కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే మణిపూర్ ఘటన
- వామపక్ష మహిళా సంఘాల మానవహారం
ఖమ్మం, జులై 21 (జనవిజయం):
కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు కారణమని వామపక్ష మహిళా సంఘాల నేతలు ఆరోపించారు. మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నా మోడీ సర్కార్ పట్టించుకో లేదన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో వామపక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో మానవ హారం నిర్వహించి మణిపూర్ మహిళలకు సంఘీభావాన్ని, చేష్టలుడిగి చూస్తుండిన సర్కార్కు నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాల నేతలు మాట్లాడుతూ మహిళలను నగ్నంగా ఊరేగించి, మానభంగం చేసి చంపేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో పాసిస్టు విధానాలు పెరిగిపోతున్నాయని వారు ఆరోపించారు. చిన్న రాష్ట్రంలో రెండు జాతుల మధ్య సమస్యకు పరిష్కారం చూపలేని ప్రధాన మంత్రి ఇకనైనా గొప్పలు చెప్పుకోవడం మాని తన వైఫల్యాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలన్నారు. సమస్య ఏదైనా మహిళలే సమిధులవుతున్నారని వారు ఆరోపించారు. మణిపూర్ అల్లర్లను తక్షణం నిలుపుదల చేయాలని, మహిళలపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా సమాఖ్య (ఎన్ఎస్ఐడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి, ఐద్వా నాయకురాలు మాచర్ల భారతి, పివోడబ్ల్యూ నాయకురాలు ఝాన్సీ, ఎన్ఎఫ్ఎడబ్ల్యూ నాయకులు తాటి నిర్మల, సీతామహాలక్ష్మీ, రాంబాయి, నాగమణి, ఐద్వా నాయకులు బుగ్గవీటి సరళ, బండి పద్మ, పేవోడబ్ల్యూ నాయకులు ఆవుల మంగతాయి తదితరులు పాల్గొన్నారు