ఖమ్మం, ఆగస్టు 12 (జనవిజయం): రాష్ట్రంలో క్రొత్తగా నిర్మాణం చేసుకున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాల్లో మొట్టమొదటి సోలార్ షెడ్ ఖమ్మంలో నిర్మాణం పూర్తయి ఆగస్టు 15 న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్ కొరకు సోలార్ షెడ్ తోపాటు, 200 కిలో వాట్ సోలార్ పవర్ ప్లాంట్, గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలో క్రొత్తగా నిర్మాణం చేసిన ఐడిఓసి లలో ఖమ్మం జిల్లాలో మొట్టమొదటగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఖమ్మం కలెక్టరేట్, దేశంలోనే పూర్తిగా సోలార్ పవర్ ఏర్పాటుచేసిన మొదటి కలెక్టరేట్ భవనంగా నిలుస్తుంది. ఇట్టి 200 కిలో వాట్ సోలార్ పవర్ ప్లాంట్ తో రోజుకు 800 నుండి 1000 యూనిట్ల పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇట్టి ప్లాంట్ ఉత్పత్తి పవర్ ని ఐడిఓసి అవసరాలకు ఉపయోగిస్తారు. సోలార్ ప్లాంట్ తో ఐడిఓసి భవనమంతా గ్రీన్ బిల్డింగ్ గా మారుతుంది. ఐడిఓసి అవసరాలకు పోనూ మిగిలిన పవర్, గ్రిడ్ కు అనుసంధానంతో గ్రిడ్ కు వెళుతుంది. దీనితో విద్యుత్ నికర వినియోగానికి మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో నెలకు సుమారు 80 వేల నుండి లక్ష రూపాయల వరకు విద్యుత్ చార్జీల ఆదా అవుతుంది. సిబ్బంది, అధికారుల వందలాది వాహనాలకు పార్కింగ్ ఏరియాకు, రూఫింగ్ నీడగా కూడా ఇది ఉపయోగపడుతుంది.