Tuesday, October 3, 2023
Homeపరిపాలననేరం ఎవరిది? - ఓ రహదారి ఆవేదన!

నేరం ఎవరిది? – ఓ రహదారి ఆవేదన!

రుధిరపు కల్లాపి చల్లుకుంటున్న నాదా?

కాలు విరిగి, తల పగిలి ప్రాణం విలవిల కొట్టుకుంటున్న నా బిడ్డలదా?

అశ్రద్ధగా , నిర్లక్ష్యంగా వాహనం నడిపిన చోదకుడిదా ?

రోడ్డు నియమాలు తెలియకనే లైసెన్సులు పొందిన వారిదా?

అయిన వాళ్లను పోగొట్టుకొని అనాధలైన తల్లి బిడ్డలదా?ముదుసలి తల్లిదండ్రులదా? మళ్ళొస్తానని, వెళ్లొస్తానని మాట తప్పి అనంత లోకాలకు వెళ్లిన అభాగ్యులదా?రోడ్డున పడ్డ బ్రతుకులుదా?

చిదిగి చిధ్రమైన హృదయపు ఘోషధా? ఎవరిది నేరం?

అయినవారిని పోగొట్టుకొని మానసిక వికలత్వం పొందిన పిచ్చివారిదా?

మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణం తీసిన వారిదా? అమ్మినవారిదా? తయారీదారులదా? లాభాలు ఆర్జిస్తూ కళ్ళు మూసుకున్న వారిదా?

నేరం ఎవరిది?

నేరం ఎవరిదైనా రుధిరాశ్రువుల కడలిలో కొట్టుమిట్టాడుతున్న నా ఆవేదన మీ ముందు ఉంచుతున్న. మారండి. ఆనందాలను తుంచకండి. అని విన్నవించుకుంటున్నా.

ప్రమాదం:

నిమిషానికి ఒకరు అనంత లోకాలకు వెళ్లడమో లేదా అర నిమిషానికి ఒకరు అవిటివారిగా మారడమో జరుగుతున్నది. ప్రమాదం అనుకోకుండా జరిగిన దురదృష్టకర సంఘటన అయినప్పటికీ, ఓ తాగుబోతు లేదా నిర్లక్ష్యపు, నియమాలు పాటించని కొందరు వాహన చోదకుల కారణంగా, అకారణంగా ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సంవత్సరానికి లక్షల ప్రాణాలు పోతున్నాయి. లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

ప్రమాదానికి కారణాలు:

వేగంగా నడపడం , తాగి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రాంగ్ రూటులో నడపడం, ఓవర్టేక్ చేయడం, పరధ్యానంగా నడపడం, చెవిలో లేదా కారులో పెద్దపెద్ద శబ్దాలతో పాటలు పెట్టుకోవడం, సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు పెట్టుకొని నడపడం, వంటి సందర్భాలు డ్రైవింగ్ పై ఏకాగ్రతను కుదరనియడం లేదు.

దీనివల్ల నడిపేవారు,  ఎదుటివారు బాధలకు గురి అవడం ఎంతవరకు న్యాయం?

ప్రమాదాల నివారణ బాధ్యతలు :

వ్యక్తిగతంగా, సామాజికంగా, అధికారికంగా అందరూ బాధ్యతలు తూచా తప్పకుండా అనుసరించాలి. వ్యక్తిగతంగా ప్రతి పౌరుడు రోడ్డు నియమాలు పాటించాలి. తాగి నిర్లక్ష్యంగా నడపరాదు. నిద్రమత్తులో నడపరాదు. రాంగ్ రూటులో వెళ్ళరాదు. ఓవర్టేక్ చేయరాదు. నిదానమే ప్రధానం. వేగంగా వెళ్ళరాదు. సెల్ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ, రోడ్డు మీద విన్యాసాలు, ఆటలు ఆడరాదు. చెవిలో పాటలు పెట్టుకుని వెళ్ళరాదు. మనసు బాగాలేక పరాధ్యానంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగా లేనప్పుడు డ్రైవింగ్ చేయకుండా బస్సులో వెళ్లడం మంచిది. చిన్నపిల్లలకు బండ్లు, కార్లు ఇవ్వరాదు. నియమ నిబద్ధతలకు లోబడి పూర్తి వాహన చోదక జ్ఞానం పొందాకనే వాహనాలు నడపాలి. ఎండనకా, వాననకా, దుమ్ము, ధూళినీ లెక్క చేయక ప్రాణాలను కాలుష్యానికి వదిలి మన క్షేమం కోరే రక్షక భటుల మాట వినాలి. హెల్మెట్ ధరించాలి. ఒక్క బండిపై నలుగురు వెళ్ళరాదు. మన క్షేమంతో పాటు ఎదుటివారి క్షేమం కూడా మనదిగా భావించే బాధ్యత గల పౌరుడిగా జీవించాలి. పౌరులు, ప్రభుత్వాలు ఏకమై సంఘటితంగా రోడ్డు నియమాలు పాటించుట సామాజిక బాధ్యత. తప్పు చేసే వారిని ఓ కంట కనిపెట్టి కఠినంగా శిక్షించాలి. ప్రాణాలను లెక్కచేయక నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వారి లైసెన్సులు రద్దు చేయాలి. ప్రాణం విలువ తెలియని వారిని క్షమించడం, వెనకేసుకు రావడం కూడా నేరమే.

తక్షణ న్యాయం జరగాలి:

నిర్లక్ష్యపు, నీచ , నికృష్ఠ వాహన చోదకుల వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వారికి, వారి కుటుంబాలకు తక్షణం న్యాయం చేయాలి. కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిప్పుతూ, కాలయాపన చేయరాదు. ప్రాణం తీసిన వాహన చోదకుడిని వెనకేసుకుని తూతూ మంత్రంగా చేయరాదు. పోయినోడు పోయిండు ఇన్సూరెన్స్ చేసుకపో అంటూ చంపిన వాడిని వదిలేయడం, ఏ శిక్ష పడనీయకుండా సమాజంలో యధేచ్చగా తిరగనియ్యడం వల్ల చూస్తున్న జనాలకు, రేపటి తరాలకు బాధ్యతలు తెలుస్తాయా? భయం ఉంటుందా? ప్రాణం విలువ తెలుస్తుందా? అందరిని నేను అనడం లేదు కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు. బ్రతుకు భారమై, రోడ్డు పాలైన జీవితాలు న్యాయం పొందకుండానే ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయి, ఆకలి చావులు పొందుతున్న వారెందరో?

కావున నాదారిన నేను పోగొట్టుకున్న నా బిడ్డలందరికీ తక్షణమే న్యాయం చేసి, వారి కుటుంబాలను ఆదుకొని అండగా ఉండమని పెద్దలకు విన్నవించుకుంటున్నా. ఓ రహదారి విన్నపం వింటున్న మీరంతా క్షేమంగా కళకళలాడుతూ జీవించాలని ఆశిస్తున్నా.

లోకా సమస్తా సుఖినోభవంతు.

– మణి రాయల్, టీచర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments