Tuesday, October 3, 2023
Homeమనం మారగలంనేను ‘మనము’లో ఒదగడమే 'జనవిజయం’

నేను ‘మనము’లో ఒదగడమే ‘జనవిజయం’

నేను ‘మనము’లో ఒదగడమే ‘జనవిజయం’

(పల్లా కొండలరావు,ఖమ్మం)

వ్యక్తికీ,సమాజానికీ ఉండాల్సిన సంబంధం గురించి చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం. వ్యక్తి గొప్పతనాన్ని ఎలా చూడాలి? వ్యక్తి దేనైన్నా ఎవరికోసం సాధించాలి? అనేదే లక్షలాది జీవరాశుల్లో మనిషి ప్రత్యేకతను తెలుపుతుంది. మనసు ప్రధానమైన జీవి మనిషి. మనిషి యొక్క ఆలోచనా విధానమే మనసు. జీవుల్లో ఆలోచించగలిగేది మనిషి మాత్రమే. పాతదాని ఆధారంగా ఆలోచనా శక్తితో కొత్తది ఎప్పటికప్పుడు ఎలా మెరుగ్గా ఉండాలో శ్రమించి తయారు చేయగలిగేది, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగలిగేది మనిషే. ఇతర జీవరాశుల్లో ఈ మార్పును చూడలేం. మనిషి సహజంగా సంఘజీవి. సమాజం ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లలో మంచివి కొనసాగిస్తూ.. మెరుగుపరుచుకుంటూ, చెడ్డవి తొలగించుకుంటూ.. ఎప్పటికప్పుడు మెరుగైన, మేలైన సమాజం కోసం మనుషులు నిరంతర జీవనపోరాటం చేస్తుంటారు. ఈ పోరాటంలో వ్యక్తి పాత్ర ఏమిటి? ఎలా ఉండాలి? అనేదాన్ని బట్టి వ్యక్తి విజయం ఆధారపడి ఉండాలి.

తాత్కాలిక భ్రమలకు లోనుకాకూడదు

ఓ వ్యక్తి తనకిష్టమైన రంగాన్ని ఎంచుకుని పనిచేస్తూ సంతృప్తికరంగా ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఆ పనిలో సాధించే ఫలితాలను బట్టి సమాజంలో ఆ వ్యక్తి గొప్పతనం ప్రదర్శితమవుతుంది. ఏది గొప్ప అనేది ఆయా సమాజాలను బట్టి చూసేవిగా కొన్ని ఉంటే, నిత్య సత్యాలుగా ఉండేవి కొన్ని ఉంటాయి. సమాజ లక్షణాలు కల్పించే భ్రమలో కొట్టుకుపోయేవి తాత్కాలిక గొప్పలు మాత్రమే. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పద్ధతిగా సాధించేవే అసలైన విజయాలు.

సమాజంలో ఎలా సంపాదించినా సరే డబ్బు సంపాదించినవారు గొప్పగా చూపబడుతున్నారు అనుకుందాం. ప్రస్తుత పరిస్తితి అలాగే ఉంది కూడా. ఏ అవసరం తీరాలన్నా డబ్బు పాత్ర కీలకంగా ఉందనుకుందాం. దీన్ని చూసి మనమూ డబ్బు సంపాదించాలనే ఆలోచనకు రావడం సహజమే. కానీ డబ్బును తన అవసరాల రీత్యా మనిషే సృష్టించుకున్నాడనేది గుర్తుంచుకోవాలి. ఈ డబ్బు మానవ సంబంధాలను ధ్వంసం చేస్తున్నప్పుడు వాటిని అనివార్యంగా కాపాడుకోవలసిన మనిషి, ఆ డబ్బునే రద్దు చేసుకునే దిశగా కొత్త ఆలోచనలు చేయకతప్పదనేది గుర్తుంచుకోవాలి. ఇలాంటి పరిణామాలను శాస్త్రీయంగా అంచనా వేస్తూ తాత్కాలిక భ్రమలకు లోనుకాకుండా శాశ్వత విజయాల కోసం ప్రయత్నించాలి.

ప్రత్యామ్నాయం వచ్చేంత వరకే పాతది కొనసాగుతుంది

ఏదీ శాశ్వతం కాదు. మేలైనది, మెరుగైనది ప్రత్యామ్నాయం కనుగొనగలిగినంత మేరకే పాతదాని మనుగడ కొనసాగుతుంది. అంటే ఒక సమాజంలో గొప్పదిగా చూడబడింది, మరో సమాజంలో గొప్పది కాకపోవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా మేలైనదిగా ఉండే అంశాలే నిత్య సత్యాలు. అలాంటి నిత్య సత్యాలను నిలబెట్టేందుకు ఆ సత్యాలకు విలువనిచ్చే సమాజం ఏర్పాటు కోసం ప్రయత్నించడమే మనిషి సాధించాల్సిన శాశ్వత విజయం. ఆ క్రమంలో జీవన గమనం సాగిస్తున్నవారు తాత్కాలిక, భ్రమాత్మక గెలుపులతో సంతోషపడేవారి కంటే గొప్పవారుగా చరిత్రలో మిగులుతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు.

మనం కాపాడుకోవలసిన రెండు కీలక సంబంధాలు

శాశ్వత సత్యాలను గురించి ఆలోచిస్తే మనిషికుండే కీలక సంబంధాలుగా మొదటిది ప్రకృతితో సంబంధం. రెండోది సాటి మనుషులతో సంబంధం అనేవి ఉంటాయి. మనిషి ఈ సంబంధాలను ఎలా కొనసాగిస్తున్నాడనేదాన్ని బట్టి తన విజయం వైపు పయనిస్తుందీ లేనిదీ నిర్ణయించాలి. మనిషికి అన్ని అవసరాలూ తీర్చేది ప్రకృతి గనుక, ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రకృతి వనరులను మనిషి అవసరానికి మించి వాడటం అనేది అందరికీ ఆపదను కలిగించేది. కనుక అలాంటి చర్యలను వ్యతిరేకించడం, ప్రకృతిని కాపాడే చర్యలను చేయడం అనేవి గొప్ప పనులు అవుతాయి. ఓ మనిషి జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎదుగుదులతో తోటి మనుషులతో కలిసి వారి సహకారంతో సహచర్యంతో నేర్చుకోవడం జరుగుతుంది. ఒంటరిగా జీవించడం అసాధ్యం కనుక అణచివేత, వివక్షత, నియంతృత్వం లేని ముఖ్యంగా కలసి ఉండే, కలుపుకుపోయే మానవ సంబంధాల కోసం ప్రయత్నాలు చేయడం అనేది అన్నింటికంటే గొప్ప పని అవుతుంది. మన జీవనం ఈ దిశగా ఉన్నదా? లేదా? అనేది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందడుగు వేయాలి.

పాతదాని ఆధారంగానే కొత్తది ఉంటుంది

సహజంగా మనిషి ఆలోచనలను చుట్టూ ఉండే సమాజం, పరిస్థితులూ ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రస్తుత సమాజంలో వ్యక్తి విజయానికి కారణంగా ఆ వ్యక్తి కృషినీ, ఆ వ్యక్తి సంపాదనను ప్రామాణికంగా చెబుతూ ఉంటారు. ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఓ వ్యక్తి విజయం సాధించడం అంటే తను అనుకున్నది సాధించడం జరిగిందని అర్థం. ఈ విజయంలో వ్యక్తి పాత్ర, సమాజం పాత్ర, పరిస్థితుల ప్రభావం అనేవి ఎలా ఉన్నాయి అనేది కూడా చూడాలి. ప్రతి విజయంలో వ్యక్తి పాత్ర ఉంటుంది. కానీ ఏ విజయమైనా ఒక వ్యక్తికి మాత్రమే చెందదు. ఇది గుర్తించిన వ్యక్తి అసలు సిసలు విజేత. ఏ మనిషైనా, ఏ పనైనా ఇలా చేయాలని ప్లాన్ వేసుకోవడానికి ఆలోచన కీలకం. ఆలోచన కేవలం ఆ మనిషిది అనుకుంటే పొరపాటు. గతంలో ఆ పనికి సంబంధించిన అనుభవాల ఆధారంగా ప్రస్తుత అవసరాలను బట్టి ఒక మనిషి ఆలోచించడం జరుగుతుంది. ఇప్పటి ఆలోచనకు గత అనుభవాల సారం ఉపయోగపడిందంటే గతంలో అనుభవాలు సాధించిన మనుషులు ఆలోచనలు ఇప్పటి మనిషికి ఉపయోగపడతాయంటే ఇప్పటి ఆలోచన మెరుగ్గా ఉండటానికి గత ఆలోచనలు ఉపయోగపడ్డాయనే కదా?! అంటే ఇప్పటి ఆలోచన కేవలం ఇప్పటికిప్పుడే పుట్టింది కాదనేది నిజం. ఇప్పటి ఆలోచన ఇలా చేయగలిగిన వ్యక్తి పాత్ర మాత్రం గుర్తించాల్సి ఉంటుంది. అదే సమయంలో పాత ఆలోచనల సహకారం ఉందన్న సత్యాన్ని మరువకూడదు. ఏదైనా సరే ఒక్కరిదే కాదనేది గుర్తుంచుకోవాలి. కనుక ఒక మనిషి తాను ఎదగడానికి ప్రకృతి, సమాజం ఎన్ని విధాలుగా ఉపయోగపడ్డాయో, తిరిగి వాటి మనుగడకు తాను అంతగానే సహకారం అందించాలి.

వ్యక్తిగత విజయాలు ఉండవా..?!

విజయం అంటే అందరిదీ లేదా కొందరిదీ అనుకుంటే విజయంలో వ్యక్తి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. విజయంలో వ్యక్తి పాత్ర తప్పక ఉంటుంది. ఒక గ్రామంలో అందర్నీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యం అయితే ఆ ఆలోచన అందరికీ రాకపోవచ్చు. కొందరికే రావచ్చు. ఆ కొందరిలో ఒక్కరే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. వారే నాయకులుగా ఉంటుంటారు. అంటే ఒక వ్యక్తి విజయంలో భాగస్వామి కాగలడని మాత్రమే చెప్పగలిగినా, మిగతా వ్యక్తుల కంటే భిన్నంగా, నాయకునిగా ఉండటం అనేది చేయగలగడం అనేది వ్యక్తిగత విజయంగా చెప్పవచ్చు. వ్యక్తిగత క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకోవడం వంటి లక్షణాలను జీవితాంతం సాధన చేయడమనేది వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య తేడా ఉంటుంది. వ్యక్తిగత విజయం అనేది విజయంలో భాగంగా ఉంటుందని గుర్తించగలిగినవారే నిజమైన విజేతగా గుర్తించబడతారు. ఎప్పటికీ అన్ని విషయాల్లో మనుషులంతా సమానం అనేది అసాధ్యం. కానీ మనుషులందరూ సమాన అవకాశాలను కలిగి ఉన్నప్పుడు మనుషుల మధ్య సమాజం సృష్టించిన అంతరాలు తొలగిపోతాయి.

గెలుపుకీ, విజయానికీ తేడా ఏమిటి..?

ఇతరులను ఓడించడం ద్వారా సాధించేది గెలుపు. గెలుపులో ఒకరిద్దరు గెలిస్తే చాలామంది ఓడిపోతారు. కానీ అదే విజయంలో అయితే అందరూ కలిసి సాధిస్తారు. ఉదాహరణకు ఓ పరుగు పందెంలో వందమంది పాల్గొంటే మొదటి, రెండో స్థానాల్లో గెలిచిన వారు మిగతా 98 మందినీ ఓడిస్తారు. అదే ఓ గ్రామంలో అందరినీ అక్షరాస్యులుగా చేయాలనే తలంపును ఆచరణలో విజయంగా మలచాలనుకుంటే మరికొందరి సహకారంతో ఆ గ్రామంలో అందర్నీ అక్షరాస్యులుగా తయారుచేయవచ్చు. ఇక్కడ అందర్నీ అక్షరాస్యులుగా తయారుచేయాలనే ఆలోచన ఓ వ్యక్తిది. ఆ ఆలోచన ఆ వ్యక్తికి రావడానికి చదువు విలువను ఆ వ్యక్తి గుర్తించడమే కారణం. అతనికి చదువు నేర్పిన గురువుల వల్ల, చదువు వల్ల అతను పొందిన మార్పుల వల్ల ఇతరులూ ఆ విజయాలను, ఆనందాలను పొందాలన్న లక్ష్యం ఏర్పడటానికి కారణం అయింది. ఇది మరికొందరికి ప్రేరణ కలిగించవచ్చు. ఇదే మనుషుల మధ్య ఉండాల్సిన సంబంధాల్లో కీలకమైనది. ఆ లక్ష్యం నెరవేరాలంటే మరికొందరు అక్షరాలు నేర్పే గురువులుగా సహకారం అందించినవారు, అక్షరాలు నేర్చుకున్న విద్యార్థులంతా కలిస్తేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఆ లక్ష్యం పెట్టుకున్న వ్యక్తి దానిని సాధించామన్న ఆనందం పొందాలంటే ఇందరి తోడ్పాటు తప్పక అవసరం. అంటే ఒక విజయం పరిపూర్ణత అనేది ఒక్కరిగా కంటే కొందరిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా వ్యక్తి కంటే సమూహం యొక్క శక్తి గొప్పది. ఐక్యత కు, సంఘటితానికి ఉన్న శక్తి, అవకాశాలు వ్యక్తి శక్తి కంటే ఎప్పుడూ మెరుగ్గానే ఉంటాయి.

‘నేను’కు, ‘నేనే’కు తేడా ఉంది

“నేను’కు, “నేనే’కు తేడా తెలుసుకుంటే మనము విలువ తెలుస్తుంది. ‘నేను’ వర్ధిల్లుతుంది. ‘నేను’ ఉంటుంది. ఉండాలి. ‘నేను’ అనేది లేకపోతే మనిషిలో ఎదుగుదల ఉండదు. నేను సాధించాలి, నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం ఉండి తీరాలి. విజయాన్ని సాధించే క్రమంలో వివిధ నేనుల మధ్య నైపుణ్యాల విషయంలో తేడా ఉంటుంది. ‘నేను’ల మధ్య ఈ తేడాకు ‘నేను’కు, ‘నేనే’కు ఉండే తేడా ఒకటి కావు. ఈ రెండింటి మధ్యా తేడా ఉంది. ‘నేను’ అనేది సాధించాలనే తపన కలిగి ఉంటే, ‘నేనే’ అనేది నేను మాత్రమే సాధించాలి అనే స్వార్ధాన్ని కలిగి ఉంటుంది. ఇతరులు సాధించకుండా అడ్డుపడే ఈర్ష్య, అసూయ. పగలను రగిలిస్తుంది. ‘నేను’ అనేది ఉండాలి. ఉంటుంది. కానీ అది ‘మనం’లో ఒదిగి ఉండాలి. ‘నేను’, ‘మనము’లో ఒదిగి ఉండటమే జనవిజయం.

భువనవిజయం సభలో ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభికుల ముందు ఓ సమస్యను ఉంచారు. ఆ సమస్య : ఎవరు స్వర్గానికి వెళతారు? అని. అంతా రాజును పొగుడుతూ మీరు కన్నబిడ్డలా ప్రజల్ని పాలిస్తున్నారు. కాబట్టి మీరు స్వర్గానికి వెళతారు అన్నారు. ఒక్కడు తప్ప మిగతా సభికులంతా స్వర్గానికి వెళ్లే అర్హత రాయలకు తప్ప అక్కడ ఎవరికీ లేదని తేల్చారు. సభలో మౌనంగా ఉన్న ఆ ఒక్కడు రామలింగడు. దీనిని గమనించిన రాయలవారు ఏం రామలింగ కవీ! మీరు మిన్నకున్నారు? మీ అభిప్రాయం ఏంటని అడిగితే రామలింగడు తడుముకోకుండా ‘బహుశా నేను పోతే పోవచ్చు మహారాజా!’ అన్నాడు. సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అంతా రాజు స్వర్గానికి వెళతాడు అంటుంటే రామలింగడు ఏంటి తను స్వర్గానికి వెళతానంటాడని ఆశ్చర్య పోతున్న సమయంలో రాయలు కల్పించుకుని మహాకవీ! మీ మాటల్లోని ఆంతర్యాన్ని విశదంగా చెప్పగలరా అని అడగ్గా రామలింగడు ఇలా వివరించాడు. ‘నేను’ అనే అహంకార స్వభావం ఎవరిలో అయితే పూర్తిగా తొలగిపోతుందో అట్టి ప్రతిఒక్కరూ స్వర్గానికి వెళతాడు అన్నాడట. సభికులంతా రామలింగడి ప్రతిభను మెచ్చుకున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవల్సింది ‘నేను’ అనేది అహంగా కాకుండా ఆత్మవిశ్వా సంగా ఉంటే ఉపయోగంగా ఉంటుంది.

మనము ‘అవసరం’- అవకాశాలు-ఆటంకాలు

నేను సాధించింది ఎవరి కోసం.? నేను బాగా పాడగలను? నేను పాడిన పాట ఎవరైనా విని ఆనందించినప్పుడు మాత్రమే నాకు సంతృప్తి కలుగుతుంది. ఇక్కడ ‘నేను’కు సంతృప్తి కలగాలంటే ‘మనము’ అవసరం ఉంది. ఇలాగే ఏ ‘నేను’ అయినా ‘మనము’తో కలిసి మాత్రమే మనగలుగుతుంది. ‘నేను’ ఎదగడానికి ‘మనము’ అవసరం. ‘నేను’ ఒదగడానికీ ‘మనము’ అవసరం. ఓ వ్యక్తి పుట్టగానే అన్నీ నేర్చుకోడు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనిషి ఎదగడానికి తల్లి నుంచి సమాజంలోని వివిధ సంబంధాలు, ప్రకృతి అనేక విధాలుగా సహాయపడతాయి. ఈ సంబంధాల ఆధారంగా ఎదిగిన వ్యక్తి తిరిగి ఆ సంబంధాల కోసం ప్రకృతి కోసం తాను సాధించింది ఉపయోగించాలి. తల్లి అనేది సహజ సంబంధం, కుటుంబం, వావి వరుసలు అనేవి మనిషి కట్టుబాట్ల కోసం ఏర్పరచుకున్న మానవ సంబంధాలు. న్యాయం, చట్టం, రాజ్యాంగ యంత్రం, కొన్ని సాంఘిక కట్టుబాట్లు కూడా వివిధ పరిస్థితుల్లో మనిషి ఏర్పాటు చేసుకున్నవే. వీటిలో ఏవి సహజమైనవీ? ఏవి అసహ జమైనవి? ఏవి అవసరం? ఏవి అనవసరం? అనేవి తేల్చుకునే మంచి ఆలోచనల వైపే ‘నేను’ ఉండాలి. అలాంటి ‘నేను’ల సంఖ్య పెరిగితే ” మనము’ అనేది బావుంటుంది. అలాగాక ‘నేనే’ల సంఖ్య పెరిగితే ఆ సమాజంలో అశాంతి, అసమానతలు ఎక్కువవుతాయి. కావున ‘నేను’ ‘మనము’లో ఒదిగి ఉండేలా సమాజాన్ని తయారు చేసేలా కృషి జరగాలి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక మానడు. పుట్టి గిట్టేలోగా సాగించే జీవన గమనంలో మనిషి చేయాల్సింది ఏమిటి? సమాజంలో ఓ మనిషి జీవితంలో అవసరమయ్యేవి ఏవి? అనవసరమైనవి ఏవి? అని ఆలోచిస్తే చాలా వరకు అభివృద్ధిని సాధించవచ్చు. ‘మనము’ యొక్క అవసరాన్ని గుర్తించి, ‘మనము’కున్న అవకాశాలను ఉపయోగించకుంటూ, ఆటంకాలను అధిగమిస్తూ ఉండాలి. ఈ ఆలోచన సవ్యంగా, సమైక్యంగా ముందుకు సాగేలా చేయగలగాలి.

‘మనము’ కోసం మనతో మనమే పోరాడాలి

“మనము’కు గానీ, ‘నేను’కు గానీ ఆటంకం కలిగించేవి ఏమిటి? ఇక్కడ రెండే ఉంటాయి. మొదటిది ప్రకృతి. రెండోది మనిషి. అంటే మనిషి పోరాడాల్సింది మనిషికుండే రెండు సంబంధాలతోనే. ప్రకృతి వైపరిత్యాలను, శాస్త్ర విజ్ఞానాన్ని వృద్ధి చేపుకోవడం ద్వారా ఎదుర్కోగలం. ఇది నిరంతర పోరాటం. మనుషుల్లో వివిధ భావజాలాలు వివిధ సమూహాలుగా ఏర్పడతాయి. వీటిలో ‘మనము’ను శాశ్వతంగా నిలబెట్టే భావజాలం తాత్కాలికంగా తక్కువ బృందంగా ఉన్నా, శాశ్వతంగా విజయం సాధించాలంటే ‘మనము’ను కాపాడగలిగే భావజాలాన్ని వ్యాపింపజేయగలిగిన, ఆ భావజాలాన్ని ఓ బలమైన శక్తిగా తయారు చేయాలి. ఈ క్రమంలో మనుషుల మధ్య పోరాటం, సంఘర్షణ అనివార్యం. ఉదాహరణకు స్త్రీలను తక్కువగా చూడటం అనేది ఇంటి నుండే అలవాటైతే, మనిషి మానసిక వికాసం ఎదుగుతున్న కొద్దీ స్త్రీని మనిషిగా చూసే మానవత్వం పెరగాలి. ఇందుకు వ్యతిరేకించే మనుషులతో పోరాడక తప్పదు. రక్షణ విషయంలో పోలీసులు, సైన్యం దేశాల సరిహద్దులు అవసరం లేని వసుధైక కుటుంబపు ప్రపంచం ఏర్పాటు దిశగా పోరాడి సాధించుకోవాలి. ఈ పోరాటం ఈ అంశాలను వ్యతిరేకించేవారితోనే చేయాలి. అంటే ‘మనము’ కోసం మనతో మనమే పోరాడాలి. ఈ పోరాటం ఇంటి నుండి మింటి వరకు అన్ని అంశాల్లోనూ ఐక్యతగా జరగాలి.

పోరాటం క్రమానుగతంగా సాగాలి, వ్యసనంగా కాదు!

మనం మనతోనే పోరాటం అంటే మనుషులతోనే అయినప్పుడు అది వ్యసనంగా కాక, క్రమానుగతంగా జరగాలి. జనాన్ని వీలైనంత మేరకు మార్చుకుంటూ పోవాలి. జనం కోసం చేసే పోరాటం తగినంత బలం లేకుండా చేస్తే సాధించిన ఫలితం సమర్థవంతంగా అమలు చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. జనాన్ని మార్చే క్రమంలో పోరాటం ఆరాటంగా ఉంటే నష్టమే తప్ప ప్రయోజనం తక్కువ. అవసరమైనప్పుడు, అనివార్యమైనప్పుడూ పోరాట పద్ధతికి, పోరాటం కోసం పోరాటం చేసే దానికి (పోరాట వ్యవసం) తేడా ఉంటుంది. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏ పోరాటపంథా ఉండాలనేది వివిధ అనుభవాలను పాఠంగా తీసుకుని ఎత్తుగడలు వేసుకోవాలి. అన్నిటికీ ఒకే మూస పద్ధతి, పుస్తకాలను బట్టీపట్టి చరిత్రను మక్కీకి మక్కీ అనుసరించడం, మారిన పరిస్థితులను, మార్పు క్రమాన్నీ అంగీకరించని అతివాదం లేదా మూర్ఖత్వం అవుతుంది. అధ్యయనం- ఆచరణ – అనుభవం – పాఠాలు అనేవి ఓపికగా ఒద్దికగా చేయాల్సిన, నేర్వాల్సిన, అనుసరించాల్సిన అంశాలు.

వసుధైక కుటుంబం అసాధ్యమా?

వసుధైక కుటుంబం అసాధ్యమా? మనిషి అసాధ్యం అనుకున్నవి ఎన్నో సుసాధ్యం చేసుకున్నాడు. ఒకప్పుడు ఆలోచనకు సైతం అందని అద్భుతాలను నేడు ఆవిష్కరించగలుగుతున్నాడు. కనుక వసుధైక కుటుంబంలా ‘ఒకే కుటుంబం-ఒకే ప్రపంచం’ అనే భావన .. భావనగా గాక ఆ చరణలో సాధ్యం కాకపోవడం అంటూ ఉండదు. ఎప్పటికప్పుడు మేలైన, మెరుగైన సమాజం వైపు మానవుడు ప్రయత్నిస్తూ విజయాలు సాధిస్తూ ఉంటాడు. ఆ దిశగా మంచి ఆలోచనలు, సమైక్య పోరాటాలు సాగాలని, విజయాల పరంపర కొనసాగుతుండాలని, ప్రపంచ మానవులంతా ఒకే కుటుంబంలా జీవించగలిగే ఉన్నత సమాజం వస్తుందని ఆశిద్దాం. అప్పుడే జనులంతా విజయం సాధించినట్లవుతుంది. జనవిజయం వర్ధిల్లుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments