రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ బియ్యం?
ఖమ్మం, ఏప్రిల్ 22(జనవిజయం)
ప్రభుత్వ చౌక ధరల దుకాణం నుంచి సరఫరా చేస్తున్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండడంతో మండలంలో పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. ముదిగొండలోని ఓ మహిళ రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకొని వాటిని నానబెట్టగా కొన్ని బియ్యం అడుగు భాగాన మరికొన్ని పైకి తేలేయి. వాటిని గమనించిన మహిళ చేయితో పట్టుకొని చూడగా బియ్యం ఉండాల్సిన పరిమాణం, ఆకారం భిన్నంగా ఉండడంతో పరిశీలించగా అవి ప్లాస్టిక్ బియ్యంగా ఉన్నట్లు సదరు మహిళ గమనించింది. వెంటనే ఆ మహిళ ఎవరికీ చెప్పాలో తెలియక ఇంటి పక్కన వారితో మాట్లాడుతుండగా.. ఆ విషయం తెలుసుకున్న ఓ విలేకరి ఆ బియ్యాన్ని చూడగా బియ్యపు గింజ కంటే ఎక్కువ సైజు కలిగి ఉండటం, అలాగే నోటితో కొరికితే తొందరగా నలగకపోవడం గమనించారు. పలు గ్రామాలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చౌకదుకాణంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారా..!?అనే సందేహాలు పలువురు వ్యక్త పరుస్తున్నారు.