నేను-నేనే-మనం
“నేను’కు, “నేనే’కు తేడా తెలుసుకుంటే మనము విలువ తెలుస్తుంది.’నేను’ వర్ధిల్లుతుంది.’నేను’ ఉంటుంది.ఉండాలి. ‘నేను’ అనేది లేకపోతే మనిషిలో ఎదుగుదల ఉండదు. నేను సాధించాలి, నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం ఉండి తీరాలి. ఇది మనలోని బద్ధకాన్ని వదిలిస్తుంది. మనలను పనిలో పెడుతుంది. మనం కోసం నేను సాధించేది ఇందులో ఉంటుంది. మనం కోసం నేను సాధించిన విజయానికి మనం జేజేలు పలుకుతుంది. ఆ జేజేలు నేను మరిన్ని మంచి పనులు చేయడానికి ప్రేరణను అందిస్తుంది. నేను సాధించేది ఏదైనా మనం కోసమే అయి ఉండాలి. ఆ మనంలోనే నేను ఉంటుందని గుర్తుంచుకోవాలి. నేను సాధించేది సంతృప్తికరంగా సాగాలి అంటే కూడా మనం అవసరం అనివార్యం. ఉదాహరణకు నేనో గొప్ప గాయకుడిని. ఆ పాటకు పదిమంది విని హర్షధ్వానాలు పలికితేనే కదా నాకు ఆనందం కలిగేది. అంటే నా ట్యాలెంట్ కు విలువ వచ్చేది పదిమంది మెచ్చుకున్నపుడే. పదిమందికి ప్రయోజనం ఉంటేనే కదా మెచ్చుకుంటారు. కనుక నేను-మనం ల మధ్య ఉండే ఈ సహజ సంబంధంను అర్ధం చేసుకుంటే నేను, మనం పరస్పరం సహకారంతో జీవించగలరు.
ఈ ప్రపంచంలో అందరూ ఒకే రకమైన నైపుణ్యాలను కలిగి ఉండరు. ప్రపంచం ముందుకు నడవాలంటే అన్ని నైపుణ్యాల కలయిక అవసరం. ఉదాహరణకు ఓ గొప్ప డాక్టరు వినోదం కోసం సినిమాకు వెళతాడు. డాక్టరుకు వినోదం పంచగలిగిన నటుడుకు ఆరోగ్య సమస్య వస్తే డాక్టరు వద్దకే రావాలి. ఇక్కడు డాక్టర్ అనే నేను, నటుడు అనే నేనులు మనంగా ఒదిగి ఉండాలి. విజయాన్ని సాధించే క్రమంలో వివిధ నేనుల మధ్య నైపుణ్యాల విషయంలో తేడా ఉంటుంది.
‘నేను’ల మధ్య ఈ తేడాకు ‘నేను’కు,’నేనే’కు ఉండే తేడా ఒకటి కావు.ఈ రెండింటి మధ్యా తేడా ఉంది. ‘నేను’ అనేది సాధించాలనే తపన కలిగి ఉంటే, ‘నేనే’ అనేది నేను మాత్రమే సాధించాలి అనే స్వార్ధాన్ని కలిగి ఉంటుంది. ఇతరులు సాధించకుండా అడ్డుపడే ఈర్ష్య, అసూయ. పగలను రగిలిస్తుంది. ‘నేను’ అనేది ఉండాలి. ఉంటుంది. కానీ అది ‘మనం’లో ఒదిగి ఉండాలి. ‘నేను’, ‘మనము’లో ఒదిగి ఉండటమే జనవిజయం అవుతుంది. జనవిజయమే ప్రపంచానికి శ్రీరామరక్ష.
వ్యక్తుల ఆధిపత్యాలు, అహంభావాలు ప్రపంచానికి ప్రమాదాన్ని కొనితేవడమే గాక సమాజంలో అంతరాలను సృష్టిస్తుంది. ఎపుడూ అశాంతిని రగిలిస్తూనే ఉంటుంది. జ్ఞానం అనేది చాలా గొప్ప అంశం. అది ఏ ఒక్కరికో మాత్రమే ఉండడం అసాధ్యం. వివిధ వ్యక్తుల పరస్పర సహకారంతో మాత్రమే జ్ఞానం వర్ధిల్లుతుంది. జ్ఞానం ఎపుడూ సమాజహితం కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల స్వార్ధం కోసం కాదు. మనిషి ఎంత జ్ఞానాన్ని పెంపొందించుకున్నా అహంభావాన్ని వదులుకోకపోతే ఎందుకూ పనికిరాకుండా పోతాడు. మానసికంగా అశాంతితో రగిలిపోతుంటాడు. చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.
కనుక నేను సాధించాలి. నేను చేయగలను వంటి పాజిటివ్ ఆలోచనలను పెంచుకునే ప్రయత్నం కొనసాగించండి. నేనే అనే ఈర్ష్య, అసూయ, పగ, ఓర్వలేనితనం వంటి హీనమైన, రాక్షస ఆలోచనలను ఆదిలోనే తుదముట్టించండి. మీ పిల్లలలో పొరపాటున నేనే అనే నెగిటివ్ ఆలోచనలు, ధోరణులు కనిపిస్తుంటే వెంటనే వారికి అర్ధమయ్యేలా చెప్పండి. మనం యొక్క అవసరాన్ని, గొప్పతనాన్ని వారికి చెప్పండి. వారిలో మంచి ధోరణి అలవాటుగా మారేలా నిరంతరం కృషి చేయాలని చెప్పండి.