Saturday, February 24, 2024
Homeపరిపాలననేరరహిత తెలంగాణలో సీసీ కెమెరాలు కీలకం

నేరరహిత తెలంగాణలో సీసీ కెమెరాలు కీలకం

  • కేసుల పరిష్కారంలోనూ కీలకంగా ఫుటేజి
  • నిందితుల పట్టివేతలో తోడ్పడుతున్న దృశ్యాలు
  • శాంతి భద్రతల పరిరక్షణలోనూ ముఖ్య భూమిక

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనవిజయం): శాంతి భద్రతల పరిరక్షణలో సీసీకెమెరాల పాత్ర కీలకంగా మారింది. అందుకే వీటిని ఏర్పాటు  చేసేందుకు హైదరాబద్‌ సహా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటయిన సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయం ద్వారా అన్ని జిల్లాలను అనుసంధానం చేస్తారు. తద్వారా జిల్లాల్లో కూడా ఎప్పుడు ఏం జరిగినా ఇట్టే పసిగట్టే అవకాశం ఉంది.  ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. అలాగే కొందరు ఔత్యాహికుల ద్వారా కూడా ఏర్పాటు చేయిస్తున్నారు.  ఇటీవల అనేక కేసుల్లో సిసి కెమెరాల ఫుటేజీ బాగా పనికి వస్తోంది. నేరస్తులను గుర్తించి పట్టుకోవడంలో అవి కీలకంగా మారాయి. కేసులను పసిగట్టి కూపీ లాగడంలోనూ బాగా పనికి వస్తున్నాయి. అందుకే కాలనీలు మొదలు, రోడ్లకు ఇరువైపులా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. దాతల నుంచి సహకారం తీసుకుని సిసి కెమెరాల ఏర్పాటును చేయిస్తున్నారు. సిసి కెమెరాలు ఉన్నచోట జరిగే నేరాల్లో త్వరాగా ఫలితాలు వస్తున్నాయని పోలీస్‌ అధికారులు కూడా ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు గతంలోనే డిజిపి తెలిపారు. ప్రజా భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోనే గొలుసు చోరీలను నివారించగలిగారు. సీసీ కెమెరాలు అలసిపోయేవి కావని, 24గంటలు పనిచేస్తూనే ఉంటాయని, దీని ద్వారా నేరగాళ్ల ఆచూకిని త్వరగా గుర్తించే వీలుంటుందన్నారు. పోలీస్‌ సిబ్బంది ఉన్న ఎనిమిదిగంటల మాత్రమే నిఘా ఉండగలరని, అంతకుమించి ఉండే పరిస్థితి ఉండదన్నారు. ఒకవేళ నేరగాళ్లను గుర్తించిన కేసుల సమయంలో సాక్ష్యులుగా వీరు ఉండలేరని, అదే సీసీ కెమేరాలైతే నిజనిర్దారణ వేగంగా అవుతుందన్నారు. కోర్టుల్లో కూడా సీసీ కెమెరాల ద్వారా ఎటువంటి సంశయం లేకుండా శిక్షలు విధించే అవకాశాలు ఉంటాయని డీజీపీ తెలిపారు. అందుకే నగరంలో అన్ని ప్రాంతాల్లో ఈ సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో ఈ సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తున్నది. ప్రజల్లో భరోసా కల్పించేలా ముందుకు సాగుతున్నారు. ఇటీవల అనేక కేసుల పరిష్కారంలో సిసి కెమెరాల ఫుటేజీ కీలకంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments