Thursday, March 28, 2024
HomeUncategorizedనీటిపై నడిచే మెట్రో సర్వీస్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

నీటిపై నడిచే మెట్రో సర్వీస్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

దేశంలో, దక్షిణాసియాలోనే తొలి వాటర్‌ మెట్రో ఇదేనని, కేరళ రాష్ట్రం కలల ప్రాజెక్ట్‌ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభివర్ణించారు

 

నీటిపై నడిచే మెట్రో సర్వీస్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఏప్రిల్ 25,జనవిజయం:దేశంలో కేరళలో తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కోచి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ను ప్రధాని మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. అంతకుముందు ఆయన ఆ రాష్ట్రంలో మొదటి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపారు. ఇది తిరువనంతపురం నుంచి కాసరగోడ్‌ వరకు రాకపోకలు సాగిస్తుంది. అంతేగాకుండా డిజిటల్ సైన్స్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాల్లో భాగంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

ఈ రోజు కేరళకు మొదటి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. అలాగే కోచిలో వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేరళ విద్యావంతుల రాష్ట్రం. ఇక్కడి ప్రజల కృషి, వినయం వారి గుర్తింపులో భాగం. దేశ రైల్వే నెట్‌వర్క్‌ వేగంగా మార్పు చెందుతోంది. అధిక వేగం కలిగిన రైళ్ల రాకపోకలకు సిద్ధం అవుతోంది. రాష్ట్రాల అభివృద్ధే దేశ ప్రగతికి మూలమని మా ప్రభుత్వం నమ్ముతోంది’ అని ప్రధాని తెలిపారు. రెండురోజుల కేరళ పర్యటనలో భాగంగా ఆయన సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. ఈ సందర్భంగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్.. ప్రధానిని కలిశారు. కల నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

వాటర్‌ మెట్రో ప్రత్యేకతలివే..!

దేశంలో, దక్షిణాసియాలోనే తొలి వాటర్‌ మెట్రో ఇదేనని, కేరళ రాష్ట్రం కలల ప్రాజెక్ట్‌ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభివర్ణించారు. కోచి మెట్రో రైల్‌ లిమిటెడ్‌ దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. కోచి వాటర్‌ మెట్రో సర్వీస్‌లో బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ బోట్లు ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు. కోచి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్‌ మెట్రో రాకపోకలు సాగిస్తుంది.

వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ను ₹ 1,136.83 కోట్ల వ్యయంతో నిర్మించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ(KFW) కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. ఇది పూర్తిగా విద్యుత్‌ సాయంతో పనిచేస్తుండటంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉందదు. అలాగే, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

వాటర్‌ మెట్రో సర్వీస్‌తో కోచి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. దశల వారీగా ఈ సర్వీసుల సంఖ్య పెంచనున్నట్లు సీఎం విజయన్‌ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 12 గంటల పాటు ఈ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం అందిస్తున్నారు. ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అత్యాధునిక భద్రత, సమాచార వ్యవస్థ వీటిలో ఉన్నాయి.

కోచి వాటర్‌ మెట్రో సర్వీస్‌లో టికెట్‌ ప్రారంభ ధర ₹ 20 కాగా, గరిష్ఠ టికెట్‌ ఖరీదు ₹ 40. టికెట్లతోపాటు పాస్‌ల సౌకర్యాన్ని కూడా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. వారం రోజుల పాస్‌ ఖరీదు ₹ 180, నెల వారీ పాస్‌ ధర ₹ 600, మూడు నెలల పాస్‌ ఖరీదు ₹ 1500గా నిర్ణయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments