Tuesday, October 3, 2023
Homeవార్తలునేడు సున్నం రాజయ్య మూడవ వర్ధంతి

నేడు సున్నం రాజయ్య మూడవ వర్ధంతి

మూడు సార్లు ఎమ్మెల్యేగా భద్రాచలంకు ప్రాతినిధ్యం
– అందరివాడుగా రాజయ్యకు పేరు

ఖమ్మం, ఆగష్టు 3(జనవిజయం):

భద్రాచలం శాసనసభ్యుడుగా మూడు సార్లు పనిచేసి అందరి మన్ననలు పొందిన గిరిజన ఆదివాసీ ముద్దు బిడ్డ, అమరజీవి కామ్రేడ్‌ సున్నం రాజయ్య కరోనాతో మృతి చెంది మూడు సంవత్సరాలు గడిచింది. 2020 ఆగస్టు 3వ తేదీ రాత్రి 11గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సున్నం రాజయ్య మృతి చెందారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న రాజయ్య చేసిన అభివృద్ధి చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ సున్నం రాజయ్య నిరాడంబరంగా, సామాన్య జీవితం గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. సీపీఐ(ఎం) పోరాటాలు, ఉధ్యమాలలో తనదైన శైలిలో సున్నం రాజయ్య పనిచేశారు. ప్రాణం పోయినా సీపీఐ(ఎం)ను వీడనని సున్నం రాజయ్య పలుమార్లు ప్రకటించారు. భద్రాచలం నియోజకవర్గంలో రాజయ్య చేసిన అభివృద్ధి చిరస్థాయిగా నిలుస్తోంది.
రాజయ్య కుటుంబ నేపథ్యం…
ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా విఆర్‌పురం మండలం సున్నంవారి గూడెంలో 1958 ఆగష్టు 8న కన్నమ్మ-రాజుల దంపతులకు రాజయ్య జన్మించారు. పదో తరగతి వరకు చదువుకున్న రాజయ్యకు చుక్కమ్మతో వివాహం చేశారు. ఆయనకు లక్ష్మి స్వరాజ్యం, చంద్రరావు, రామరాజు సంతానం. 1979లో సీపీఐ(ఎం) సభ్యత్వం తీసుకున్నారు. వీఆరపురం మండలంలోని చిన్నమట్టపల్లి సర్పంచ్‌గా 1988లో విజయం సాధించి పనిచేశారు. అదేవిధంగా 1994 నుంచి 2001 వరకు భద్రాచలం డివిజన్‌ సీపీఐ(ఎం) కార్యదర్శిగా పనిచేశారు.
మొదటిగా డీవైఎఫ్‌ఐ భద్రాచలం డివిజన్‌ కార్యదర్శిగానూ, అధ్యక్షునిగానూ పనిచేశారు. ఏజెన్సీలో యువతను మార్క్సిస్టు పార్టీ వైపు నడిపించడానికి మన్యంలో విల్లంబుల పోటీ, గ్రామీణ క్రీడలైన కబడ్డీ తదితర క్రీడా పోటీలు నిర్వహించి యువతలో సీపీఐ(ఎం) పట్ల అంకితభావం ఏర్పరుచుకునేలా కృషి చేశారు. తనకున్న పదిహేను ఎకరాల వ్యవసాయ భూమిని సైతం గిరిజనుల చిన్నారుల చదువుకోసం ఆశ్రమపాఠశాల నిర్మాణానికి ఐదెకరాలు, కాలనీ నిర్మాణానికి మరో ఐదెకరాలు, ఊరికి చెరువు కావాల్సి వచ్చినప్పుడు మరో ఐదెకరాలు రాసిచ్చారు. ఇలా సర్వస్వం తమ తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు దానం చేసిన ఉదారవాది రాజయ్య.
భద్రాచలం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపు..
భద్రాచలం శాసనసభ్యుడిగా సున్నం రాజయ్య మూడుసార్లు గెలుపొందారు. 1999లో తొలిసారిగా భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేవిధంగా 2004, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో భద్రాచలం నుంచి, 2019లో మరోసారి ఆంధ్రప్రదేశ్లోని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రాజయ్య ఓటమి చెందారు.
కాగా భద్రాచలం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనే సున్నం రాజయ్య బస్సులు, ఆటోలు సాదాసీదాగా సామాన్యునిలా ప్రయాణించేవారు. అదే విధంగా ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో తన వాణిని ప్రత్యేకంగా వినిపించేవారు. పలు సమస్యల పరిష్కారం కోసం ఆయన పోరాటాలు, ఉద్యమాలు చేసి అసెంబ్లీ ద్వారా పలు సమస్యలకు పరిష్కారం చూపారు.
అందరివాడు సున్నం రాజయ్య..
భద్రాచలం ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసిన సున్నం రాజయ్య అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. నిదానం అతని ఇంటిపేరు, నిలకడ ఆయన అసలు పేరుగా అనునిత్యం ప్రజల సమస్యల కోసం పోరాటంచేస్తూ అందరివాడుగా ఉండేవారు. ఏజెన్సీకి సున్నం రాజయ్య సీపీఐ(ఎం) ద్వారా ఎన్నో పోరాటాలు,ఉద్యమాలలో భాగస్వామ్యమై చాలా చురుకుగా పాల్గొనేవారు.
భూ పోరాటాలు, తునికాకు పోరాటాలు పోలవరం నిర్వాసితుల కోసం మహాపాదయాత్ర, తమ్మినేని సైకిల్‌ యాత్ర, తదితర పోరాటాల్లో సున్నం రాజయ్య చురుగ్గా పాల్గొనేవారు. అదే విధంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వెళ్లిన విలీనం మండలాలను తిరిగి భద్రాచలంలో కలపాలని డిమాండ్‌ చేస్తూ భద్రాచలంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అదేవిధంగా విభజనల సమయంలో జిల్లా సమయంలోనూ భద్రాచలం నియోజకవర్గానికి అన్యాయం జరిగిందంటూ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సమస్యలు ప్రధానంగా ప్రాజెక్టులు, వైద్యం, విద్య తదితర సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేవారు.
కోయ భాషలో ప్రసంగం
ఐటీడీఏ పాలకమండలి, శానససభ జరిగే భారీ సభలు, సమావేశాల్లో కోయభాషలోనే మాట్లాడి, ఆదికారులు, ఆదివాసీలను ఆకట్టుకునేవారు.
ఉధ్యమ నేపథ్యం…
పూర్వ కమ్యునిస్టు నాయకులు కుంజా బొజ్జి, భీమయ్య రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన రాజయ్య, తొలుత ‘ డీవైఎఫ్‌ఐలో చేరి, డివిజన్‌ కార్యదర్శిగా యువజన ఉద్యమంలో సుదీర్ఘకాలం పని చేశారు. 1978లో సీపీఐ(ఎం) సభ్యత్వం పొందగా, 1995లో డివిజన్‌ కార్యదర్శిగా బాధ్యతల్లో కొచ్చారు. 1985లో మావోయిస్టులు అప్పటి నాయకులు బండారు చందర్రావును, బత్తుల భీష్మారావును హతమార్చిన సందర్భంలో రాజయ్యపైనా మావోయిస్టులు దాడి చేశారు.
అనంతరం 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదే భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో భద్రాచలం ఎంపీగా డాక్టర్‌ మిడియం బాబూరావు, ఎంఎల్‌ఎ రెండోసారి గెలిచారు. తిరిగి మళ్లీ 2014లో మూడోసారి ఇదే నియోజవర్గ ప్రజలు రాజయ్యకు పట్టం కట్టారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా రాజయ్య అనేక బాధ్యతల్లో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments