పునరావాస కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
భద్రాచలం, జూలై 29 (జనవిజయం): గోదావరి వరదల బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలకు సదుపాయాలు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకత్వ బృందం శనివారం భద్రాచలం లోని పునరావాస కేంద్రాలను సందర్శించింది. అక్కడ అందుతున్న సదుపాయాలను గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ను కోరారు. పునరావాస కేంద్రాల్లో తమకు సమయానికి భోజనం సరిగా అందటం లేదని, సౌకర్యాలు కల్పించడంలో జాప్యం జరుగుతుందని సీపీఐ నాయకులతో భాదితులు తమ ఆవేదన ను వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాల్లో పాలు, బ్రెడ్ ఇవ్వాలని, దోమల నివారణకు జెట్ కాయిల్స్ అందజేయాలని సీపీఐ నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దోమ తెరలు కూడా పంపిణీ చేయాలని కోరారు. వరదల్లో నష్ట పోయిన బాధితులకు ప్రతి కుటుంబానికి 25 వేలు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు మారెడ్డి శివాజీ, బత్తుల నరసింహులు, మీసాల భాస్కరరావు, లంకపల్లి విశ్వనాథ్, ఎస్ వి ఎస్ నాయుడు తదితరులు ఉన్నారు.