జనవిజయంఎడిట్ప్రత్యేకంమనస్సనే కాన్వాస్ పై పాటనే ఇంద్రధనుస్సు ఆత్రేయ

మనస్సనే కాన్వాస్ పై పాటనే ఇంద్రధనుస్సు ఆత్రేయ

కిళాంబి వెంకట నరసింహాచార్యులు అంటే ఎవరికీ తెలియకపోవచ్చేమో కాని ఆత్రేయ అంటే మాత్రం ప్రతి తెలుగు వాడి హృదయం ఒక్కసారిగా పులకించి పోతుంది.. అరవై రెండు సంవత్సరాలుగా సినీ జగత్తును, తెలుగు ప్రేక్షకులను సమ్మోహన పరుస్తున్న పాట ఆత్రేయది… 1921 మే 7న జన్మించిన ఆత్రేయకు 2021 మే 7 కు 100 సంవత్సరాలు..శతజయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఈ అక్షర నివాళి…

“శిలలపై శిల్పాలు చెక్కి నారు మన వాళ్ళు సృష్టి కే అందాలు తెచ్చినారు” అనే పాటలోని సాహిత్యం ఆంధ్రదేశంలోని గత వైభవాన్ని కళ్లకు కట్టినట్టు దర్శింపజేశారు…కనులు లేని వారికి తన కలం కంటితో ప్రతి అణువును దర్శింప జేసిన ద్రష్ట ఆత్రేయ.. ఆపాత మధుర సాహిత్యంతో అజరామరమైన పాటలు సృష్టించిన అపురూప కవి ఆత్రేయ అనటానికి నిదర్శనమైన పాటలు కోకొల్లలు…..

మూగమనసులు లోని ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనకజన్మ బాసలు పాట ఈ నాటికీ రత్నమే.. అదొకటేనా తోడికోడళ్ళు చిత్రంలోని కారులో షికారు కెళ్ళే పాలు బుగ్గల పసిడి చానా అనే పాటలో కార్మికుల నిత్య శ్రమను వర్ణించి వారి శ్రమైక జీవన సౌందర్యానికి తన అక్షరాలతో పట్టాభిషేకం చేసిన మానవతావాది ఆత్రేయ..

డాక్టర్ చక్రవర్తి లో నీవు లేక వీణ పలుకలేనన్నది పాట ఆనాటి ప్రేమ గీతాలలో మకుటాయమానంగా నిలిచింది… “చిటపట చినుకులు పడుతూ ఉంటే”అని ఆత్మబలం లోని పాట తెలుగు సినీ చరిత్రలో మొదటి వాన పాటగా చెబుతూ ఉంటారు.. విరహ గీతాలు రాయటంలో సినీ జగత్తులో ఆత్రేయను ఎవరూ అందుకోలేరు అనటానికి ఉదాహరణగా నిలిచిన పాటలు ప్రతి ప్రేమ జీవి హృదయాల్లో నిత్య నూతనంగా వెలుగుతూనే ఉంటాయి…

ఇంద్రధనుస్సులోని నేనొక ప్రేమ పిపాసిని…నీవొకఆశ్రమ వాసివి…అనే పాట ఆత్రేయ కు అత్యంత ప్రీతి పాత్రమైన పాటగా చెబుతారు.. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” …అభినందన సినిమా లోని పాటలతో ప్రతి ఒక్క హృదయాన్ని ద్రవింపజేసాడు ఆత్రేయ.

“ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో”, విధి చేయి వింతలెన్నో అని మరో చరిత్రలో ఆయన పండించిన సాహిత్య ఫలాలు అనిర్వచనీయం… “మౌనమే నీ భాష ఓ మూగ మనసా” అంటూ మన మనసులపై చెరగని ముద్ర వేసినవాడు ఆత్రేయ…గుప్పెడు మనసు లోని ఈ పాట గాన సుధాకరుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడారు…

ఆకలి రాజ్యం సినిమా లోని కన్నెపిల్లవని కనులున్నవని ఎంత వగలు పోతున్నావే చిన్నారి పాట, ముఖ్యంగా “సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్” పాట ఇప్పటికీ ఒక సంచలనమే… గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రమణ్యం ప్రేమించి ఆరాధించి తనకెంతో ఇష్టమని ప్రకటించిన ఆత్రేయ పాటలు.. కోకిలమ్మ సినిమా పాటలు… ముఖ్యంగా “ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై” అనే పాట ఏ వేదికపై పాడినా బాలూ కనులు ఆశ్రువులు చిందించటం ఆయనతో పాటు మన మనస్సు ద్రవించటం ఆత్రేయ అక్షరానికి ఉన్న శక్తి ఏంటో తెలుపుతుంది…”పల్లవించవా నాగొంతులో పల్లవి కావా” అనే పాట మూగవాడికి కూడా పాటలు నేర్పుతుందంటారు వేటూరి..

తలుపు మూసిన తలవాకిటనే.. పగలు రేయి నిలుచున్నా.. పిలిచి పిలిచి బదులే రాక.. అలసి తిరిగి వెళుతున్నా… అంటూ ఒక భగ్న ప్రేమికుడిగా తన అనుభవాల్నే కవిత్వీకరించాడేమో అనిపిస్తుంది… ఉన్నది వదిలేవు-లేనిది కోరేవు…ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు”…అనే ఆత్రేయ పంక్తులు సాహిత్య చరిత్రలో ఇరవై కావ్యాలతో సమానమని సి.నారాయణరెడ్డి పేర్కొనటంలో ఆత్రేయ సాహిత్య చరిత్రను ఎంతగా ప్రభావితం చేసాడో స్పష్టం అవుతోంది…

“మనసు గతి ఇంతే మనసున్న మనిషికి సుఖం లేదంతే” అంటూ ప్రేమనగర్ లోని పాటతో తన మనస్సులోని హాలాహలాన్ని అక్షర రూపంలో,అంత్య ప్రాసల విన్యాసంతో సాహిత్య పటిమను దర్శింప జేసిన మన”సు కవి “ఆత్రేయ…. అలతి అలతి పదాలతో అనంత భావాలను వ్యక్తం చేస్తూ మనస్సు అంతరాంతరాలను కదిలించి దృశ్య కావ్యంగా మన ముందుంచిన ఆత్రేయ తెలుగు సినీ సాహిత్య చరిత్రలో శాశ్వత సంతకం…..శతజయంతి వేళ మనస్సుకు తన పాటతో శస్త్రచికిత్స చేసి స్వాంతన చేకూరుస్తున్న వైద్యుడు ఆచార్య ఆత్రేయ కు నీరాజనం….

  • అట్లూరి వెంకటరమణ
    కవి, రచయిత
    9550776152

జనవిజయంలో సంగీత ప్రియులకోసం ప్రారంభించిన తెలుగు హిట్ సాంగ్స్ లో మొదటి టపా ఆత్రేయ మనసు పడ్డ పాట.. నేనొక ప్రేమ పిపాసిని..  పాటకు స్పందించి గతంలోనే ఆయన వ్రాసుకున్న ఈ వ్యాసం పంపించారు అట్లూరి వెంకటరమణ గారు.

—-

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి