మహోన్నత విద్యా స్ఫూర్తి ప్రదాత ‘డాక్టర్ బిఎస్ రావు’
- లక్షలాదిమంది విద్యార్థులకు వెలుగులు నింపిన శ్రీ ‘చైతన్య’ శిల్పి
- శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బి.ఎస్ రావు సంస్మరణ సభలో తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్
ఖమ్మం, జూలై 23 (జనవిజయం):
‘శ్రీ చైతన్య’ ఇండియా విద్యాసంస్థల ఫౌండర్, చైర్మన్ డాక్టర్ బి.ఎస్ రావు స్ఫూర్తిదాయకులని, ఆయన చూపిన మార్గం లక్షలాదిమంది విద్యార్థులలో వెలుగులు నింపాయని, కోట్లాదిమంది విద్యా కుసుమాలకు ఆదర్శప్రాయులయ్యారని ‘తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల’ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ కొనియాడారు.
ఆదివారం ఖమ్మం నగరంలోని స్వర్ణ భారతి కమ్మవారి కల్యాణ మండపంలో డాక్టర్ బి.ఎస్ రావు సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఎస్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల’ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ… డాక్టర్ బిఎస్ రావు అకాల మరణం చాలా బాధాకరమని, విద్యావ్యవస్థలను మహోన్నత స్థాయికి తీసుకువెళ్లడం ఆయనకే సాధ్యమైందని అన్నారు.
చిన్నపాటి విద్యాసంస్థను నెలకొల్పి, దేశవ్యాప్తంగా నలుదిక్కులా వందలాది స్కూళ్లను, జూనియర్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపించి, లక్షలాది మంది విద్యార్థులకు వెలుగులు నింపారని కొనియాడారు. దేశవ్యాప్తంగా ‘శ్రీ చైతన్య’ను ఒక తిరుగులేని విద్యా శక్తిగా తయారుచేసిన రూపశిల్పి డాక్టర్ బి.ఎస్ రావు అని అన్నారు.
ఈ సందర్భంగా ‘శ్రీ చైతన్య’ విద్యాసంస్థల డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య మాట్లాడుతూ.. ఆశయ సాధన కోసం అనుక్షణం శ్రమిస్తూ, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలనే సంకల్పంతో ‘డాక్టర్ బి.ఎస్ రావు’ నిరంతరం శ్రమించారని అటువంటి మహోన్నతమైన వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలను ఒక దేవాలయంలా మార్పు చేశారని, అటువంటి మహనీయులు మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకులని, కోట్లాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల హృదయ్ స్కూల్ చైర్మన్ సాంబశివరెడ్డి, చింతనిప్పు రామకృష్ణ, చింతనిప్పు శ్రీదేవి, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల సీఈవో శ్రీనివాస్, కాలేజీ డీన్స్, ఏజీఎంఎస్, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పాఠశాల డీన్స్, ఏజీఎంఎస్, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.