జనవిజయంసాహిత్యంమనసుతో రాస్తే.. ప్రయోజనం ఉంటుందంతే..!

మనసుతో రాస్తే.. ప్రయోజనం ఉంటుందంతే..!

నా’మా’ట-3

కారా మాష్టారు కథల పుస్తకం కోసం ఓ సాహిత్య మిత్రుడికి వద్దకెళ్లాను. “సంపాదనంతా పుస్తకాలు కొనడానికి, సభలకు పోవడానికే సరిపోతోంది. మీరెంటో, మీ పిచ్చెంటో అర్థం కావడం లేదంటూ” ఆయన సతీమణి పలికిన మాటలు ఖంగుతినిపించినా… ఆమెలోని ఆవేదన, అసంతృప్తి ఆలోచింపజేసేవే. ‘ఇవి నాకు మామూలే. నీవేమీ పట్టించుకోకు..” అంటూ అల్మరాలో ఉన్న పుస్తకాన్ని తీసి ఇచ్చాడు. అక్కడ ఎక్కువ సేపు ఉంటే వారిద్దరి మధ్య గొడవలు సృష్టించినవాడినవుతానని వెంటనే కృతజ్ఞతలు తెలిపి బయటకొచ్చేశాను.

అంతకుముందూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. నా ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి ఉందనుకునేవాడిని. చాలా మంది కవుల ఇళ్లల్లో ఇదే పరిస్థితి ఉంటుందా అనే నా అనుమానానికి పై రెండు ఘటనలు బలాన్నిచ్చాయి. రచనలు పుస్తక రూపంగా మారాలన్నా, సాహిత్య సభలకు హాజరు కావడం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాలన్నా వ్యయ ప్రయాసలే. దీని వల్ల వారి వారి ఇళ్లల్లో అసంతృప్తి వ్యక్తం కావడం సహజం. ఇదే విషయాన్ని మిత్రుడిని అడిగాను. ‘ప్రభుత్వ ఉద్యోగివి కాదు. ఏదో చిన్న పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నావు. పుస్తకాలు అచ్చు వేయించడం, సుదూర ప్రాంతాలకు వెళ్లడం అవసరమా’ అని ఏదో బోధ చేయాలనే కుతహలంతో నా మాటల్ని అతని ముందుంచాను. “పది మంది నా కవిత చదివినప్పుడు, విన్నప్పుడు కలిగే సంతృప్తి ఉంది చూశావు. అదెప్పుడూ నా ఆర్థిక వ్యవస్థపై పై చేయిగానే ఉంటుందన్నాడు.” వినడానికి అతని మాటలు వినసొంపుగా ఉన్నా వాస్తవ రూపంలోకి వచ్చినప్పుడు ఎంతైనా ఇబ్బందే.

దీక్షతో, పట్టుదలతో పని చేస్తే జీవితంలో పై మెట్టు ఎక్కే అవకాశముంటుంది. ఏ పనీ లేకుండా సాహిత్యమే అభిరుచిగా కవితలు, కథలు, పాటలు రాసుకుంటూ తిరిగే వారు లేకపోలేదు. వారి వ్యక్తిగత విషయాలు అప్రస్తుతం, కానీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండేవారి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందనేది నా భావన. అలాంటి మిత్రుడిని అడిగితే ఎప్పటికైనా నేను డబ్బులు సంపాదిస్తాను. నా సాహిత్యమే నాకు కూడు పెడుతుంది అన్నాడు. సాధనమున పనులు సమకూరు ధరణిలోన అన్నాడో మహానుబావుడు. డబ్బులు, కూడు సంగతేమోగాని విలువైన సమయాన్ని, బంధాలను కోల్పోవలిసిన పరిస్థితి ఏర్పడుతుందని నేననుకున్నాను. అలాగని అతని ఆత్మవిశ్వాసాన్ని శంకించడం కూడా తప్పే కదా.

ఒక్క రోజులోనే పేరు సంపాదించిన సాహితీవేత్తలైతే లేరు. శ్రీశ్రీ మహాప్రస్థానంతోనే సాహిత్య చరిత్రలో గొప్ప పేరును లిఖించుకున్నాడు. అంతకుమందు ఆయన నుండి సాహిత్యాం రాలేదా అంటే వచ్చిందనే చెప్పాలి. ఎప్పుడైతే తనను తాను సమాజానికి ప్రతిరూపంగా మలుచుకున్నాడో ఆ తర్వాతనే శ్రీశ్రీ కలం నుండి అద్భుతమైన సాహిత్యం వెలువడింది. ఇప్పుడెంతమంది వర్ధమాన కవులు తన సాహిత్యాన్ని సమాజానికి అప్పజెప్పుతున్నారు. తన సాహిత్యంలో సమాజాన్ని జొప్పిస్తున్నారు. ఇదో పెద్ద ప్రశ్న.

ఇక్కడ సమాజం అంటే అనేక ప్రశ్నలు ఉద్భవించవచ్చు. వైరుధ్యాలను బట్టి, ఘర్షణను బట్టి సమాజాన్ని విభజించవచ్చు. పాలితులు, పాలకులు లేదా పీడించే వారు, పీడనకు గురయ్యే వారు ఉండే సమూహం సమాజం. రచయితులుగా, కవులుగా మనం ఏ సమాజానికి నాయకత్వం (సమాజానికి కవులే నాయకులని పెద్దలు చెప్పిన మాట మీ ముందుంచాను) వహిస్తున్నామో ముందుగా గ్రహించాల్సిన అవసరం ఉంది. అనంతరం రచన సాగిస్తే దాని ప్రతిఫలం పొందవచ్చు. ఇదే విషయాన్ని ఓ మిత్రుడికి చెబితే పలు సందేహాలు వ్యక్తం చేశాడు.

రావణుడిని వధించిన తర్వాత రాముడు అయోధ్యకు చేరుకుంటే అందరూ హర్ష ధ్వానాలతో స్వాగతం పలికారు. పట్టలేని సంతోషాన్ని అందరూ వ్యక్తంచేస్తుంటే లక్ష్మణుడు మాత్రం పగలపడి నవ్వుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యచకితులై ఎందుకు నవ్వుతున్నాడనే దానిపై ఆలోచిస్తూ రకరకాలుగా ఒకరికొకరు చెప్పుకున్నారు. అనంతరం లక్ష్మణుడు చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నారు. మరి నీవేం సమాధానం చెబుతావంటూ నన్ను సందేహం అడిగిన వ్యక్తిని నేను అడిగాను. రకరకాలుగా చెప్పి చూశాడు. అంతటితో ఆగకుండా తన మిత్రులకి ఇదే ప్రశ్న వేసి సమాధానం రాబట్టి నాకు చెప్పాడు. ఒక్క ప్రశ్న. సమాధానాలు అనేకం. వీటిలో ఏది కరెక్ట్ అనేది పక్కన పెడితే సమాధానాలు ఇన్ని ఎందుకు వచ్చాయన్నది మనం గమనించాలి.

ఇప్పుడు కవులు ఆలోచిస్తున్న తీరు కూడా ఇదేవిధంగా ఉంది. రకరకాలుగా ఆలోచిస్తూ కవిత్వ సృజన చేస్తున్నారు. అభినందనీయమే. కానీ ఆ కవిత్వ ప్రయోజనం ఎంతమందికి చేరువవుతుందనేది గ్రహించగలగాలి.

నేనీ మధ్య ‘పాలకులు-పాలితులు’ అనే అంశంపై డిబెట్ జరుగుతుంటే వెళ్లాను. ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారండి అన్నాడో పెద్దాయన. వెంటనే మరో పెద్దాయన లేచి ప్రజల సొమ్మే కదా! ప్రజలకు పంచితే తప్పేంటి అన్నాడు. పుట్టినప్పటి నుండి చనిపోయే దాకా అనేక స్కీమ్లు పెట్టి ప్రజలకు సేవ చేస్తుంటే పని గట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆవేశంతో అన్నాడో పెద్దాయన. ఇలా ఒకరు ప్రభుత్వానికి ప్రశంసలు అందచేస్తుంటే మరొకరు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు. డిబెట్ రసవత్తరం సాగుతోంది. నావంతు వచ్చింది. ప్రభుత్వం బాగా పని చేస్తోంది. కానీ నాకు రెండు సందేహాలున్నాయి. ఒకటి గతంలో ఉన్నవాటిని తీసివేసి కొత్తవాటిని ఎందుకు చేపట్టాలి. వాటిని కొనసాగిస్తూనే కొత్త వాటిని ప్రవేశపెట్టవచ్చు కదా. రెండోదేమిటంటే.. అన్ని స్కీమ్లు వర్తింపచేస్తున్నారు సరే. పన్నులు పెంచి నడ్డివిరుస్తున్నారెందుకు అని ప్రశ్నించాను. చప్పట్లు మోగాయా లేదా అనేది పక్కనబెడితే ఈ డిబెట్ ద్వారా మనం ఏం గ్రహించాలి. ప్రభుత్వానికి అనుకూలురు ఉంటారు, ప్రతికూలురు ఉంటారు. కాబట్టి అనుకూలంగా రాసే కవులుంటారు. వ్యతిరేకంగా రాసే కవులుంటారు. వారిని విమర్శించే పని చేయాలా? వద్దా? అనేది మీ నిర్ణయమే. వాస్తవాన్ని వాస్తవంగా గాకుండా మనం ఊహించుకున్న తీరులోనో, మనం వాస్తవంగా భావించిన తీరులోనో రాస్తున్నాము. దీని వల్ల ప్రయోజనం శూన్యం.

‘గులకరాయి విసిరితే జల హృదయం స్పందిస్తుంది’ అంటారు సినారె. పాలకులు వేసే బాణం సూటిగా తగులుతున్నా మనకెందుకులే.., ఎవరో ఒకరు రాస్తారుగా అని మన మనస్సును నిద్రపుచ్చడం సబబేనా..?

తెల్లగా నవ్విందా/
తెరచాపవలే జ్యోత్స్నా సరిత్తులు /
నల్లగా నవ్విందా /
నాగఫణాలెత్తే విషమరాత్రులు/
పచ్చగా నవ్విందా/
పగుళ్లు వారిన నేలలో పల్లవజయంతులు/
ఎర్రగా నవ్విందా/
వెర్రెత్తి అరిచే రుధిర స్రవంతులు…’
అంటూ మనస్సు గురించి విశ్వంభర కావ్యంలో సినారె రాసుకున్నారు.

ఇంతకూ పైన పేర్కొన్న కథలో లక్ష్మణుడు ఎందుకు నవ్వాడో మీకు తెలిస్తే చెబుతారని ఆశిస్తూ.. వచ్చే వారం మళ్లీ నాలుగు అక్షరాలు పంచుకుందాం.

– నామా పురుషోత్తం
(98666 45218)

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి