లోపాలు లేని ఓటరు జాబితా రూపొందించాలి
- కలెక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 20(జనవిజయం):
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్పష్ట మైన, పారదర్శకమైన తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా అన్నారు. గురువారం కలెక్టరేట్ నుండి ఫొటో ఎలక్టోరల్ రోల్స్, ప్రత్యేక ఓటరు సవరణ 2023 పై ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేయునపుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఇంటింటి సర్వేలో గుర్తించిన అర్హులైన ఓటరులకు ఓటు హక్కు కల్పన వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ పూర్తి చేయలన్నారు.
ఫారం-6, ఫారం-7, ఫారం-8ల ద్వారా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, మరణించిన ఓటరు తొలగింపు దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఫారం-8లో గుర్తించిన కరెక్షన్స్ ఆప్షన్లు, చిరునామా మార్పులు, పీడబ్ల్యూడీ మార్కింగ్ తదితర ఆప్షన్ల గురించి ఓటర్లుకు వివరించాలన్నారు. బిఎల్ఓ యాప్ లో ఓటరు వివరాల నమోదులో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
ఓటర్లకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా రేషనలైజేషన్ చేసేందుకు నివేదికలు ఇవ్వాలని పేర్కొన్నారు. చనిపోయిన ఓటర్ల విషయంలో కచ్చితంగా మరణ ధ్రువీక రణ పత్రాన్ని పొంది, ఫారం 7 ద్వారా నోటీస్ జారీ తదుపరి పక్కా ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల నుండి లిఖిత పూర్వకంగా తీసుకున్న తరవాతే ఓటరు జాబితా నుంచితొలగించాలని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా ఉన్న ప్రతి ఒక్కరి ఫొటో, వివరాలు సరిగ్గా ఉన్నవి, లేనివి పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు, మౌలిక సదుపాయాలు ఉండాలని చెప్పారు. 6 కంటే ఎక్కువ ఓట్లు ఒకే ఇంటిలో ఉన్న వాటికి ఫారం 8 ద్వారా కరెక్షన్స్ ద్వారా నమోదులు చేయాలని చెప్పారు. ఈ టెలి కాన్ఫరెన్సులో ఎలక్ట్రో రిజిస్ట్రేషన్, సహాయ ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.