ఇసుక లారీ ఎక్కి కల్వర్టు పగిలిపోయి పొంచి ఉన్న ప్రమాదం
- రాత్రి వేళల్లో జోరుగా అక్రమ ఇసుక రవాణా
- 60 టన్నుల లారీ ఎక్కడంతో పగిలిపోయిన కల్వర్టు
- ప్రజలకు ఉపయోగపడే వాటిని ధ్వంసం చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు
- కమిషన్లు తీసుకొని అన్నీ తామై నడిపిస్తున్న మధ్యవర్తులు
బోనకల్, జూలై 24(జనవిజయం):
కల్వర్టు పగిలిపోయి ప్రమాదం పొంచి ఉన్నది. స్థానికులకు ఇబ్బందిగా మారింది. నిత్యం వందలాదిమంది ప్రయాణించే రోడ్డు పక్కన కల్వర్టు పగిలి ప్రమాదం పొంచి ఉన్న అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదని స్థానికులు అంటున్నారు. మధ్యవర్తులు కమిషన్లు తీసుకుని కాసులకి కక్కుర్తిపడి అక్రమ ఇసుక రవాణా చేసి ప్రజలకు ఉపయోగపడే వాటిని ధ్వంసం చేస్తున్న ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల సమయం కావున మురికి నీటి వాసనతో దోమల బెడదతో స్థానికులు రోగాలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని గిరిజన కాలనీవాసులు మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే…. మండల కేంద్రంలోని ఎస్టి కాలనీలో శబరి వైన్స్ కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన కల్వర్టు పగిలి ఉన్నది. రాత్రవేళల్లో ఆంధ్రా నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తు అధిక బరువులతో కూడిన లారీతో సుమారు 60 టన్నుల ఓవర్ లోడ్ లారీని ఈ కల్వర్టు పైకి ఎక్కడంతో పగిలిపోయి లారీ కింద పడిపోయింది. రాత్రిపూట లారీ కింద పడిపోయే సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారే సరికి స్థానికులు లేచి చూడడంతో కల్వర్టు పగిలిపోయి లారీ కింద పడిపోయి ఉన్నది. కల్వర్టు పగిలిపోవడంతో స్థానికులు వారిని అడగగా మేము చేపిస్తాము అని స్థానిక గిరిజన కాలనీ వాసులకు చెప్పారు.
కానీ నాలుగు ఐదు నెలలు అవుతున్న ఇంతవరకు పట్టించుకోకపోవడంతో వర్షాకాలపు మురికి నీటి వాసనతో ఎస్టీ కాలనీ వాసులు రోగాలకు గురవుతున్నారు. అధికారులు ఇంతవరకు చూడకపోవడంతో స్థానిక ఎస్టీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ ఆదమరిచి పగిలిపోయి ఉన్న కల్వర్టులో పడిపోయారంటే చెప్పుకోలేని ప్రమాదం జరగవచ్చునని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రాత్రిపూట కరెంటు లేని సమయంలో అటు నుండి వస్తున్న వాహనదారులు ఆదమరిచి ప్రయాణించారో ప్రమాదం భారిన పడ్డట్లే. కూలిన కల్వర్టు కింద భాగంలో ప్రమాదకరమైన పెద్ద పెద్ద రాళ్లు ఇనుప సువ్వలు ఉన్నాయి. ప్రమాదవశాత్తు వాహనాలు కల్వర్టు లో పడిపోతే అంతే సంగతి .
ఇప్పటికైన పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పందించి సత్వరమే కల్వర్టు నిర్మాణం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక గిరిజన కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం చేయాలంటే వాహన దారులు భయపడుతున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి ఈ కల్వర్టుకు మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.