శాశ్వత సత్యాలను గురించి ఆలోచిస్తే మనిషికుండే కీలక సంబంధాలుగా మొదటిది ప్రకృతితో సంబంధం. రెండోది సాటి మనుషులతో సంబంధం అనేవి ఉంటాయి. మనిషి ఈ సంబంధాలను ఎలా కొనసాగిస్తున్నాడనేదాన్ని బట్టి తను విజయం వైపు పయనిస్తుందీ లేనిదీ నిర్ణయించాలి.
మనిషికి అన్ని అవసరాలూ తీర్చేది ప్రకృతి గనుక, ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రకృతి వనరులను మనిషి అవసరానికి మించి వాడటం అనేది అందరికీ ఆపదను కలిగించేది. కనుక అలాంటి చర్యలను వ్యతిరేకించడం, ప్రకృతిని కాపాడే చర్యలను చేయడం అనేవి గొప్ప పనులు అవుతాయి.
ఓ మనిషి జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎదుగుదులతో తోటి మనుషులతో కలిసి వారి సహకారంతో సహచర్యంతో నేర్చుకోవడం జరుగుతుంది. ఒంటరిగా జీవించడం అసాధ్యం కనుక అణచివేత, వివక్షత, నియంతృత్వం లేని ముఖ్యంగా కలసి ఉండే, కలుపుకుపోయే మానవ సంబంధాల కోసం ప్రయత్నాలు చేయడం అనేది గొప్ప పని అవుతుంది.
మన జీవనం ఈ దిశగా ఉన్నదా? లేదా? అనేది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందడుగు వేయాలి. చిన్నప్పటినుండే ఈ రెండు అంశాలు మనసులో బలంగా నాటుకుపోయేలా పాఠాల్లో సిలబస్ ఉండాలి. శాస్త్రీయ విద్యావిధానం దీనికి ఊతం ఇస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, కథలు, పాటలు, సినిమాలు అన్నింటా ఈ రెండు అంశాలకు బలం చేకూర్చేలా చూసుకోవాలి.
మన సంస్కృతిలో ధర్మో రక్షతి రక్షితః అని, వృక్షో రక్షతి రక్షితః అని చెబుతుంటాం. ఇక్కడ ధర్మం అంటే ప్రకృతి ధర్మం శాస్త్రీయంగా అధ్యయనం చేయడం, మనుషులు ఐక్యంగా, దోపిడీ లేకుండా ఆనందంగా జీవించేందుకు దోహదపడే మా’నవ’సంబంధాలు అభివృద్ధి చేయడం కావాలి.
ఎప్పటికప్పుడు ఈ రెండు కీలక సంబంధాలను మెరుగు పరచడానికి సైన్స్ కూడా దోహదం చేయాలి. ప్రస్తుతం దోపిడీకి ఉపయోగపడే, లాభాల్ని తెచ్చిపెట్టే, ప్రకృతిని విధ్వంసం చేసే సైన్స్ అభివృద్ధి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు, మానవతా వాదులు సమైక్యంగా ఎదుర్కోవాలి. ఇది నిరంతరం కొనసాగించాల్సిన, మెరుగు పరచాల్సిన ధార్మిక కర్తవ్యం.
– పల్లా కొండలరావు, చొప్పకట్లపాలెం.