Tuesday, October 3, 2023
Homeవార్తలుపేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్

పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్

ఖమ్మం, ఆగస్టు 11 (జనవిజయం): రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నియోజకవర్గ పరిధిలో కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను విడివోస్ కాలని క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.

గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద వ్యాపారస్తుల వద్ద అప్పు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి ఎస్సీ ఎస్టీ, బిసి, మైనార్టీ ఆడపిల్లలకు అన్ని వర్గాల ప్రజలకు అండగా, కళ్యాణలక్ష్మి రూపంలో మొదటగా రూ. 50,000 నుంచి మొదలు పెట్టి, రూ.75,000, నేడు లక్ష నూట పదహారు రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇదే క్యాంపు కార్యాలయంలో 300 మంది బిసి లకు ఒక్కొక్కరికి రూ. లక్ష అందజేశామని, రానున్న నెల రోజుల్లో దళితులకు దళిత బందు పథకం ద్వారా రూ.10 లక్షలు ఇవ్వనున్నామని వివరించారు. వేల మందికి ఈ కార్యాలయం వివిధ సంక్షేమ పథకాల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు పంపిణి చేశామని, ఇది మాకు దేవాలయం తో సమానం అని అభివర్ణించారు.

ఒకప్పుడు మహిళలు బిందెలు పట్టుకుని రోడ్ల మీద వీధి నల్లాల వద్ద పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం అని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇంటింటికీ ఒక్క రూపాయి తో నల్లా కనెక్షన్స్ ఇచ్చి, శుద్ది చేసిన త్రాగునీరు ఇంటింటికీ అందిస్తున్నామని అన్నారు. ఒకప్పుడు బిందెలకు ఉన్న సొట్టలు నేడు మహిళల బుగ్గల పై ఉన్నాయన్నారు. ఆసరా పింఛన్లు, రైతుల కొరకు రైతుబంధు, రైతు భీమా, 24 గంటల కరెంటు, బిసి, మైనార్టీలకు పూర్తి సబ్సిడీతో రుణాలు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి, అమలు చేస్తుందన్నారు. రాష్ట్రం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 8527 చెక్కులకు గాను రూ. 80.34 కోట్ల విలువైన చెక్కులను పంపిణి చేసినట్లు మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ లో 84, రఘునాథపాలెం మండలం 17 మొత్తం 101 మంది లబ్ధిదారులకు గాను రూ. 1.01 కోట్ల విలువైన చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో మంత్రి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments