Saturday, September 30, 2023
HomeUncategorizedఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ 22172.10లక్షలతో బడ్జెట్‌ ఆమోదం

ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ 22172.10లక్షలతో బడ్జెట్‌ ఆమోదం

ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 22172.10 లక్షలతో బడ్జెట్‌ రూపొందించగా, సభ్యులు ఆమోదించారు

ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ 22172.10లక్షలతో బడ్జెట్‌ ఆమోదం

ఖమ్మం, ఫిబ్రవరి 28(జనవిజయం): ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 22172.10 లక్షలతో బడ్జెట్‌ రూపొందించగా, సభ్యులు ఆమోదించారు. మంగళవారం కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాల్‌ లో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ అధ్యక్షతన కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి, బడ్జెట్ ఆమోదించారు.

      ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్, కమిషనర్‌ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. మునిసిపల్ కార్పొరేషన్ అకౌంట్‌ అధికారి శివలింగం బడ్జెట్‌ పద్దును చదవగా, సభ్యులు ఏకగ్రీ వంగా అమోదించారు. కార్పొరేషన్ బడ్జెట్‌లో సొంత ఆదాయం రూ. 8056.10 లక్షలుగా చూపారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల పన్నుల ద్వారా రూ. 3078.00 లక్షలు, కిరాయిల ద్వారా రూ. 472.10 లక్షలు, భవన నిర్మాణ అనుమతు లు, ఎల్‌ఆర్‌ఎస్‌, ఇతర టౌన్‌ ప్లానింగ్‌ సేవల ద్వారా రూ. 2942.00 లక్షలు, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు, ఇతర శాని టేషన్‌ సేవల ద్వారా రూ. 260 లక్షలు, త్రాగునీటి పన్నులు, ఇతర ఇంజినీరింగ్‌ సేవల ద్వారా రూ. 1193.00 లక్షలు సొంత ఆదాయంగా వస్తాయని బడ్జెట్‌లో చూపారు. వేతనాలు, పీఎఫ్‌, ఈపీఎఫ్‌, కార్యాలయ నిర్వహణ, గ్రీన్ బడ్జెట్, విద్యుత్‌ చార్జీల రూపేణా రూ. 8056.10 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు. నాన్‌ప్లాన్‌ గ్రాంట్ల కింద 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి, అమృత్ పథకం, లే అవుట్ క్రమబద్దీకరణ, ప్రత్యేక అభివృద్ధి నిధులు, ముఖ్యమంత్రి వాగ్దాన నిధులు ద్వారా రూ. 13382.00 లక్షలు, ప్లాన్‌ గ్రాంట్లలో ఎస్ఎఫ్ సి, కార్పొరేషన్ అభివృద్ధి, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ ద్వారా రూ. 80 లక్షలు వస్తాయని అంచనాలు వేశారు. నియోజవర్గ అభివృద్ధి నిధులు, స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ నిధులు, ఎంపీ ల్యాడ్స్‌ నిధులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా రూ. 92.00 లక్షలు వస్తాయని చూపారు. మొత్తం బడ్జెట్‌లో జీతాలు, కరంట్‌ బిల్లులు, పాలన నిర్వహణ ఖర్చులు పోయిన తర్వాత మిగిలిన బడ్జెట్‌ లో 1/3 శాతం విలీన గ్రామాల అభివృద్ధికి రూ. 586.55 లక్షలు కేటాయించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ. 2801.34 లక్షలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణకు రూ. 821.00 లక్షలు, విద్యుత్ చార్జీల కొరకు రూ. 641.00 లక్షలు, రుణాల చెల్లింపుకు రూ. 126.00 లక్షలు, గ్రీన్ బడ్జెట్ కొరకు రూ. 805.61 లక్షలు, వివిధ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు వార్డు బడ్జెట్ క్రింద రూ. 1173.00 లక్షలు, ఇంజనీరింగ్ విభాగ వ్యయం క్రింద రూ. 491.00 లక్షలు, సాధారణ పరిపాలన వ్యయం క్రింద రూ. 502.50 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగ వ్యయం క్రింద 108.00 లక్షలు, ప్రజా సౌకర్యాలకు రూ. 30.00 లక్షలుగా చూపించారు.సొంత ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన రూ. 292.14 లక్షలు మిగులు బడ్జెట్‌గా చూపారు. వీటితో డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నా రు.

     మునిసిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా సవివరంగా బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. గతంలో ఆదాయం, భవిష్యత్తు ఆదాయం బడ్జెట్ లో వివరించారన్నారు. 2014 సంవత్సరం తర్వాత, కార్పొరేషన్ గా అవతరించిన తర్వాత ఖమ్మం అభివృద్ధి లో రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో ఈ అభివృద్ధి జరిగిందన్నారు. ఖమ్మం ను స్వంత ఇల్లులా భావించాలని ఆయన తెలిపారు. ఒకప్పుడు మురికికూపంగా ఉన్న 3వ పట్టణ ప్రాంతం, ఇప్పుడు గోళ్లపాడు ఆధునికీకరణ పనులతో సుందరంగా తయారైందన్నారు. అభివృద్ధి, సౌకర్యాల కల్పనతో ప్రాంత విలువ పెరిగిందన్నారు. సౌకర్యాల కల్పన బాగా చేస్తున్నట్లు, నిర్వహణ పై దృష్టి పెట్టాలన్నారు. ఆదాయ వనరుల పెంపుకు చర్యలు చేపట్టాలన్నారు. అందరం టీమ్ లాగా కలిసి పనిచేయాలని ఎమ్మెల్సీ అన్నారు.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, వచ్చే ఆర్థిక సంవత్సరం రాబడి, ఖర్చుల గురించి వివరంగా ఉన్నట్లు తెలిపారు. రి అసెస్మెంట్ చేయని ఆస్తులను భువన యాప్ ద్వారా అస్సెస్ చేయాలని అన్నారు. ట్రేడ్ లైసెన్సుల విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. లే అవుట్ అనుమతులతో ఆదాయం పెరిగిందన్నారు. రహదారుల ఆక్రమణ చేస్తున్న వీధి వ్యాపారులను స్ట్రీట్ వెండర్ జోన్లకు తరలించాలన్నారు. జీవో 58, 59 లపై కార్పొరేటర్లు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, నగర సమగ్రాభివృద్ధికి బడ్జెట్ దోహదపడుతుందన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో నిరంతరం నగరాభివృద్ది కోసం శ్రమిస్తున్నామన్నారు. అన్ని డివిజన్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, వాస్తవిక ఆదాయాలు, రాబడులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్ కు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ అమలుకు సహకరించాలని కమీషనర్ కోరారు.బడ్జెట్ సమావేశంలో నగర కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments