వైరా, ఆగష్టు 29 (జనవిజయం): మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో నివాసం ఉంటున్న దూపాటి శివరాజుకు మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన ధూపాటి శివరాజు తల్లాడ మిషన్ భగీరదలో కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. జులై 24వ తేదీన రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురు చూస్తుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొని దూపాటి శివరాజు రెండు కాళ్లు విరిగిపోయాయి. శివరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మంచంలో ఉండటంతో భార్య భారతి కూలి పనులకు పోయే అవకాశం లేకుండా పోయింది. కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు డబ్బులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సహాయం చేయాలని మార్పు స్వచ్ఛంద సంస్థను కోరడంతో సోమవారం మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత ధూపాటి శివరాజు ఇంటికి వెళ్ళి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ “సర్వీస్ బిఫోర్ సెల్ఫ్”. నినాదంతో మార్పు స్వచ్ఛంద సంస ఆధ్వర్యంలో సమాజం పట్ల బాధ్యతగా ఆపదలో ఉన్నవారికి తమవంతు సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి గుడిమెట్ల మోహనరావు, సభ్యులు కోటేరు మాధవి, మాదినేని నాగరాణి, కంభంపాటి సత్యనారాయణ, తోట పుష్పా, కవిత, నౌషిన్, శైనా బేగం, కరిష్మా, సతీష్, సందీప్, భారతి, ఫరీద తదితరులు పాల్గొన్నారు.