Saturday, February 24, 2024
Homeరాజకీయంరైతులకు బ్యాంకులు జారీ చేసిన లీగల్‌ నోటీసులు ఉపసంహరించుకోవాలి

రైతులకు బ్యాంకులు జారీ చేసిన లీగల్‌ నోటీసులు ఉపసంహరించుకోవాలి

  • తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు

ఖమ్మం, ఫిబ్రవరి 09 (జనవిజయం): 

పంట రుణాల వసూళ్ల కోసం బ్యాంకులు జారీ చేసిన లీగల్‌ నోటీసులు ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్‌ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్‌ అధ్యక్షతన జరిగిన  తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ పంట రుణాలు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత బ్యాంకులు లీగల్‌ నోటీసులు జారీ చేయడం దుర్మార్గం అన్నారు.

ఖమ్మం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖమ్మం జిల్లాలో అనేకమంది రైతులకు లీగల్‌ నోటీసులు జారీ చేసిందన్నారు. ఖమ్మం జిల్లాలో  గ్రామీణ వికాస్‌ బ్యాంకుల పరిధి లో ఇతర జాతీయ బ్యాంకుల్లో సుమారు ఐదు వేల మంది రైతులకు 2014 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ వివిధ కారణాల చూపి చేయలేదని అలాగే 2018  రైతు రుణమాఫీ కూడా అందులో కొందరు రైతులకు ఇంకా కాలేదని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్న సమయంలో బ్యాంకు అధికారులు లీగల్‌ నోటీసులు వరంగల్‌ నుంచి పంపించి రైతులను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదని రాంబాబు అన్నారు.  గత రెండు సార్లు రుణమాఫీకి నోచుకోని రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బ్యాంకు అధికారులు రైతులకు పంపించిన లీగల్‌ నోటీసులు ఉపసంహరించుకోనేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సాగర్‌ జలాలు విడుదల చేసి ఖమ్మం జిల్లాలో సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలకు అవసరమైన సాగునీరు అందించాలని, వాగులు, వంకలు, చెక్‌ డ్యాంలు, కుంటలు, చెరువులు నీరు లేక పశువులు కూడా దాహార్తి కి ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కుంటలు చెరువులను సాగర్‌ జలాలతో నింపాలని కోరారు. పాలేరు పాత కాల్వ క్రింద వరి, మొక్కజొన్న పంటలకు సాగునీరు విడుదల చేయాలని కోరారు.

ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాతా భాస్కర్‌ రావు, వాసిరెడ్డి వరప్రసాద్‌, సహాయ కార్యదర్శులు ఎస్‌ కె మీరా, శీలం పకరిమ్మ, వనమా చిన్న సత్యనారాయణ, మల్లెంపాటి రామారావు, కోల్లేటి ఉపేందర్‌, శీలం సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments