- సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కుట్రలు
- ఉద్దేశపూర్వకంగానే బీజేపీ విద్వేషాలను రేకెత్తిస్తోంది
- సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్
ఖమ్మం, జూలై 30 (జనవిజయం): ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకే కేంద్రం హింసను ప్రేరేపిస్తోందని సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్ ఆరోపించారు. అసత్య, అభూత కల్పనల ప్రచారంతో దేశంలో గందరగోళ పరిస్థితిని సృష్టిస్తుందన్నారు. సోషల్ మీడియా వేదికలను విషప్రచారం కోసం వాడుకుంటుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్ లో రెండురోజుల పాటు నిర్వహించిన పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి.
ఇందులో రవికుమార్ మాట్లాడుతూ, బిజెపి ప్రజల్లో విద్వేషాలను రగిలిస్తోందన్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దాదాపు తొంబై రోజులుగా మణిపూర్ కాలిపోతుంటే, కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. మణిపూర్లో హింస దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని తెలిపారు. అక్కడ శాంతి నెలకొందని కేంద్ర ప్రభుత్వం చెబుతుండటాన్ని తప్పుబట్టారు. మణిపూర్‌లో శాంతి కావాలంటే ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘మణిపూర్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వారు ప్రభుత్వం పై పూర్తిగా నమ్మకం కోల్పోయారు. ప్రభుత్వం మాకు సహాయం చేయదని వారు అనుకుంటున్నారు’ అని అన్నారు.
ఇప్పటి వరకు మణిపూర్‌లో పర్యటించేందుకు కూడా ప్రధాని మోడీ ప్రయత్నించలేదని విమర్శించారు. మణిపూర్‌లో శాంతి నెలకొందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదనీ, అదే నిజమైతే సహాయక శిబిరాల్లోని ప్రజలు తమ ఇండ్లకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. దాదాపు మూడు నెలలుగా మణిపూర్ ప్రజలు తమ ఇండ్లకు దూరంగా ఉన్నారన్నారు. హింసలో చాలా మంది ప్రజలు తమ ఇండ్లు, వస్తువులను కోల్పోయారని, వారికి ఏమీ మిగలలేదని చెప్పారు. మణిపూర్ లోని ఘర్షణలు దేశంతో పాటు ఈశాన్య ప్రాంతాన్ని కూడా దెబ్బతీసిందని అన్నారు.
ఈ క్లాసుల్లో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పి.సోమయ్య మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, పొన్నం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, భూక్యా వీరభద్రం, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వర్లు, వై.విక్రమ్, బొంతు రాంబాబు, చింతలచెర్వు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
