నేను ‘అలర్ట్’గా ఉండాలంటే ?

0
647
Share this:

మనం సహజంగా అన్నీ విజయాలే దక్కాలని కోరుకుంటాం. అందుకోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాం. తపన పడుతుంటాం. ప్రయత్నాలన్నీ అనుకున్న ఫలితాలను ఇవ్వవు. కొన్ని ఫెయిల్ అవుతాయి. ప్రయత్న లోపంతో ఫెయిల్ అయ్యేవి కొన్ని కాగా, అనుకోని ఆటంకాలు వచ్చి మన ప్రయత్నం విఫలం కావడం కొన్ని సందర్భాలలో జరుగుతుంది. కాస్త అటూ ఇటూ కావచ్చేమోగానీ ఇది అందరి విషయంలో సాధారణంగా జరిగేదే.

అయితే విజయాలకు, పరాజయాలకు అందరూ ఒకేలా స్పందించరు. విజయం సహజంగా ఆనందాన్ని ఇస్తుంది. కొందరికి అహంభావాన్ని పెంచుతుంది. అపజయం కొందరిని డీలా పరుస్తుంది. కొందరికి పాఠాలు నేర్పి రాటుదేలుస్తుంది. విజయాలకు పొంగకుండా, అపజయాలకు కృంగకుండా ఉండాలని అందరికీ ఉంటుంది.

పరిస్థితులు, పరిసరాలు, మన మనస్తత్వం ఆధారంగా మనం స్పందించే తీరులో మార్పులు జరుగుతాయి. చాలా సందర్భాలలో మనం ఆ సమయంలో అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది, అక్కడ అలా తొందరపడి మాట జారకుండా ఉంటే బాగుండేది, కోపం తగ్గించుకుంటే బాగు, ఏ పరిస్థితులలో అయినా ప్రశాంతంగా ఉండగలిగితే బాగు….. ఇలా రకరకాలుగా మనతో మనం, మనలో మనం మాట్లాడుకుంటుంటాం. కాకుంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది.

మనం ఎపుడూ పరిస్థితులకు, పరిసరాలకు సందర్భోచితంగా ప్రవర్తించాలంటే ప్రతిక్షణం ఎలర్ట్ గా ఉండడం అలవరచుకోవాలి. ఇలా నిరంతరం ఎలర్ట్ గా ఉండడం అలవాటుగా మార్చుకోగలిగితే మీరు మీ ప్రవర్తన పట్ల పశ్చాత్తాప్పడే సందర్భాలు తగ్గుతాయి. ఇది మీ మనసును ఆహ్లాదకరంగా, అప్రమత్తంగా ఉంచేందుకు, తద్వారా మీ పనిలో ఏకాగ్రతను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది.

పరిస్థితులు, పరిసరాలు మన ఆధీనంలో ఎల్లపుడూ ఉండకపోవచ్చు. కానీ వాటికి రియాక్ట్ అయ్యే తత్త్వం అంటే మన మనసుని మన ఆధీనంలో ఉంచుకోగలగడం ప్రాక్టీసు చేసుకుంటే మన ప్రయత్నాలకు ఎదురయ్యే ఆటంకాలకు బెదరకుండా, విజయాలకు పొంగకుండా ఉండేలా స్థితప్రజ్ఞతను సాధించవచ్చు. దీనికోసం మనం చేయాల్సింది ప్రతిరోజూ మన ‘మనసుకు స్నానం చేయడం’, ‘పని ప్రణాళిక’ను వేసుకోవడంలను అలవాటు చేసుకోవడమే.

మనసుకు స్నానం చేయడం ఎలా?

రోజుకు 24 గంటలుంటాయి. అంబానీ కైనా అప్పారావుకైనా  ఇందులో మినహాయింపులుండవు. ఒక్క క్షణం కూడా అదనంగా సృష్టించుకోలేము. ప్రతిరోజు ఎవరైనా తన పనులను ఈ 24 గంటలలోనే పూర్తి చేయాలి. కాబట్టి సమయపాలన అనేది చాలా కీలకం. వివిధ పరిస్థితులలో, వివిధ ప్రదేశాలలో, రకరకాల మనుషులతో మనం ప్రవర్తించే తీరు ధృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకు కావలసింది మనం చెప్పినట్లు మన మనసు వినేలా చేసుకోగలగడం. రోజులో కనీసం పావుగంట సేపు (రోజులో 100వ వంతు) ధ్యానం లేదా రిలాక్షేషన్ చేయడానికి కేటాయించాలి. దీనికోసం ఉదయం లేదా రాత్రి పడుకునేముందు సమయం కేటాయించగలిగితే చాలు. దీనినే మనసుకు స్నానం చేయడం అంటారు. ఇలా చేయడం వలన ఆ రోజు మొత్తంలో మన మనసును మన మాట వినేలా చేసుకోవడం అలవాటుగా మారుతుంది. ఆచరిస్తూ పోతే క్రమంగా అదో శక్తిగా తయారవుతుంది. ఇతరత్రా టెక్నిక్ లు క్రమంగా ప్రాక్టీసు చేసుకోవడం ద్వారా మనసును మన ఆధీనంలో ఉంచుకునేలా చేసుకోవడం చేయవచ్చు.

పని ప్రణాళిక ఎలా?

ప్రతిరోజూ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుగుణంగా అడుగులు వేయాలి. దానిలో భాగంగా ఈరోజు పనులను ప్లాన్ చేసుకోవాలి. దీనికో డైరీ మెయింటైన్ చేయాలి.  ఉదయం ప్లాన్ చేసుకున్నాక ఆ పనులు చేయడానికి మనవంతు లోపం లేకుండా ప్రయత్నం చేయాలి. ఫలితం ఎలా ఉన్నా తిరిగి ప్రశాంతంగా తరువాత రోజు పనులను డైరీలో ప్లాన్ చేసుకునేందుకు సిద్ధం కాగలగాలి. ఈరోజు ఏ పని ఎందుకు, ఎలా జరిగిందీ సమీక్షించుకుని పనులను తిరిగి ఈరోజు చేసేందుకు రెడీ కావాలి. వదిలేయాలసినవి వదిలేయాలి.

ఇలా ఈ రెండు టెక్నిక్ లు అలవాటుగా మార్చుకుని చూడండి. ఈరోజే ఇలా చేయడం అలవాటుగా చేసుకోండి. మధ్యలో బ్రేక్ వచ్చినా మళ్లీ ప్రారంభించండి. ఫలితం రావడం ఖాయం. ఆ ఫలితమే మిమ్ములను ఈ టెక్నిక్ లను అనుసరించేలా ముందుకు తీసుకుపోతుంది.

– పల్లా కొండలరావు,
kondalarao.palla@gmail.com

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.