జనవిజయంసాంకేతికతపరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

నా ‘మా’ట-8

ర్నలిజంలో చేరిన కొత్తలో ఓ వేశ్యను ఇంటర్వ్యూ చేయాలని ఇన్ఛార్జి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. సిటీకి కొత్త. ఎక్కడకెళ్లాలి, ఎక్కడ దొరుకుతారనే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒప్పుకున్నానే కానీ మనసులో దిగులు మాత్రం అలానే ఉంది. ఈ అసైన్మెంట్ చేయగలనా లేదా అనే అనుమానం నాలో కలిగింది. నా పరిస్థితి అర్థం చేసుకున్న ఇన్ఛార్జి నా పని సులువయ్యేలా సూచనలు చేశాడు. మరుసటి రోజు సాయంత్రం ఏడు తర్వాత ఇన్చార్జి చెప్పిన చోటకు వెళ్లాను. నలుగురైదురు కనిపించారు. వారితో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. వారినే చూస్తుండిపోయాను. నా పరిస్థితి అర్థం చేసుకున్న మహిళ నా వద్దకు వచ్చి విషయమేంటని అడిగింది. మీలో ఒకరి ఇంటర్వ్యూ కావాలన్నాను. మేమేమైనా గొప్పొళ్లమా ఇంటర్వ్యూ ఇవ్వడానికి. వద్దులేండి అంటూ వెళ్లిపోయింది. ఆమె మాట్లాడిన తీరు చూస్తే కాస్త చదువుకున్నట్టే. కనిపించింది. దగ్గరకు పోయి మళ్లీ అడుగుదామని చూసేసరికి కనిపించలేదు. చేసేది లేక ఆ రోజు రాత్రి వెనుదిరిగి ఆఫీస్కు వెళ్లి ఇన్ఛార్జికి అసలు విషయం చెప్పాను. ప్రయత్నం చేశావు. అభినందనలు. రేపు కూడా ప్రయత్నం చేయి… ఫలితం వస్తుందన్నాడు. సరేనంటూ తలూపి ఇంటికెళ్లిపోయాను. రేపు ఎట్లా చేసైనా ఒక్కళ్లనయినా ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. ఏమేమీ ప్రశ్నలు అడగాలో ముందుగానే నోట్ రాసుకున్నాను. మరుసటి రోజు మళ్లీ అదే సమయానికి వెళ్లాను. నిన్న కనబడ్డ వారు ఈవాళ లేరు. కొత్తవారు ఉన్నారు. నేను దగ్గరకు వెళ్తుంటే ఏదో గిరాకీ వస్తుందనే ఆనందంతో అందరూ నా వద్దకు వచ్చారు. విషయం చెప్పగానే ముగ్గురు వెళ్లిపోయారు. ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిని మాటల్లో పెట్టి ఇంటర్వ్యూ చేసేందుకు అంగీకరించేలా చేశాను. వాళ్లు చెప్పిన విషయాలతో చక్కటి స్టోరీ రాశాను. మంచి ప్రయత్నం చేశావు. మంచి స్టోరీ అంటూ ఇన్ఛార్జి అభినందించారు. నూతన విషయాలు తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయి పరిశీలన అవసరం. లేకుంటే అసైన్మెంట్లో వెనుకబడతామనేది నేను తెలుసుకున్న విషయం.

ఒక రోజు ప్రముఖ కథ, నవలా రచయిత చావా శివకోటి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాను. ఆయన చెప్పిన విషయాలు అబ్బురపరిచాయి. ‘స్టువరపురం డైరీ’ నవల రాయడానికి ముందు నెల రోజులు స్టువరపురం గ్రామానికి వెళ్లి అక్కడనే వుండి ప్రజల జీవన విధానం, అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాతనే నవల రాశారు. ఆ నవల ఆయనకెంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. సమాజాన్ని మనం పరిశీలించి రాస్తే దానిని ఎలా స్వీకరించాలో సమాజం నిర్ణయించుకుంటుందని శివకోటి గారు చెప్పిన విషయాలు వంటపట్టించుకోదగినవే.

సమాజాన్ని చదవకుండా, నిశితంగా పరిశీలించకుండా మనం రాసింది అంతగా ప్రభావితం చూపలేదు. కథల్లో కొన్ని కల్పనలు, కొన్ని వాస్తవాలు ఉండొచ్చు. ఊహల్ని కథలుగా రాయడం వల్ల ప్రయోజనం తక్కువే. క్షేత్ర పరిశీలన చేయడం. వల్ల ఆ కథకు ఆయువు పట్టును పట్టుకోవచ్చు. అలాంటి పరిశీలనాశక్తి పెంచుకోవాలి. అందుకు తగిన సాధన చేయాలి. ముఖ్యంగా పుస్తకాలు విరివిగా చదవాలి. ప్రముఖ కవులతో, రచయితలతో వీలైతే మాట్లాడుతుండాలి. వారు చెప్పిన విషయాలు నోట్ చేసుకోవాలి. అదే సందర్భంలో మన సొంత ఊహశక్తిని పెంచుకోవాలి. ఆ ఊహను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి వాస్తవమైతే ఎలా ఉంటుంది. అవాస్తవమైతే ఇంకెలా ఉంటుంది తదితర పరిశీలనలు చేయాలి. అప్పుడే మంచి కథనం వస్తుంది.

శుభలగ్నం సినిమాను చివరలో దర్శకుడు రెండు మాటల్లో తేల్చేస్తాడు. ‘కళ్లు చూసిన దగ్గరకు మనసు పోకూదడు. మనసు వెళ్లిన దగ్గరకు మనిషి పోకూడదు’ అంటూ సినిమాను ముగించేస్తారు. పై రెండు మాటల్లోని అర్థమే మూడు గంటల సినిమా. మనం అనుకున్న ఓ ఊహను ఎలా కథగా మలచాలో అలాంటి సినిమాలు చూసినప్పుడు, పత్రికల్లో వస్తున్న కథలు గాని, ప్రముఖ కథలు కాని చదివినప్పుడు సులభంగా అర్థమవుతుంది.

ఇటీవల ఓ మ్యాగజైన్లో కథను చదివాను. రచయిత రాసిన విధానం బాగుంది. కథ మొత్తం చదివాక నాలో మూడు, నాలుగు ప్రశ్నలు ఉద్భవించాయి. రచయిత ఇచ్చిన ముగింపు నచ్చలేదు. పాఠకుడిని డైలమాలో పడేస్తే రచయిత దొరికిపోయినట్టే. కథ చదివాక రచయిత చెప్పదలచుకున్నది పాఠకుడు అనుకుంటే సక్సెస్ అయినట్టు. సందేహాలు కలిగితే కథా నిర్మాణంలో ఎక్కడో బిగింపు తప్పినట్టే.

ఇప్పుడు రాస్తున్న చాలా మంది కథా రచయితలు సినిమా కథల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా కథ వేరు. మామూలు కథ వేరు. సినిమా కథలో అనేక ట్విస్టులు పెట్టుకోవచ్చు. కథను ఎలాగైనా మలుపు తిప్పవచ్చు. నిజ జీవితంలో జరిగే సంఘటనలను పరిగణనలోకి తీసుకోవచ్చు. తీసుకోకపోవచ్చు. కానీ మామూలు కథ రాస్తున్నప్పుడు వాస్తవ పరిశీలనకు దగ్గరగా ఉందా లేదా అన్నది చూడాలి. కథలో చెప్పిన విషయం సమాజంలో జరుగుతుందా లేదా అన్నది పోల్చి చూసుకోవాలి. సినిమాటిక్ గా ట్విస్ట్లు జోడిస్తే పాఠకులకు దొరికిపోతాం. అందుకే రచయితలు చాలా సాధన చేయాల్సి ఉంటుంది. మనలో కలిగే భావాలను ఎప్పుడికప్పుడు నోట్ చేసుకుంటుండాలి. లేకుంటే మరిచిపోతాము. మళ్లీ ఆ భావన రావాలంటే కష్టం. అందుకే ఎప్పటికప్పుడు నోట్ రాసుకోవాలి. భావాలెప్పుడూ మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ఊహిస్తున్నపుడు వస్తుంటాయి. నిత్యం సమాజంలో ఏం జరుగుతుందో మనం చూస్తుంటాము. ఆర్థిక విధానాల ఫలితంగా నేడు పల్లెల్లో జీవన విధానం మారింది. వృత్తులు ధ్వంసమయ్యాయి. వీటిని పరిశీలించి చక్కటి కథ రాయవచ్చు. పత్రికల్లో, టివిల్లో అనేక సంఘటనలు చూస్తుంటాం. వాటి వల్ల కలిగే భావాలను కథగా మలచుకోవచ్చు. ఇంకా ఊహశక్తితో మరెన్నో కథలు రాయవచ్చు. సమాజంలో మనం ఒకళ్లలా ఆలోచించకూడదు. విభిన్నంగా ఆలోచించగలగాలి. అప్పుడే కొత్త కథలను సృష్టించొచ్చు.

సమాజం, మనిషి జీవితం, స్థలం, కాలం అనే నాలుగు స్తంభాల మీద ఉత్తమ కథా నిర్మాణం ఆధారపడి ఉంటుందని ప్రముఖ కథా రచయిత విహారి గారు పేర్కొన్న మాటల్ని మనం ఎల్లవేళలా గుర్తు చేసుకుంటుండాలి. గొప్ప రచయితలెప్పుడూ అలానే చేస్తుంటారు. కథా ప్రారంభం బాగా లేకపోతే పాఠకులు చదవరు. అందుకే కథా ప్రారంభాన్ని చక్కగా ఆలోచించి మొదలెట్టాలి. కథలోకి తీసుకెళ్లడమంటే నూతన భవనంలోకి ప్రవేశించినంతన ఆనందదాయకంగా ఉండాలి. అప్పుడే పాఠకుడు ఆ కథను చదువుతూ ముందుకు పోతాడు. కథా ప్రారంభం బాగున్నా, కథా నిర్మాణం మంచిగానే మలిచినా సారం మాత్రం సామాన్య జనానికి దగ్గరగా లేకపోతే ప్రయోజనం నెరవేరదనే చెప్పవచ్చు.

ఉత్తమ కథకుడు జీవితాన్ని చిత్రిస్తాడు. మానవత్వాన్ని ప్రతిష్టిస్తాడు. వివేకాన్ని సృష్టిస్తాడు అంటారు శ్రీ రాంషా. మరెందుకు ఆలస్యం. మీరు కూడా ఉత్తమ కథకులుగా నిలవాలని, అందుకు తగిన సాధన చేస్తూ సాహితీలోకంలో ఎదగాలని ఆశిస్తూ… వచ్చే వారం మరో అంశంతో కలుసుకుందాం.

– నామా పురుషోత్తం
98666 45218

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

1 COMMENT

  1. జర్నలిజంలో మానవీయ కథనాలను సృష్టించే విషయంలో ఎదుర్కొన్న అనుభవాలను జోడించి కథా రచనలో కొన్ని మెలకువలను చక్కగా వివరించారు. ఒక రచయితకు ఉండవలసిన లక్షణాలను అనుభూతులను ఒక చిన్న వ్యాసం లో ఎన్నో విషయాలను అందించారు. సమాజాన్ని తట్టి సమాజంలో ఉన్న లోతుపాతులను ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకునే విషయంలో ముందుకు వెళ్ళవలసిన మార్గాలను చక్కగా విశ్లేషించారు మన కథ నానికి కావాల్సిన ముడి సరుకు ని ఏవిధంగా సేకరించాలనే విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వాటిని ఏవిధంగా అధిగమించాలనే విషయాలను నామా పురుషోత్తం గారు విడమరచి చెప్పారు ఒక జర్నలిస్టుగా ఒక రచయితను గాని ఒక వ్యభిచారిని గాని మరి ఇతర వ్యక్తులను గాని ఇంటర్వ్యూ చేసే విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వాటిని అధిగమించే అనుభూతులను చక్కగా వివరించారు జర్నలిస్టు తోపాటు రచయితలు కూడా ఏ విధంగా సమాజం పట్ల అవగాహన పెంచుకుని ఒక రచయితగా ఎలా ముందుకు వెళ్లాలో అనే విషయాలను కథా రచయితలకు మార్గదర్శకం నిర్దేశించారు అన్నా మీకు ధన్యవాదాలు

    —-కట్టెకోల చిన నరసయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి