భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్18 (జనవిజయం): హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విశేషమైన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఐఐటీ పాట్నాలో సీటు పొందిన కొర్సా లక్ష్మి నీ అభినందించారు. దుమ్ముగూడెం మండలం కాటాయగూడ గ్రామానికి చెందిన “కోర్సా లక్ష్మి”తో శుక్రవారం దత్తాత్రేయ టెలిఫోన్ ద్వారా మాట్లాడి అభినందనలు తెలిపారు. లక్ష్మిని హరియాణా రాజ్ భవనకు వచ్చి ఆతిధ్యం స్వీకరించాలని గవర్నర్ కోరారు. భవిష్యత్తులో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని దత్తాత్రేయ భరోసా కల్పించినట్లు అధికారులు తెలిపారు.
గిరిజన దంపతులైన కన్నయ్య, శాంతమ్మ దంపతులకు జన్మించిన కొర్స లక్ష్మి బీద కుటుంబంలో జన్మించినప్పటికీ నిరక్షరాస్యతను ఎదిరించి, ప్రతిష్టాత్మకమైన ఐఐటీ పాట్నాలో సీటు సాధించింది. ఈ విషయమై దత్తాత్రేయ సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్మి తండ్రి సమీప గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఐస్ క్రీంలు విక్రయించి, కుటుంబాన్ని పోషిస్తున్నారాని, ఆమె తల్లి గారు ఇంటిని చూసుకుంటుందని, వారికి విద్య లేకపోయినా, కోర్సా లక్ష్మిని తల్లిదండ్రులు ఆమెకు జీవితంలో రాణించడానికి అన్ని అవకాశాలను అందించాలన్న తాపత్రయాన్ని, నిరాశపర్చకుండా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా సంస్థలో సీటు సంపాదించిన లక్ష్మి తల్లిదండ్రుల కలలను నిజం చేయడం అభినందనీయమని శ్రీ దత్తాత్రేయ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
స్థానిక గురుకులంలో 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించిన లక్ష్మికి తన చదువు పట్ల ఉన్న నిబద్ధత ఫలితంగా ఆమె పదో తరగతి పరీక్షలలో 10/10 జి పి ఎ ని సాధించడం గర్వకారణమని, 2021-23 విద్యా సంవత్సరంలో, లక్ష్మి తన ఇంటర్మీడియట్ (ఎం పీసీ) పరీక్షలలో 1000కి 992 ర్యాంకు సాధించడం, భద్రాచలం ట్రైబల్ గురుకుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సి ఓ ఈ)లో నైపుణ్యం కలిగిన బోధకుల మార్గదర్శకత్వంలో ఆమె జే ఈ ఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం అహర్నిశలు కష్టపడి చదివి ఇటీవల జరిగిన జే ఈ ఈ అడ్వాన్స్డ్ పరీక్షలో 1371వ ర్యాంక్ సాధించి, ఐఐటి పాట్నాలో బీటెక్ (ఈ ఈ ఈ) లో సీటు సంపాదించడంపై తెలుగు బిడ్డగా మనందిరికీ గర్వకారణమని బండారు దత్తాత్రేయ కొనియాడారు.
లక్ష్మి సాధించిన విజయాలు ప్రతిచోటా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, సవాళ్లతో కూడిన కుటుంబ నేపథ్యంలో కూడా శ్రేష్ఠతను సాధించడానికి అవధులు లేవని రూపిస్తుందని, తన ప్రతిభతో లక్ష్మి అందరి మనసులు గెల్చుకుందని, ఐఐటీ పరీక్షల్లో ఆమె అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు భవిష్యత్తులో లక్ష్మి తన ప్రతిభతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు శ్రీ దత్తాత్రేయ గారు తెలిపారు.