరి, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షులు కరుణాకర్ దేశాయి, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, విద్యార్థి నేతలు రాజేంద్రప్రసాద్, బండి కిరణ్ కుమార్ ఆదివాసీ నాయకులు పూనెం కృష్ణ దొర మర్ల రమేష్ పాయం సత్యనారాయణ సోయం. కన్నారావు తిప్పన సిద్ధులు బార్ అసోసియేషన్ కోట దేవధానం గారు తదితరులు పాల్గొన్నారు.