లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి
- కలెక్టర్ ప్రియాంక అలా
- ఈ రాత్రికి 46 అడుగులకు చేరే అవకాశం
భద్రాచలం, జూలై 20, (జనవిజయం):
భద్రాచలంలో గోదావరి వరద క్రమంగా పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. గురువారం భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతమైన కొత్త కాలనీలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ వేముకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పునరాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. కొత్త కాలనిలో నీట మునిగిన కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. పునరావాస కేంద్రాలలో సురక్షిత మంచినీరు, విద్యుత్, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణతో పాటు అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు తో పాటు తగినన్ని మందులు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.
ఈ రాత్రికి 46 అడుగులకు చేరే అవకాశం ఉన్నందున జాప్యం చేయక ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. గోదావరి పెరిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని చెప్పారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని చెప్పారు.
అనంతరం విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగు నీరు తరలింపును పరిశీలించారు. స్నాన గాట్ల వద్ద భక్తులు గోదావరిలోకి దిగకుండా నిరంతర గస్తీ నిర్వహించాలని చెప్పారు. నీటి తొలగింపుకు అడ్డు రాకుండా వ్యర్థాలను తొలగించాలని భద్రాచలం ప్రత్యేక అధికారి నాగలక్ష్మి ని, పంచాయతీ ఈఓను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటేశ్వర రెడ్డి, ఆర్డిఓ రత్న కళ్యాణి, తహసిల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.