* జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకోసం కృషి
* 10న ఖమ్మంలో సభ్యత్వ నమోదు ప్రారంభం
* పదవులకు రాజీనామా చేశాకే కొత్త వారి చేరిక
* సొసైటీ త్రీమన్ కమిటీ నుంచి వైదొలగాలని నిర్ణయం
* ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో తీర్మానం
ఖమ్మం, మార్చి 5 (జనవిజయం): జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలు కోసం ఒంటరిగా పోరాడాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ నిర్ణయించింది. మంచికంటి ఫంక్షన్ హాలులో సంఘం జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల పదో తేదీ నుండి సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుంది. యూట్యూబర్లు మినహా ఆర్ ఎన్ ఐ గుర్తింపు ఉన్న అన్ని పత్రికలవారికి, అక్రిడిటేషన్ కార్డు లేకున్నా సీనియారిటీ ఉన్న ఇండిపెండెంట్ జర్నలిస్టులకు సంఘం సభ్యత్వం ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బాధ్యులు, జిల్లా ఇంఛార్జి రాజశేఖర్ తెలిపారు. ఇతర యూనియన్ల నుండి చేరేవారు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నారు. ఎవరికీ ముందుగా పదవులు హామీ ఉండదన్నారు. సభ్యత్వ నమోదు ప్రారంభం రోజు రాష్ట్ర నాయకత్వం హాజరు అవుతుందని, సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా విజయవంతం చేసేందుకు జిల్లా కమిటీ సభ్యులు అందరూ శక్తి మేరకు పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సొసైటీల ద్వారా ఇళ్ళ స్థలాలు వచ్చే అవకాశం లేని దృష్ట్యా.. ఖమ్మం నగరంలో జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ఫెడరేషన్ తరపున ఒంటరిగానే కృషి చేయాలని నిర్ణయించారు. ఇకపై స్థంభాద్రి సొసైటీ తరపున కానీ, ఇతర యూనియన్లతో కలిసి పోకూడదని నిర్ణయించారు. సొసైటీలో సంఘం తరఫున ఉన్న పదవులను వదులుకోవాలని తీర్మానం చేశారు. ఉమ్మడి ఉద్యమాలకు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిన సందర్భాలలో మాత్రమే అన్ని యూనియన్ల తో కలిసి పనిచేయాలని నిర్ణయం చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కొండలరావు, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు తేనె వెంకటేశ్వర్లు, చీనేని బాలకృష్ణ, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, జక్కంపూడి కృష్ణ, మోహన్ రావు, నాగుల్ మీరా, బంకా వెంకటేశ్, వీసారపు అంజయ్య, బోయినపల్లి అంజయ్య, విష్ణు, కందికొండ శ్రీనివాసరావు, నారాయణ, శివారెడ్డి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.