మణిపూర్ ఘటనపై సీరియస్
మాటిస్తున్నాం!
అమానవీయ ఘటనకు పాల్పడ్డ ఎవరినీ వదలబోం!
- ప్రధాని నరేంద్రమోడీ
న్యూ ఢిల్లీ, జూలై 20(జనవిజయం ):
మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఉరేగించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందర.. కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయన మణిపూర్ దారుణ ఘటనపై స్పందించారు.
మాటిస్తున్నాం.. అమానవీయ ఘటనకు పాల్పడ్డ ఎవరినీ వదలబోం. మణిపూర్ దురాగతాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారాయన. ఇది ఎవరు చేసారు?బాధ్యులెవరు? అనేది కాదు.. ఇది యావత్ దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఘటన. రాజకీయాలకు మించినది మహిళ గౌరవం. కాబట్టి.. నిందితులెవరూ తప్పించుకోలేరు. దీని వెనుక ఉన్న వారిని క్షమించబోం.
మణిపూర్ రేపిస్టులను వదిలే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ.. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ఎంతదాకా అయినా వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.