నోడల్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి
ఖమ్మం, జూలై 26 (జనవిజయం):
ఎన్నికల విధుల్లో నోడల్ అధికారులు, తమ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఐడిఓసి లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో సమావేశమై, వారి విధుల సన్నాహాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే సాధారణ ఎన్నికలకు 16 అంశాలపై నోడల్ అధికారుల నియామకం చేపట్టినట్లు తెలిపారు.
మానవ వనరుల, శిక్షణ, రవాణా, ఐటి, సైబర్ భద్రత, స్వీప్, జిల్లా భద్రత ప్రణాళిక, ఇవిఎం, మోడల్ కోడ్ కండక్ట్, ఖర్చు పర్యవేక్షణ, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, మీడియా, సమాచార కార్యాచరణ, ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ హెల్ప్ లైన్, ఎన్నికల పరిశీలకులు విషయమై నోడల్ అధికారుల నియామకం చేసినట్లు ఆయన అన్నారు. ఎన్నికల నిర్వహణకు సరిపోను సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు. శిక్షణ కు ప్రదేశం ఎంపిక చేయాలని, ప్రొజెక్టర్, ఇవిఎం, కావాల్సిన సదుపాయాల కల్పన చేయాలన్నారు. ఇవిఎం, అధికారులు, పర్యవేక్షణ బృందాల రవాణాకు కావాల్సిన వాహనాలు సిద్ధపర్చుకోవాలన్నారు. స్వీప్ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలన్నారు. వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత గురించి పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.