భద్రాద్రి కొత్తగూడెం, ఆగష్టు 08 (జనవిజయం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మూడు నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయలో రాజకీయ పార్టీ లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా రూపకల్పన, నూతన ఓటర్లు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణలో ఓటరు జాబితా ప్రధానమని, తప్పులు లేని ఫర్ఫెక్ట్ ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహాకారం అందించాలని చెప్పారు. ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 21వ తేదీన ప్రకటించడం జరుగుతుందని, తదుపరి అక్టోబర్ 4వ తేదీ తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 1092 పోలింగ్ కేంద్రాలున్నాయని వాటిలో శిథిలావస్థలో ఉన్న వాటిని మార్చుటకు పినపాకలో 2, ఇల్లందులో 1, కొత్తగూడెంలో 11, అశ్వారావుపేటలో 4, భద్రాచలంలో 8 లొకేషన్ మార్చుటకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. నామికేచర్స్ (నామకరణం) మార్చేందుకు 11 కేంద్రాలకు ప్రతి పాదనలు పంపినట్లు చెప్పారు. 1350 కంటే అధికంగా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని వాటిలో భద్రాచలంలో 2, కొత్తగూడెంలో ఒకటి ఉన్నట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు అవాంతరాలు లేకుండా సజావుగా పకడ్బందిగా నిర్వహించేందుకు ముందు నుండి సన్నద్ధంగా ఉండేందుకు ప్రతి మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తు సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు సూచించిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని విచారణ నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఓటుహక్కు వినియోగంపై మొబైల్ వాహనాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అధికసంఖ్యలో ఓటర్లు మాక్ పోలింగ్లో పాల్గొనాలని చెప్పారు. తొలగించిన ఓటరు జాబితా విచారణకు ప్రత్యేక టీములు పనిచేస్తున్నాయని, ఈ వారంలో విచారణ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓటర్లున్న జాబితా ఆధారంగా విచారణ ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈవియంలు మొదటి దశ తనిఖీ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు బూతు ఏజెంట్లును నియమించి జాబితా అందచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం కనీస సౌకర్యాలైన మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, దివ్యాంగులు, వయోవృద్ధుల కొరకు ర్యాంపులు ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం తహసిల్దార్ ప్రసాద్, బిజెపి నుండి లక్ష్మణ్ అగర్వాల్, నోముల రమేష్, | ఇండియన్ నేషన్ కాంగ్రెస్ నుండి యం. ధర్మారావు, సిపిఐ నుండి సాబీర్్పష, సిపియం నుండి అన్నవరపు సత్యనారాయణ, తెలుగుదేశం నుండి పి కొండస్వామి, ఆమ్ ఆద్మీ నుండి పాపారావు దొర తదితరులు పాల్గొన్నారు.