ఖమ్మం, ఆగస్టు 3(జనవిజయం): ఒకటి నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ నులి పురుగు నివారణ మాత్రలు వేయాలని, నులి పురుగులను పూర్తిస్థాయిలో నివారించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం స్థానిక ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నులిపురుగుల నివారణ దినోత్సవానికి కలెక్టర్ హాజరై పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆల్బండొజల్ మాత్రలు నులిపురుగుల నివారణ చేస్తాయని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు ఆల్బండొజల్ మాత్ర వేయడం వల్ల కడుపులో పెరిగే నట్టలను పూర్తిస్థాయిలో నివారించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో వచ్చే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, బరువు తగ్గడం, కడుపునొప్పి ఇలాంటి వాటిని నివారించవచ్చునని ఆయన తెలిపారు. జిల్లాలో సుమారు 311317 మంది ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు పిల్లలున్నట్లు ఆయన అన్నారు. ఇందులో 1614 పాఠశాలల్లో 189665 మంది పిల్లలు ఉన్నారన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రలు వేసేలా ఉపాధ్యాయులు చూడాలన్నారు. పిల్లలు ఆరుబయట వట్టి కాళ్ళతో ఆడుకోవడం, మట్టిలో ఆడి చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం లాంటి వాటివల్ల నులిపురుగులు తయారవుతాయని ఆయన తెలిపారు. ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ప్రతి పిల్లలకి మాత్ర వేసేలా చూడాల్సిన బాధ్యత అటు అధికారులు, ఇటు తల్లిదండ్రులదని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, సిఎంఓ రాజశేఖర్, అదనపు జిల్లా వైద్యాధికారిణి డా. ప్రమీల, ప్రాజెక్ట్ అధికారి డా. సైదులు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.