– వనమా కు ఘన స్వాగతం
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 10 (జనవిజయం) : ఎంఎల్ఏ గా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే అనంతరం గురువారం తొలిసారిగా కొత్తగూడెం విచ్చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కు బిఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గ సరిహద్దు నాయకుల గూడెం నుండి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దఎత్తున వనమాకు అపూర్వ స్వాగతం పలికారు. భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా వనమా ఉద్వేగంగా ప్రసంగించారు.
తనకు కొత్తగూడెం ప్రజలు ఇచ్చిన అపూర్వ స్వాగతంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. తాను మీ వాడినని వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుండి బిఆర్ఎస్ తరపున తానే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. తాను బతికున్నంత వరకు నియోజకవర్గ ప్రజలను తన గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. న్యాయం తన వైపు ఉంది న్యాయమే గెలిచిందని అని పేర్కొన్నారు. తుది శ్వాస విడిచే వరకు కొత్తగూడెం నియోజకవర్గ సేవలోనే ఉంటానని వనమా ఉద్వేగంగా తెలిపారు. తనకు ప్రజాస్వామ్యం న్యాయస్థానాల పట్ల అచంచల విశ్వాసం ఉందని తెలిపారు.
కొత్తగూడెం ప్రజల నుండి తనను ఏ శక్తి విడదీయలేదని అన్నారు. 20 సంవత్సరాల పాటు సర్పంచిగా, మునిసిపల్ చైర్మన్ గా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశానట్లు గుర్తుచేశారు. కొత్తగూడెంలో ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసిన తనకు మరో విజయం తధ్యమని వెల్లడించారు. తాను ఇక్కడే పుట్టి పెరిగిన స్థానికుడనని, బీసీ కులానికి చెందిన వ్యక్తినని, రేపటి నుండే కార్యాచరణలో దిగుతానని అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కి ఎన్ని నిధులైనా సరే ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని వనమా తెలిపారు.
కళాకారులు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో, సుమారు 30 కిలోమీటర్ల పాటు, భారీ ర్యాలీ నిర్వహించారు. పోస్ట్ఆఫీస్ సెంటర్ లో క్రేన్ సహాయంతో భారీ గజమాలతో కార్యకర్తలు ఎమ్మెల్యే వనమాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్తవల శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, జడ్పిటిసి బరపటి వాసు ,చుంచుపల్లి ఎంపీపీ బాదవత్ శాంతి, సుజాతనగర్ ఎంపీపీ భూక్య విజయలక్ష్మి, పాల్వంచ ఎంపీపీ మడవి సరస్వతి, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ భూక్యాసోన, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, సుజాతనగర్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పెద్ద మల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.