మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది !
- లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి
- ఖమ్మం కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం, జూలై 25 (జనవిజయం):
మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ స్థానిక కాల్వఒడ్డు వద్ద మున్నేరు ఉధృతిని, ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్నేరు గంట క్రితం 18 ఫీట్లు ఉండగా, ప్రస్తుతం 19 ఫీట్లకు చేరుకుందని, గంటకు ఫీటు చొప్పున ఉధృతి పెరిగే అవకాశం ఉందని అన్నారు. 1.38 లక్షల క్యూసెక్కులుతో ప్రవాహం ఉన్నట్లు, ఆకెరు, బయ్యారం ల వద్ద వాగులు ఉప్పొంగితే దాని ప్రభావం మున్నేరుపై పడుతుందని అన్నారు.
నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి, మౌళిక వసతుల కల్పన చేసినట్లు ఆయన తెలిపారు. ముంపుకు గురయ్యే మోతినగర్, బొక్కలగడ్డ ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన అన్నారు. ఇప్పటికి 6 ఇండ్ల వారిని తరలించినట్లు, ప్రవాహం పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. మునిసిపల్, రెవిన్యూ, పోలీస్, ఇర్రిగేషన్, మత్స్య, విద్యుత్ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేసి విధులు కేటాయించినట్లు, రాత్రంతా అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని గమనిస్తూ ఉండాలని, లైఫ్ జాకెట్, టార్చ్ లైట్, తరలింపుకు వాహనాలు సిద్ధంగా ఉంచాలని, ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. మున్నేరు వంతెనపై రాకపోకలు నిషేధించి, ట్రాఫిక్ ను మళ్లించాలని కలెక్టర్ తెలిపారు.
ముంపు ప్రాంతాల ప్రజలు అధికారులకు సహకరించాలని, ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.కలెక్టర్ పరిశీలన సమయంలో మునిసిపల్ ఇఇ కృష్ణా లాల్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, ఫిషరీస్ ఏడి ఆంజనేయ స్వామి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు ఉన్నారు.