మహారాజా! బహుశా, ‘నేను’ పోతే పోవచ్చు!!
(పల్లా కొండలరావు, ఖమ్మం)
శ్రీకృష్ణదేవరాయలు భువనవిజయం అనే సాంస్కృతిక సభను నడిపేవారని మనకు చరిత్ర చెబుతుంది. ఆ సభలో మనసును మేల్కొలిపే కార్యక్రమాలు జరిగేవని ఆనాటి అంశాలు నేటికీ కథనాలుగా చెప్పుకోవడం బట్టి తెలుస్తోంది. అలాంటి ఓ అంశం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా చెప్పుకోదగినది ఈ పోస్ట్ లో మీ ముందుంచుతున్నాను. నచ్చితే వెంటనే నలుగురికీ షేర్ చేయండి. నేనీ అంశాన్ని గురుతుల్యులు గతంలో ఖమ్మం బీవీకే నిర్వాహకులుగా పనిచేసిన కందాడై శ్రీనివాసులు గారు వ్రాసిన ఓ పుస్తకం నుంచి గ్రహించాను.
భువనవిజయం సభలో ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభికుల ముందు ఓ సమస్యను ఉంచారు. ఆ సమస్య : ఎవరు స్వర్గానికి వెళతారు? అని. అంతా రాజును పొగుడుతూ మీరు కన్నబిడ్డల్లా ప్రజల్ని పాలిస్తున్నారు. కాబట్టి మీరు స్వర్గానికి వెళతారు అన్నారు, ఒక్కడు తప్ప.
మిగతా సభికులంతా స్వర్గానికి వెళ్లే అర్హత రాయలకు తప్ప అక్కడ ఎవరికీ లేదని తేల్చారు. సభలో మౌనంగా ఉన్న ఆ ఒక్కడు రామలింగడు. దీనిని గమనించిన రాయలవారు ఏం రామలింగ కవీ! మీరు మిన్నకున్నారు? మీ అభిప్రాయం ఏంటని అడిగితే రామలింగడు తడుముకోకుండా ‘బహుశా నేను పోతే పోవచ్చు మహారాజా!’ అన్నాడు.
సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అంతా రాజు స్వర్గానికి వెళతాడు అంటుంటే రామలింగడు ఏంటి తను స్వర్గానికి వెళతానంటాడని ఆశ్చర్యపోతున్న సమయంలో రాయలు కల్పించుకుని మహాకవీ! మీ మాటల్లోని ఆంతర్యాన్ని విశదంగా చెప్పగలరా! అని అడగ్గా రామలింగడు ఇలా వివరించాడు.
‘నేను’ అనే అహంకార స్వభావం ఎవరిలో అయితే పూర్తిగా తొలగిపోతుందో అట్టి ప్రతిఒక్కరూ స్వర్గానికి వెళతారు అన్నాడట. సభికులంతా రామలింగడి ప్రతిభను మెచ్చుకున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవల్సింది ‘నేను’ అనేది అహంగా కాకుండా ఆత్మవిశ్వాసంగా ఉంటే ఉపయోగంగా ఉంటుంది.