మణిపూర్ సంఘటనను ఖండించిన కలకోట సర్పంచ్ దయామణి
- బిజెపి మహిళలకు రక్షణ లేకుండా చేస్తుంది
బోనకల్, జూలై 24 (జనవిజయం):
మణిపూర్ సంఘటన మాయనిమచ్చ అని, యావత్ ప్రపంచాన్ని ముఖ్యంగా మహిళలను, మైనార్టీ (క్రైస్తవ)వర్గ ప్రజలను ఆందోళనకు గురించేసిందని, విభిన్న మతాలకు సంసృతి సాంప్రదాయలకు ,ప్రపంచ శాంతికి నిలయమైన భావ స్వరూప్యం గల అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేడు ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని అల్లరి మూకలు ఆటపట్టిస్తూ పట్టపగులు నడి బజార్లలో నడిపిస్తూ చరవాణి చిత్రాలతో పెట్రేగిపోతుంటే ఈ దేశం ఎటు పోతుంది? అని కలకోట సర్పంచ్ యంగల దయామణి ప్రశ్నించారు. మండలంలో కలకోట గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం జనవిజయంతో ఆమె మాట్లాడారు.
చీమ చిట్టుక్కుమంటేనే ఒళ్ళంతా కళ్లుచేసుకొని క్షణాల్లో వాలిపోయే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, బలం, బలగం, అల్లర్లను అణచివేయగల సమర్ధమైన పోలీస్ వ్యవస్థ ఉన్న దేశంలో నెలలు నెలలుగా మణిపూర్ రావణ కాష్టంలో రగులుతూ ఉంటే పాలకులు ఏంచేస్తున్నట్టు? కుకి – మైతేయి రెండు ఆదివాసీ తెగల మధ్య ఆధిపత్య గొడవలను చర్చలు ద్వారా పరిష్కరించకుండా మైతేయి వర్గ (బి జె పి మద్దతుదారులు) ప్రయోజనానికి పెద్దపీట వేసి, కుకి వర్గ (క్రైస్తవ మద్దతు దారులు) ప్రయోజనాలను గాలికొదిలేసి, అగ్గి రాజేయటం కాకపోతే ఏమిటని ప్రశ్నించారు.
చోద్యం వెనుక రాజకీయ కారణాలు కాకపోతే ఎందుకీ వివక్ష, ఉపక్ష అని ఆమె ప్రశ్నించారు. అంతా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని ఇది మైనార్టీ వర్గాలను ముఖ్యంగా క్రైస్తవులను మత ప్రాతి పదికన అణగత్రోక్కటమేనని, మైనార్టీ వర్గ(క్రైస్తవ)ప్రజలను భయ బ్రాంతులను గురిచేసి మరోసారి రాజకీయ ప్రయోజనాన్ని పొందటం కోసమే నని అన్నారు.
మయన్మారు సరిహద్దులనుండి అక్రమ చొరబాట్లను ఎందుకు అడ్డుకోలేక పోతుందని ఇది కేంద్ర ప్రభుత్వ నిఘా విఫల్యమేనని అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొంటే ఏం లాభమని నేడు ప్రపంచం ఈ విషయాన్ని మణిపూర్ మహిళల ఆత్మగౌరవ సమస్య గా చూడటం లేదని, భారతీయ మహిళల సమస్యగా చూస్తూ స్త్రీల ఔన్నత్యాన్ని,వారి స్థితిని చూసి జాలిపడుతుందన్నారు.
ఇది ప్రజా స్వామ్యానికి పెను ప్రమాదకరం అన్నారు,మహిళా ప్రజాప్రతినిధిగా మణిపూర్ మారణఖాండను ఖండిస్తున్నానన్నారు, ఇటువంటి చర్యలు జరుగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోని నిందుతులను కఠినంగా శిక్షించాలన్నారు.