జనవిజయంజాతీయంమోడీజీ... ఆలోచించండి.....ఆత్మ పరిశీలన చేసుకోండి...

మోడీజీ… ఆలోచించండి…..ఆత్మ పరిశీలన చేసుకోండి…

ప్రజలను కష్టాల్లోకి నెట్టిన ఏడేళ్ల పదవీయోగం !

ప్రధానిగా మోడీ ఏడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. మరో మూడేళ్లు ఈ పదవిలో ఆయన ఉంటారు. అలాగే గతంలో గుజరాత్ సిఎంగా మూడు టర్మ్ ల కాలాన్ని కూడా అనుభవించారు. అయితే కరోనా కష్టకాలంలో బిజెపి నేతలు, శ్రేణులు ఈ ఏడేళ్ల ఉత్సవాలను ఎక్కడా ప్రస్తావించడం కానీ, పండగలు చేసుకోవడం కానీ జరగలేదు. కరోనా కష్టకాలం కావడంతో కొంత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. లేకుంటే ఎన్నికలు నిర్వహించినట్లుగా ఊరూవాడా బ్యాండ్ బాజా మోగించేవారు. అయితే దేశంలో ఇంత సుదీర్ఘ కాలం ఉన్నత పదవులు అధిష్టించిన మోడీ ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. గుండెమీద చేయివేసుకుని దేశం కోసం చేసిందేమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఆశాపథం వైపు మళ్లించాయా లేదా అని ఆలోచించాలి. యువతకు ఏటా కోటి ఉద్యోగాలు ఇచ్చామా లేదా అన్నది ఆలోచించాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా లేదా అన్నది ఆలోచించాలి. దేశంలో వస్తువుల ధరలు ఎందుకు ఇంతగా పెరిగిపోతున్నాయో ఆలోచించాలి. నోట్ల రద్దు, జిఎస్టి, పెట్రో, గ్యాస్ ధరల పెంపు వల్ల దేశం ఎంతగా నిర్వీర్యం అయ్యిందో… ప్రజలు ఎంతగా నిత్యం నరకం అనుభవిస్తున్నారో ఆలోచన చేయాలి. ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకాలి.

ఏడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నందుకు నరేంద్రమోదీ ఆనందంగా ఉన్నారేమో కానీ సగటు భారతీయుడు మాత్రం ఆనందంగా లేడని గుర్తించాలి. ఆదానీ, అంబానీలు, చౌక్సీలు, మోడీలు, మాల్యాలు ఆనందంగా ఉన్నారేమో గాని దేశ ప్రజలు ఆనందంగా లేరని నిస్సందేహంగా గుర్తించాలి. ఏడేళ్ల ఉత్సవాలు జరుపుకోవలసిన వారిలో అంటే మోడీని అనుసరిస్తున్న వారిలో కూడా ఏమంత ఉత్సాహం లేదన్నది వాస్తవం. రెండు నెలలుగా దేశంలో విజృంభించిన సెకండ్ వేవ్ కరోనా వేలాది కుటుంబాలను విషాదంలో ముంచింది. కుటుంబాలకు కుటుంబాలను మృత్యుకూపంలోకి నెట్టింది. అయినవాళ్లను కోల్పోయిన అనాథలు, శవాల దిబ్బలు కళ్ల ముందు కానవస్తున్నా చలించని ఏడేళ్ల అనుభవం చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. కరోనా విపత్కర కాలంతో ప్రభుత్వ వైఫల్యం సామాన్యుడి నుంచి మాన్యుడి వరకు అనుభవంలోకి వచ్చింది. ఏ అవరోధమూ లేకుండా జైత్రయాత్ర సాగించిన నరేంద్రమోదీకి మరో మూడేళ్లు కూడా ఎదురు ఉండకపోవచ్చు. కానీ అది సంతృప్తిని ఇస్తుందా అన్నది ఆలోచించాలి. జనాలు చస్తున్నా..హాహాకారాలు చేస్తున్నా చలించని రాతిగుండెతో పాలన చేయడం వల్ల కలిగే ఆనందం మోడీలోనే చూస్తున్నాం.

కరోనా కారణంగా ఉత్పన్నమయిన పరిస్థితులలో ముఖ్యమైనది ఆర్థికరంగ సంక్షోభం. అనేక ఉత్పాదక, సేవా రంగాలు దెబ్బ తిన్నాయి. కోట్లాది మందికి ఉపాధి నష్టం జరిగింది. ప్రభావితమైన వాటిలో సంఘటిత, అసంఘటిత పరిశ్రమలు, పెద్ద, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. చిన్న, స్వతంత్ర వ్యాపారాలు పూడ్చిపెట్టుకుని పోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయిన వారు కోట్లాదిమంది ఉన్నారు. ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్ల స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడే పుంజుకోవు. ప్రజలలో కొనుగోలు శక్తి ఛిద్ర మయ్యింది. బతుకుడెలా అని మదనపడుతున్న తరుణమిది. ఇవన్నీ ఆలోచించే అవకాశం ప్రధాని మోడీకి ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆలోచించే శక్తీ ఉంటే దెబ్బతిన్న రంగాలను, దెబ్బతిన్న ప్రణాళికలను గట్టెక్కించడం పెద్ద పనేమీ కాదు. దేశంలో ఆర్థిక వనరులకు, వ్యవసాయ వనరులకు కొదవ లేదు. మేధావులకు అంతకన్నా కొదవ లేదు.

కానీ వీటి గురించి కూడా ఆలోచించే మనసున్న వ్యక్తి మనముందు లేడన్నదే బాధ. పార్టీలో అద్వానీ, జోషి, వాజ్ పేయ్ లాంటి వారు ఉండివుంటే ఇలా జరిగేదా.. బిజెపి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించేదా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. 20 లక్షల ప్యాకేజి అన్నారు. ఏమయ్యిందో తెలియదు. మారటోరియం కాలంలో అప్పుల మీద చక్రవడ్డీలు వసూలు చేయకూడదనే సుప్రీం ఆదేశాలను కూడా బ్యాంకర్లు పాటించలేదు. తను చేసిన పొరపాటును గుర్తించి, ప్రభుత్వం నిర్దిష్టమైన, ప్రయోజనకరమైన ఉద్దీపనలను ఇవ్వక తప్పదని పరిశీలకులు ఆశించారు. వివిధరంగాలకు ప్రయోజనకరమైన ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వడం, ద్రవ్యోల్బణం అదుపు చేయడం వంటి చర్యలకు ఉపక్రమిస్తారని భావించారు. కరోనా వేళ జిఎన్టీపై సమీక్షిస్తారని అనుకున్నారు. వివిధ వర్గాలకు నేరుగా లబ్దిని చేకూర్చే విధంగా ప్రణాళికలు ఉంటాయని అంతా ఆశించారు. కానీ మోడీ ఆలోచనలు, ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. కరోనా వైరస్ పై పోరాటంలో భారత్ విజయం సాధించిందన్న ఉత్సాహంలో ప్రధాని సంతోషంగా ఉన్నారు. అమెరికా కంటె మనమే బాగా కట్టడి చేయగలిగామని మోదీ గట్టిగా చెప్పుకుంటున్నారు. అయితే కరోనాపై పోరాటంలో సంపన్న దేశాల కంటే మనం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు ఏమిటో మోదీ చెప్పడం లేదు. దేశంలో ఇప్పటికీ రోజుకు వేయిమందికి పైగా చనిపోతున్నా, జాగ్రత్తల పాటింపులో ఒకరకమైన అలక్ష్యం, బాధ్యతా రాహిత్యం వ్యాప్తి చెందడానికి కేందప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు రోడ్డెక్కితే గాని బతకలేరు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదు. ఐదు కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే పూట గడిచేదెలా అన్న ఆలోచన… బంగ్లాల్లో జీవించ డానికి అలవాటు పడ్డవారికి తెలియదు.

ఈ ఏడేళ్ల కాలంలో భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని కేందప్రభుత్వం అనేక కీలక, తీవ్ర నిర్ణయాలు తీసుకున్నదని పదేపదే చెబుతున్న వారు… వాటి వల్ల పేదవాడి ఆకలి తీరిందా అన్నది ఆలోచన చేయాలి. వాటి వల్ల ఓ నిరుద్యోగికి ఉద్యోగం లేదా ఉపాధి దక్కిందా అన్నది ఆలోచన చేయాలి. ఏడేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలతో ప్రజల జీవనగతులు మారాయా లేదా అన్నది మోడీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరో మూడేళ్ల కాలంలో అయినా దేశ ఆర్థిక గతిని మార్చగలగాలి. ప్రజల బతుకుకు భరోసా దక్కాలి. అందుకు ఆత్మపరిశీలన అవసరమని గుర్తించాలి. అప్పుడే ఆయన సమర్ధ నేతగా గుర్తింపు పొందుతారు. లేకుంటే అందరిలాగే చరిత్రహీనుల జాబితాలో చోటు దక్కించుకుంటారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి