జనవిజయంఆంధ్రప్రదేశ్సామ్రాజ్యవాదంపై రగిలిన విప్లవ నిప్పురవ్వ అల్లూరి!

సామ్రాజ్యవాదంపై రగిలిన విప్లవ నిప్పురవ్వ అల్లూరి!

అమాయకులూ, అసహాయులైన అడవి బిడ్డలనే సైన్యంగా సమీకరించి.. ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ధిక్కరించి..ఉత్తేజ ప్రదాతగా శాశ్వతంగా నిలిచిపోయిన తెలుగు విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు. సమరశీలతలో, సాహసంలో తన కాలం కన్నా ముందున్న వాడు… అహింసా జపాన్ని అధిగమించి ఆయుధాలు చేబూని మన్య విప్లవం రగిలించిన వాడు అల్లూరి.. భారతీయులకు నాగరికత నేర్పామని గొప్పలు పోయే తెల్ల దొరల అమానుషానికి బలైన అమరజ్యోతి.. ఆదివాసుల అడవులూ కొండలూ గనులూ కార్పొరేట్లకు కట్టబెడుతున్న నేటి సరళీకరణ యుగంలో ఆయన అడుగుజాడలు అనుసరణీయాలు.. స్మరణీయాలు……

ఆనాటికి ప్రపంచంలో అజేయమైన సైనిక శక్తిగా ఉండి… రవి అస్తమించని బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ జ్యోతి. ఆదివాసి ప్రజల రాజకీయ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వీర కిశోరం. ఏజెన్సీ ప్రాంత గిరిజనుల మౌలిక సమస్యలను, పరిష్కారాలను ఎజెండాగా చర్చనీయాంశం చేయడంలో జయప్రదమైన పోరాటయోధుడు, తెలుగు ప్రజలందరికి నిరంతరం స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు. 1897 జూలై నాలుగవ తేదీన జన్మించి 1924లో (మే 7న) బ్రిటిష్ వారి తూటాలకు బలై వీరమరణం పొందిన అల్లూరి జీవించింది 27 సంవత్సరాలు మాత్రమే. అల్లూరి వెంకట రామరాజు – నారాయణమ్మ దంపతుల రెండవ సంతానం రామరాజు (అక్క సీత, తమ్ముడు సత్యనారాయణ రాజు), సీతా రామరాజు తండ్రి స్వాతంత్ర్య ప్రియుడు. బ్రిటిష్ వ్యతిరేకి. రాజమండ్రి వచ్చిన బిపిన్ చంద్రపాల్ ప్రసంగం… వందేమాతరం ఉద్యమం… తండ్రి స్వతంత్ర భావాలు రామరాజును ఎంతగానో ప్రభావితం చేశాయి. ‘విదేశీ చదువులూ ఒక చదువులేనా!’ అంటూ విద్యను మధ్యలోనే వదిలేసాడు. దేశ పర్యటన చేసి జాతీయోద్యమ నాయకులను కలుసుకోవడంతోపాటు, విప్లవకారులతో రహస్య సమావేశంలో కూడా పాల్గొన్నాడు. తర్వాత మన్య ప్రాంతం చేరుకున్నాడు. అక్కడ మన్యం ప్రజలపై బ్రిటిష్ అధికారుల దోపిడీ,దౌర్జన్యాలను చూసి చలించిపోయాడు. బ్రిటిష్ అటవీ చట్టాలు, రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో అడవి తల్లి నుండి అడవి బిడ్డలను వేరు చేసి వేధింపులు మొదలు పెట్టింది ప్రభుత్వం.

కోయ ప్రజల కష్టాలు అధికమయ్యాయి. అయిదేళ్ళపాటు కోయ ప్రజల మధ్య సంచరిస్తూ వారి సమస్యలపై పోరాడుతూ వారి విశ్వాసాన్ని పూర్తిగా చూరగొని ఒక ఆశాజ్యోతిగా కన్పించసాగాడు. గిరిపుత్రులు తాము కోల్పోయిన భూములను తిరిగి దున్నుకోమని చెప్పాడు రామరాజు. రిజర్వ్ ఫారెస్ట్’ అటవీ ఉత్పత్తులు సేకరించుకోవడం జన్మహక్కు అని వారిని చైతన్య పరిచాడు. పోలీసుల జోక్యం అవసరం రాకుండానే… గిరిజన సంప్రదాయ పద్ధతులలో …. పంచాయతి కోర్టులలోనే ప్రజల వివాదాలు పరిష్కారం కాసాగాయి. గ్రామాల మీదబడి ఫారెస్ట్ పోలీసులు లూటీ చేయడం… శిస్తుల పేరుతో రెవెన్యూ వారు పీడించడానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది. మద్యపానం మాన్పించడానికి ప్రచారం చేసాడు. చింతపల్లి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు చేయించడానికి తీసుకెళ్లి కోయ ప్రజల శ్రమను దారుణంగా దోచుకుంటున్న అధికారుల నుండి కాపాడి కూలీ ఇప్పించాడు. విప్లవ ప్రభావిత ప్రాంతమంతటా ప్రజలు పెద్ద సంఖ్యలో తాగుడు మానేశారు. ప్రభుత్వ కోర్టులను, పోలీస్ స్టేషన్లను బహిష్కరించారు. సీతారామరాజు మాటే మన్యంలో వేదంలా చెల్లుబాటవసాగింది. దీంతో అధికారులు, మన్యం పై యుద్ధం ప్రకటించారు. రామరాజును అరెస్ట్ చేసి తర్వాత విడుదల చేశారు.

గెరిల్లా యుద్ధం
రామరాజు మన్యంలో అడుగు పెట్టిన తొలి నాళ్ళలోనే కోయ దొరల దగ్గర విలు విద్య నేర్చుకున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ వారి దాడి తీవ్రతరం కావడంతో విల్లంబులతో సైన్యం ఏర్పాటు చేశాడు. అయితే… తప్పులు చేస్తున్న కింది స్థాయి ఉద్యోగులను రామరాజు మందలించి వదిలివేశాడు తప్ప ఎవరినీ చంపలేదు. చిత్రహింసలు పెట్టలేదు. ఇది ఆయన నిబద్ధత, నిజాయతీకి నిదర్శనం. తన యుద్ధం దొరలపైన మాత్రమేనని ప్రకటించాడు. ప్రత్యేక గుర్రాల రవాణా,వైర్ లెస్ సెట్లను సమకూర్చుకోవడం ద్వారా అడవుల్లో గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన ప్రత్యేక మలబార్ పోలీసులను తీసుకొచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం, ధైర్య సాహసాలకు మారు పేరైన రామరాజు సమర్థవంతమైన గూఢచార వ్యవస్థతో పటిష్టమైన గెరిల్లా వ్యూహాలు అమలు జరిపాడు. ఇంత చక్కటి ప్రణాళిక, వ్యూహలు ఉన్నప్పటికి మొదటి ప్రపంచ యుద్ధంలో ఆరితేరిన సైనికాధికారులు, వారి ఆయుధాలు, ప్రత్యేక శిక్షణ ఉన్న దళాలతో మన్యానికి గట్టి దెబ్బలు తగిలాయి. మారిన ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టడానికి ఆయుధాలు సమకూర్చు కోవాలని విప్లవకారుల్లో ఆత్మసైర్యం దెబ్బ తినకుండా చూడాలని రామరాజు భావించాడు. అందుకు తగ్గట్టు ఆయుధ శిక్షణ ఇప్పించాడు. రంపచోడవరం రాజవొమ్మంగి, కృష్ణదేవి పేట, చింతపల్లి, అడ్డతీగల, నర్సీ పట్నం తదితర ప్రాంత పోలీస్ స్టేషన్లను కొల్లగొట్టడానికి తుపాకులు, మందుగుండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కూడా స్థానిక పోలీసు సిబ్బందిని ఏమీ చేయకుండా వదిలేశారు. ప్రజలను పీడించవద్దని హెచ్చరించివదిలి పెట్టారు. .

గంటం దొర, మల్లు దొర, ఎండు పదాలు, అగ్గిరాజు లాంటి మహా వీరులు రామరాజు విప్లవోద్యమంలో దళాలకు నాయకత్వం వహించారు. దోపిడీని మౌనంగా భరించడం తప్ప ఎదురు చెప్పలేని అడవి బిడ్డలు అల్లూరి విప్లవ సైన్యంలో సమరశంఖం పూరించారు. కవర్డ్, హైటర్ వంటి నరహంతక అధికార్లను తిరుగుబాటులో భాగంగా చంపివేసింది అల్లూరి సైన్యం. మేజర్ గుడాల్ అనే క్రూర సైనికాధికారిని, సైనిక బలగాలను, ఫిరంగులను మన్యం గడ్డపై మోహరించింది ప్రభుత్వం. అయినాసరే ఆదివాసీ సైన్యం ఏమాత్రం వెనకడుగేయక… వీరోచితంగా దారి పొడువునా గుండెనెత్తురులు తర్పణం చేస్తూ ముందుకు సాగింది. అశేష త్యాగాలు చేసింది. అంతిమంగా 1924 జనవరి 27న రూథర్‌ఫర్డ్ ను మన్యం అధికారిగా కేటాయించింది ప్రభుత్వం. అస్సాం రైఫిల్స్ దళాలను, గూర్కా దళాలను నర్సీపట్నానికి రప్పించింది. విప్లవకారులను గిరిజన ప్రజలు తమ గుండెల్లో దాచుకున్నారు. అల్లూరి సీతారామరాజును పట్టి ఇచ్చిన వారికి లేదా ఆచూకీ తెలిపిన వారికి పదివేల రూపాయల బహుమతి. ఆయన అనుచరుల ఆచూకీ తెలిపిన వారికి అయిదువేల రూపాయలు ఇస్తామని వారి తలలకు వెల నిర్ణయించారు. విప్లవకారులు గ్రామాలకు దూరంగా గుట్టల్లో, కొండల్లో తల దాచుకుంటూ గెరిల్లా యుద్ధం కొనసాగించారు. బ్రిటిష్ సైనికులు గిరిజన గ్రామాలకు గ్రామాలు తగులబెట్టి బూడిద చేశారు. రామరాజు ఎక్కడున్నాడో చెప్పమని చిత్రహింసలు పెట్టారు. పురుషుల ముందే మహిళలను మానభంగాలు చేశారు. విప్లవకారులను పంపిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు లక్ష్యంగా మారాయి. రంపకొండల్లోని ప్రతి ఇల్లు ‘పూర్తి తనిఖీలకు గురైంది. గిరిజన గ్రామస్తుల వలే కాకుండా గిరిజనేతర గ్రామ పెద్దలు, మద్దతుదార్లు, మున్సిప్లతో కూడిన ధనవంతులు గోడమీద పిల్లి వాటంగా వ్యవహరించారు. విప్లవకారులు పైచేయిగా ఉన్నప్పుడు ఉద్యమానికి సహాయమందించిన వీరు… పోలీసుల అణిచివేత నేపథ్యంలో ఒకవేళ తిరుగు బాటు విఫలమైతే సురక్షితంగా ఉండేందుకు గోడ రెండవవైపుకు దూకారు. గ్రామ మున్సిఫు విప్లవ కారులను పట్టుకొచ్చి అప్పగించిన ఘటనలు, ప్రముఖ నేతల అరెస్టులకు దారితీసిన సమాచారాన్ని అందించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. రామరాజు ఆదేశాలకు విరుద్ధంగా ఆంగ్లేయుల తొత్తులనే పేరుతో స్వదేశీయులను హతమార్చేఆత్మహత్యా సదృశ్యమైన విధానాన్ని అమలుచేశాడు అగ్గిరాజు. దాంతో గంటం దొర, అగ్గిరాజుల మధ్య సదవగాహన కరువైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పర్లాచిమిడి ప్రాంతం నుంచి రామరాజు ఇక్కడకు చేరుకున్నాడు. ఈలోగా విప్లవకారుల వద్ద ఆయుధాలు, మందుగుండు అయిపోయింది. విప్లవోద్యమంలో వీరోచితంగా పోరాడిన ప్రముఖ నాయకులు గంటం దొర, ఎండు పడాలు కూడా వీరమరణం పొందారు. మల్లుదొర బ్రిటిష్ వారికి దొరికిపోవడంతో అండమాన్ జైలుకు పంపారు. మద్దేరు నది వద్ద జరిగిన పోరాటంలో అగ్గిరాజు అరెస్ట్ అయ్యాడు. 1924 మే 6న రామరాజు ఒక కొండ దగ్గర మకాం వున్నాడు. దాహం తీర్చుకోవడానికి కొండ దిగి సెలయేరు దగ్గరకు వచ్చాడు. సెలయేరు ఆవలి ఒడ్డున ఉన్న  పోలీసులకు నీళ్లు తేవడానికి వచ్చినవారు రామరాజును చూశారు. ఇంకేముంది! అక్కడున్న సైన్యానికి సమాచారం అందింది! రామరాజును సెలయేరు వద్ద చుట్టు ముట్టి బంధించారు. మేజర్ గుడాల్ మకాం వద్ద రామరాజుకు, గుడాలకు వాదప్రతివాదాలు జరిగాయి. తమ దేశానికి, మన్య ప్రాంతానికి బ్రిటిష్ పరిపాలన వలనే దుర్భర పరిస్థితి ఏర్పడిందంటూ గుడాల్లో కరచాలనం చేయడానికి సైతం నిరాకరించాడు రామరాజు.

కట్టుకథ….

నిజానికి ఆరోజు రామరాజును చెట్టుకు కట్టివేసి మేజర్ గుడాల్ కాల్పులకు ఆదేశించాడు. కాల్చడానికి ముందు రామరాజునుద్దేశించి ‘నిన్నుచంపాలని నిర్ణయించుకున్నాం. నీవు చెప్పుకొనేది ఏమైనా ఉందా?’ అని మేజర్ ప్రశ్నించాడు. అప్పుడు రామరాజు “నన్ను న్యాయ విచారణకు కోర్టుకు హాజరు పరచాలి. మీరు అందుకు సిద్ధంగా లేకపోతే… నా మాతృభూమి
కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను.” ప్రకటించాడు. అప్పుడు చెట్టుకు చేతులు విరిచి కట్టి ముఖాన్ని కప్పివేశారు. రామరాజు గుండెలపై గురి చూసి కాల్చి చంపాడు మేజర్.కాని తర్వాత బ్రిటిష్ అధికారులు రామరాజు పారిపోతుంటే వెనుక నుంచి కాల్చి చంపారని కట్టుకథను ప్రచారంలో పెట్టారు. అయితే రామరాజు ఘోర హత్యను కళ్ళారా చూసిన కొయ్యూరు గ్రామ వాసులు దీన్ని ఖండించారు. రామరాజును కట్టివేసిన చెట్టును సైతం గుర్తు లేకుండా కాల్చి బూడిద చేసి ఏటిలో కలిపారని వారు తెలిపారు. రామరాజు మృతదేహాన్నిమరునాడు (మే 8, 1924) దహనం చేయడానికి ముందు కృష్ణదేవి పేటలో ఫోటో తీయించారు. తర్వాత లభ్యమైన ఈ ఫోటో చూసిన వారికెవరికైనా… బ్రిటిష్ వారు నర్సీపట్నం డాక్టరు చేత రామరాజు శరీరం వెనుక వైపు తుపాకీ కాల్పులున్నాయని తప్పుడు రిపోర్టు రాయించారని అర్థమౌతుంది.

నిత్య స్ఫూర్తి ప్రదాత

రామరాజు ధైర్యసాహసాలు, దేశభక్తి, గెరిల్లా యుద్ధ నైపుణ్యం, మానవత్వం, వ్యక్తిగత జీవితంలో నిజాయతీ, క్రమశిక్షణ, తను నమ్మిన మార్గాన్ని ఆచరించడంలో నిబద్ధత, ప్రజల కార్యాచరణ పట్ల ఆయనకున్న విశ్వాసం, నిరంతరం ఉత్తేజాన్నిస్తాయి. అడవిబిడ్డలు రామరాజును పూర్తిగా విశ్వసించి ఆయన వెంట నడవడానికి ఇవే ప్రధాన కారణమయ్యాయి.

నాడూ నేడూ ఒకే నిర్బంధం

నేడు రామరాజు, కొమరం భీమ్, రాంజీ గోండు, సోయం గంగులు, గంటం దొర, ఎండు పడాల్, కొమురం సూరు, బిర్సా మూండా, సమ్మక్క, సారక్క, లాంటి ఎందరో ఆదివాసీ పోరాట యోధుల త్యాగధనుల త్యాగానికే పాలకులు తూట్లు పొడిచి ఆదివాసీల ఉనికినే లేకుండా చేస్తున్నారు. సెజ్ లు, భూ సేకరణలు, భారీ విధ్వంస ప్రాజెక్టులు, మైనింగ్ పేరుతో గిరిజన చట్టాల అతిక్రమణను నాటి బ్రిటిష్ పాలకులకు ఏమాత్రం తీసి పోని విధంగా నేటి ప్రధాని మోడీ, రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు వ్యవహరిస్తున్నారు. పోడు భూముల సాగుదారులను భూముల నుండి వెళ్ళగొట్టడం, దాడులు, దౌర్జన్యాలు, నిర్బంధం మళ్ళీ నాటి పరిస్థితులనే తలపిస్తున్నాయి. “అభివృద్ధి” పేర లక్షల ఎకరాల అడవిని ధ్వంసం చేయడానికి బహుళ జాతి, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి పాలకులే పర్యావరణానికి తీవ్రమైన హాని చేస్తున్నారు. అల్లూరి పోరాట త్యాగాల స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల కోసం, ఉనికి కోసం పోరాటం కొనసాగించడమే అల్లూరికి మనం ఇవ్వదగిన నిజమైన నివాళి.

97వ వర్ధంతి సందర్భంగా…… (మే – 7వ తేదీ 1924)

– బండారు రవికుమార్‌
(వ్యాసకర్త సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటి సభ్యులు)

 

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంఅంతర్జాతీయంవ్యవసాయంసాహిత్యంస్పూర్తిప్రముఖులుఆయుర్వేదంపోల్స్విద్యఅధ్యయనంవీడియోలుజర్నలిజంవికాసంపర్యావరణంవినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలుఎన్నికలుతెలుసుకుందాంపిల్లల పెంపకంవిజ్ఞానంనేర వార్తలువార్త-వ్యాఖ్యఆధ్యాత్మికంజీవనంన్యాయంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలువీరమాచనేని డైట్ సలహాలుఎడిటర్ వాయిస్రాజ్యాంగంసమాజంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్కుటుంబంప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి