Tuesday, October 3, 2023
Homeవార్తలుఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

  • ముఖ్య అదికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్
  • అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ

ఖమ్మం, జూలై 26 (జనవిజయం):

వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని, రాబోయే 48 గంటలు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వుండి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ నుండి పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి రెవిన్యూ, పోలీస్, పంచాయితీరాజ్, ఇర్రిగేషన్, మునిసిపల్ అధికారులతో కలెక్టర్ వర్ష పరిస్థితులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ శాఖ సూచన ప్రకారం జిల్లాలో 40 సెంటిమీటర్లకు పైగా వర్ష సూచన ఉన్నట్లు, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. పిఆర్, ఆర్ అండ్ బి, ఇర్రిగేషన్ ఇంజనీర్లు సంబంధిత తహసిల్దార్లతో టచ్ లో వుండాలన్నారు. ఇర్రిగేషన్ ఏఇ లకు వారి వారి పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన వుండాలన్నారు. వాగులు పొంగిపొర్లి కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమై రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రమాదానికి ఆస్కారం వుండి, అవసరమున్నచోట రహదారిని మూసివేయాలని, రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. ప్రమాదమున్న చెరువుల వద్ద ఇసుక బస్తాలు సిద్దం చేసుకోవాలన్నారు. వర్షం లో చేపలు పట్టుటకు వెళ్లకుండా చూడాలన్నారు.

లోతట్టు ముంపు ప్రదేశాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి రాకుండా తగుచర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రధాన కార్యస్తానంలోనే ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలు, పీఆర్, ఆర్ అండ్ బి రోడ్లపై, కల్వర్టులపై నీరుప్రవహించే ప్రాంతాల్లో రవాణా నిషేధించి, రాత్రి పగలు సిబ్బందితో నిఘా పెట్టాలన్నారు. రోడ్లపై రవాణా నిషేధించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రోడ్లను సూచిస్తూ, 2 కి.మీ. ముందుగానే సూచికలు ప్రదర్శించాలని, ప్రవాహం కిరువైపుల ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి, సిబ్బందిని కాపలా పెట్టాలని ఆయన తెలిపారు.

జిల్లాలో 128 చెరువులు అలుగు పారుతున్నట్లు, అలుగుల వద్ద చేపలు పట్టకుండా నివారించాలని, ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్ల మూసివేతలై సంబంధిత గ్రామాల్లో టాం టాం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఏ ఏ చెరువులు, కుంటలు ప్రమాదకరంగా మారతాయో అంచనా వేసుకొని, తదనుగుణంగా నష్ట నివారణగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఉరుములు, పిడుగులతో ప్రాణ నష్టం జరుగుతున్నట్లు, వీటి నివారణకు దామిని (damini) యాప్ పై డౌన్లోడ్ పై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. దామిని యాప్ తో పిడుగుల గురించి ముందస్తుగా తెలుసుకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు స్థానికంగా ఉంటూ, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గండ్లు పడే అవకాశం ఉన్న చెరువులు తమ పరిధిలో ఎన్ని, ఎక్కడెక్కడ ఉన్నాయో జాబితా తీసుకొని, ఆయా ప్రాంతాల్లో ప్రభావితం అయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం చేయాలన్నారు. ప్రతి పోలీస్ వాహనంలో టార్చ్, రోప్, ట్రీ కట్టర్, గొడుగు తదితర వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పై ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని ఆయన అన్నారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఇర్రిగేషన్ సిఇ శంకర్ నాయక్, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, సిపిఓ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments