వైరా, ఆగష్టు 10 (జనవిజయం): వైరా మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని లీలా సుందరయ్య నగర్ వాస్తవ్యులు వేమూరి సత్యనారాయణ, వేమూరి స్వరూపరాణి దంపతుల కుమారులు వేమూరి సుదీర్ (యుఎస్ఎ), వేమూరి అజయ్ లు ఔదార్యంతో వైరా మండలం, ఖానాపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ సారమ్మకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కూలి పనులు చేసుకుని బ్రతికే నిరుపేద కుటుంబానికి చెందిన సారమ్మ భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించారు. సారమ్మకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణకు, కూతుర్లను చదివించుకోవడానికి దాతలు సహాయం చేయాలని కోరడంతో వేమూరి సత్యనారాయణ, వేమూరి స్వరూపరాణి దంపతులు గురువారం 10,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భర్త చనిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సారమ్మ కుటుంబానికి మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, కార్యదర్శి గుడిమెట్ల మోహనరావు, కోటేరు శివారెడ్డి, కోటేరు మాధవి, మిట్టపల్లి నాగభూషణం, గుత్తా పద్మజా, గుత్తా దినేష్ తదితరులు పాల్గొన్నారు.