Saturday, February 24, 2024
Homeరాజకీయం అబ్రహం లింకన్‌ జయంతి నేడు

 అబ్రహం లింకన్‌ జయంతి నేడు

వాషింగ్టన్‌,ఫిబ్రవరి12 : భగవంతుడు సృష్టించిన మనుషులందరిలోనూ ఒకే రంగుగల రక్తం ప్రవహిస్తోంది. అయితే కొందరు పుట్టుకతో భాగ్యవంతులు, మరి కొందరు నిరుపేదలు. మనిషికి మనిషి గౌరవం ఇవ్వాల్సివస్తే ఎవరిని గౌరవించాలి. ధనవంతుడినా లేక పేదవాడినా లింకన్ని ప్రశ్నిస్తే ఎగాదిగా చూస్తాడు. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుందంటాడు. ఇదే విషయాన్ని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు అబ్రహాం లింకన్‌. 1861.. అమెరికా గతిని మార్చేసిన సంవత్సరం. మానవతావాది, నిస్వార్థ ప్రజాస్వామ్య నేత అబ్రహాం లింకన్‌ అమెరికా దేశ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఆయనకు ముందు 15మంది, తర్వాత చాలామంది ఆ పీఠం విూద కూర్చున్నారు. అయితే, ఎవరూ ఆయన స్థాయిని చేరుకోలేకపోయారు. ఇప్పటికీ అమెరికా ప్రజల ఆరాధ్య అధ్యక్షుడు లింకనే అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆయన అమెరికన్ల మనసులపై ముద్రవేశారు. 1809, ఫిబ్రవరి 12న అమెరికాలోని కెంటకీలో జన్మించాడు లింకన్‌. తండ్రి వడ్రంగి పనులు చేసేవాడు. చిన్నతనంలోనే విషజ్వరాల కారణంగా తల్లిని పోగొట్టుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగా తరచూ వలసలు వెళ్లే కుటుంబంలో పెరగడంతో పెద్దగా చదువుకోలేదు. తల్లి మరణం తర్వాత తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే సవతి తల్లి లింకన్‌పై ఎంతగానో వాత్సల్యం పెంచుకుంది. సొంతబిడ్డలాగా సాకేది. ఆమె పెంపకంలోనే లింకన్‌ నీతి, నిజాయతీలను ఒంటబట్టించుకున్నాడు. ’మనిషికి బాగా జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మగౌరవం’ అన్న తన తల్లి మాటలు లింకన్‌ మనసులో చెరగని ముద్ర వేశాయి. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మినవాడు లింకన్‌. అందుకే నలుపు, తెలుపు భేదాలను అంగీకరించలేకపోయాడు. దేశంలో నల్లవారు బానిసత్వంలో మగ్గుతుంటే సుస్థిరత ఎక్కడుంటుందని ప్రశ్నించాడు. ` అందుకే దేశంలో బానిసత్వం, వర్ణవివక్షను రూపుమాపుతానని ప్రకటించాడు. ’ది డివెడైడ్‌ స్పీచ్‌’ పేరుతో ఆయన చేసిన ప్రసంగం అమెరికన్ల భవిష్యత్తునే మార్చివేసింది. మనుషులంతా సమానమని, వర్ణభేదం వద్దంటూ లింకన్‌ ఇచ్చిన పిలుపు చాలామందిని కదిలించింది. లింకన్‌ అమెరికా అధ్యక్షుడయ్యేలా చేసింది. నల్లవారి అభ్యున్నతి కోసం లింకన్‌ మరింత ముందుకెళ్లాడు. వీరికి ఓటు హక్కు కల్పిస్తానని ప్రకటించాడు. దీంతో కొందరు శ్వేత జాతీయులు లింకన్పై కుట్రపన్నారు. అంతమొందించేందుకు ప్రయత్నించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన లింకన్ను 1865 ఏప్రిల్‌ 15న జాన్‌ విల్కీస్‌ బూత్‌ అనే డ్రామా నటుడు తుపాకీతో కాల్చిచంపాడు. అమెరికా అగ్రరాజ్యంగా అవతరించేందుకు పునాదులేసిన లింకన్‌ మరణంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఆ దేశ చరిత్ర నుంచి ఓ దార్శనికుడు కనుమరుగయ్యాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments