భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 17 (జనవిజయం): అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పనకు నివేదికలు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి మిని సమావేశపు హాలులో పోషణవాటిక, నిత్యావసర వస్తువులు సరఫరా, న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు, అంగన్వాడి భవనాల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పక్కా భవనాలున్న అంగన్వాడీ కేంద్రాల్లో 100 పోషణ వాటిక, 100 ఆర్ ప్లాంట్లు, 100 రెయిన్ వాటర్ సంరక్షణకు ఎంపిక చేయాలని సూచించారు. ప్రతి నెలా 10వ తేదీలోగా చిన్నారులకు గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పూర్తి చేయాలని, వివరాలను పోషణ్ ట్రాకర్ నమోదులు చేయాలని చెప్పారు. జిల్లాలో తీవ్ర పోషణ లోపం ఉన్నట్లు గుర్తించిన 683 మంది, అలాగే అతితీవ్రపోషణ లోపం ఉన్నట్లు గుర్తించిన 2293 చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణలోపాలను అధిగమించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
గృహహింసకు గురయ్యే మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన సఖి కేంద్రం 24 గంటలు పనిచేస్తుందని. 13 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1098 కాల్ సెంటరు కానీ నేరుగా సఖి కేంద్రానికి వచ్చి పిర్యాలు చేసిన తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని చెప్పారు. చిన్నారులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేశామని, న్యూట్రీ గార్డెన్లు నిర్వహణ, ఏర్పాటుపై నివేదికలు అందచేయాలని ఆదేశించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు జరిగే కార్యక్రమాలు పర్యవేక్షణకు సిడిపిఓలకు బాధ్యతలు అప్పగించేందుకు జాబితా సిద్దం చేయాలని మహిళా శిశు సంక్షేమ అధికారిని ఆదేశించారు. దివ్యాంగులకు ఆర్థిక సాయం అందించేందుకు ఆన్లైన్ పోర్టల్లో వచ్చిన దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి చేసి నివేదికలు అందచేయాలని సిడిపిఓలను ఆదేశించారు. జిల్లాలోని గడువు 2060 అంగన్వాడీ కేంద్రాల్లో 853 భవనాలకు సొంత భవనాలు, 755 అద్దె, 452 రెంట్ ఫ్రీ భవనాలలోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు బాలామృతం, స్పాట్ ఫీడింగ్ అందచేస్తున్నట్లు చెప్పారు.
3 నుండి 6 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మణుగూరులోని బాలల సంరక్షణ కేంద్రంలో సౌకర్యాలపై నివేదికలు అందచేయాలని చెప్పారు. జనవరిలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్లో 31 మందిని, జూలైలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో 33 మంది చిన్నారులను గుర్తించి వారి సంరక్షణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
సిఎస్ఆర్, ఎసిసిఏ నిధులతో నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ ప్రగతిపై నివేదికలు అందచేయాలని, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని పిఆర్, మహిళ సంక్షేమ అధికారులను ఆదేశించారు. 250 అంగన్వాడీ కేంద్రాలు ఆధునీకరణకు పనులు చేపట్టాలని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులను నిశిత పరిశీలన చేసి నివేదికలు అందచేయాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర వస్తువులు సరఫరాలో ఎలాంటి జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని రవాణాకు ఇబ్బందులున్న కేంద్రాల జాబితా అందచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ అధికారి సబిత, అన్ని ప్రాజెక్టుల సిడిపిఓలు, ఏసిడిపిఓలు, తదితరులు పాల్గొన్నారు.